బంగారు తెలంగాణ దిశగా..

  దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నూతన రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. రాష్ట్రంలో నీటి వనరులు, రహదారి సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, విద్యుచ్ఛక్తి మొదలైన రంగాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి మిగతా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రంలోని రైతుల్లో కోటి ఆశలను రేకెత్తిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18 లక్షల 82 వేల ఎకరాలకు […] The post బంగారు తెలంగాణ దిశగా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నూతన రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. రాష్ట్రంలో నీటి వనరులు, రహదారి సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, విద్యుచ్ఛక్తి మొదలైన రంగాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి మిగతా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రాష్ట్రంలోని రైతుల్లో కోటి ఆశలను రేకెత్తిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18 లక్షల 82 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని అధికారుల అంచనా. దారి పొడుగునా ఉండే గ్రామాలకు, హైదరాబాదు నగరానికి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ నీటిని వినియోగిస్తారు. బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారంగా రూపుదిద్దుతున్న ఈ ప్రాజెక్టును గోదావరి నీటిని వీలైనంత అధికంగా ఉపయోగించుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుండి హైదరాబాదు, చిట్యాల, శామీర్‌పేట తదితర ప్రాంతాల వరకు నీటి సౌకర్యం అందే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. శ్రీరాంసాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానిస్తారు.

ఇప్పుడు గోదావరిపై మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలను నిర్మిస్తున్నారు. ఒక బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని పంపు హౌజు నుండి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజీ ముందుకు వదిలేలా ఏర్పాటు ఉంటుంది. గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈ ఏర్పాటు ఉండడం విశేషం. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం రూపొందిస్తోన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సీమ పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నంది మేడారం అండర్ టన్నెల్‌లోని మొదటి మోటారు ద్వారా నంది మేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టిఎంసిల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేశారు. నంది మేడారం పంప్ హౌజ్‌లోని 124.4 మెగావాట్ల తొలి మోటారు వెట్న్‌న్రు కూడా నిర్వహించారు. దాంతో సర్జ్‌పూల్ నుండి నీటిని ఎత్తిపోయడం ప్రారంభమైంది.

ఈ సందర్భం తెలంగాణ సాగు, తాగు నీటి చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పింది. యావత్ ఆసియా ఖండానికే గర్వకారణంగా ఈ ప్రాజెక్టును పేర్కొంటున్నారు. భూగర్భంలో కూడా ప్రాజెక్టులో కొంత భాగాన్ని నిర్మించడం నిపుణులను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. వందల కిలోమీటర్ల దూరం కొనసాగే భారీ టన్నెల్స్, అతి పెద్ద సర్జ్ పూల్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజుల నిర్మాణం కాళేశ్వరం ప్రత్యేకతను చాటి చెపుతాయి. పంటలకు సాగునీరు, మనుషులకు తాగునీరు, పారిశ్రామిక ఉత్పాదనలకు అదనపు నీరు సమకూరితే ఆ సమాజం ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. అందుకు బాసటగా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు మణిహారంగా నిలుస్తుంది.

మరోవైపు రైతుల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించడమే కాకుండా శరవేగంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. గోదావరి, కృష్ణా నదులపై 36 ప్రాజెక్టులను నిర్చించేందుకు ప్రభుత్వం తలపెట్టింది. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కార్యరూపంలోకి తెచ్చింది. గత ఐదేళ్ల కాలంలో నీటి పారుదల రంగంలో 77,777 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రజోపయోగ పనులను చేపట్టింది. ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా తెలంగాణలో పూడుకునిపోయిన అనేక చెరువులకు మోక్షం లభించింది. ఈ పథకంలో భాగంగా 46,531 చెరువుల పునరుద్ధరణ ఆయా ప్రాంతాల్లోని భూగర్భజల మట్టం పెరిగేలా చేసింది. 2015 డిసెంబరు మూడో వారంలో ప్రారంభమైన ఈ పథకం తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 250 టిఎంసిల కన్నా అధికంగా సామర్థ్యం ఉండేలా ట్యాంకులను పునరుద్ధరించి వ్యవసాయం, నీటిపారుదల, మంచినీటి అవసరాలకు వినియోగిస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో మంచి పథకం ‘మిషన్ భగీరథ’. 2016 ఆగస్టు 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండలో ఈ పథకం ప్రారంభమైంది. కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్ల పైపు లైన్ మార్గం ద్వారా రాష్ట్రంలోని 24 వేల గ్రామాలు, 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందజేస్తారు. ఇప్పటికే అధిక శాతం ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయగలిగింది.

తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు. తెలంగాణ ఏర్పాటు నాటికి 10 జిల్లాలు ఉండగా మరో 23 కొత్త జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిపాలనను మరింత వికేంద్రీకరించేందుకు ఈ కొత్త జిల్లాలు దోహదపడ్డాయి. నూతనంగా 23 జిల్లాలతో పాటు 26 కొత్త డివిజన్లను, 125 నూతన మండలాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పర్చింది. వీటి వల్ల గ్రామీణ ప్రజానీకానికి పరిపాలన మరింత చేరువైంది. వీటితో పాటు 1311 గూడాలను, గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ఒక సంవత్సర కాలంలోగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు మెరుగయ్యాయి. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలపై కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించి, మొదటగా రహదారి నిర్మాణాలను పూర్తి చేసింది.

కొత్త జిల్లాలు, కొత్త మండలాల ఏర్పాటు అనంతరం ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి, ప్రతి మండల కేంద్రం నుండి నూతన జిల్లా కేంద్రానికి రహదార్ల సౌకర్యం కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో 2015 జనవరి 30వ తేదీ నాటికి మొత్తం రహదారుల పొడవు 26,837 కి.మీ. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలో మీటరుకు రోడ్డు సాంద్రత 0.23 కిలో మీటర్లుగా ఉంది. మరో ఏడు రోడ్లను బిఒటి పద్ధతిలో నిర్మించేందుకు ప్రతిపాదించారు. మరోవైపు నిరంతర విద్యుత్తు సరఫరాపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. గృహావసరాలతో పాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేయగలగడం ప్రభుత్వం సాధించిన విజయమే. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, కొనుగోళ్లు, విద్యుచ్ఛక్తి అవసరాలను గణించడం ద్వారా ఎక్కడా సమస్య లేకుండా చూడగలగడం మామూలు విషయం కాదు.

తెలంగాణ ఏర్పడ్డ ఆరు నెలల్లోగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అందజేసింది. 28 వేల మెగావాట్లకు పైగా ఉన్న డిమాండుకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేవిధంగా విద్యుచ్ఛక్తి వ్యవస్థను తీర్చిదిద్దారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం గడిచిన ఐదేళ్లలో వార్ధా డిచ్‌పల్లి, అంగుల్ శ్రీకాకుళం, నిజామాబాద్ మహేశ్వరం మొదలైన కొత్త లైన్లను పూర్తి చేయడం వల్ల ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య 10,250 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా దేశంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీలలో అతి తక్కువ నష్టాలను నమోదు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2018 19 సంవత్సరంలో సరఫరా నష్టాలను 2.86 శాతానికి, పంపిణీలో నష్టాలను 10.49 శాతానికి తగ్గించగలిగింది. ఇది ఒక రికార్డు. పారిశ్రామిక రంగానికి గతంలో రెండు రోజుల పవర్ హాలీడే ప్రకటిస్తుండగా తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరంతరాయంగా విద్యుత్తును పారిశ్రామిక రంగానికి అందజేయగలగడం మరో రికార్డు. తెలంగాణ విద్యుత్తు వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. సౌర విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉంది.

వ్యవసాయదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. తెలంగాణలో రైతుల ప్రధాన సమస్యలు భూయాజమాన్య సమస్యలు, ఆర్థిక భారం, కరెంటు కష్టాలు, సాగునీటి ఇబ్బందులు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 89.1 శాతం మంది రైతులు రుణ భారంలో కూరుకుపోతున్నారు. ఈ జాబితాలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది. అందుకే ఈ ప్రధాన సమస్యలను ఎదుర్కొని, రైతు ఆత్మహత్యలను గతకాలపు పీడకలలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. పంటకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకం రైతులకు వరం. గతంలో రెండు పంటలకు కలిపి ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు అందజేసింది. ఈ ఏటి నుండి ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పది వేల రూపాయలను రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. గత ఖరీఫ్ సీజన్‌లో 58.34 లక్షల మంది రైతులకు 5,730 కోట్ల రూపాయలను ఈ పథకం కింద అందజేశారు.

రబీ సీజన్‌లోనూ వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేసింది. రైతు బంధు పథకానికి తోడు ప్రభుత్వం రైతులకు జీవిత బీమా పథకాన్ని కూడా అమలు చేయడం విశేషం. అరవై ఏళ్ల లోపు వయసున్న రైతులకు మాత్రమే వర్తించే ఈ పథకం కింద ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకం కింద రైతు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోపే బీమా సొమ్ము ఆ రైతు కుటుంబాలకు చేరేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బీమా సౌకర్యం వల్ల రైతు కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పింది. భూముల వివరాలను డిజిటలైజ్ చేయడం వల్ల అనవసర వివాదాలు లేకుండా భూ సమస్యలను ప్రభుత్వం తేలికగా పరిష్కరించగలిగింది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయడం ద్వారా భూయాజమాన్య హక్కుల కల్పన లక్షలాది వ్యవసాయదారులకు వరంగా మారింది.

గ్రామాల్లో ఉండే రైతులతో పాటు కుల వృత్తులు చేసుకునేవారిపై కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. వివిధ చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసింది. గొర్రెల పెంపకందారుల కోసం, మత్స్యకారుల కోసం, కల్లుగీత కార్మికుల కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్టులో రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. షాదీఖానాల నిర్మాణాలు చేపట్టడంతో పాటు షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తోంది. వివాహాన్ని నిర్వహించడంలో గ్రామీణులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం షాదీ ముబారక్‌తో పాటు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పెళ్ళిళ్ల కోసం రూ.1,00,116 రూపాయలు అందజేస్తోంది. దీనివల్ల తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరుపేద కుటుంబాల్లో పెళ్ళిళ్లకు ఇబ్బందులు తొలిగాయి.

గతంలో వృద్ధాప్య పించన్లు రావడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వీటిని క్రమబద్ధ్దీకరించింది. పైగా వృద్ధులకు అందజేస్తున్న పించన్ల మొత్తాన్ని కూడా పెంచింది. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు కెసిఆర్ కిట్స్, కంటి వెలుగు, అమ్మ ఒడి పథకాల అమలు గ్రామీణులకు అనేక విధాలుగా ఉపయుక్తమయ్యాయి. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసింది. తాజాగా ఆసరా పెన్షన్లను, దివ్యాంగుల పెన్షన్లను రూ.2,016, రూ.3,016కు పెంచింది ప్రభుత్వం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు పెద్దగా దృష్టి పెట్టని అంశం జర్నలిస్టుల సంక్షేమం. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. గత మూడేళ్లలో ఈ నిధి నుండి 34.50 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. లక్ష రూపాయల చొప్పున 150 జర్నలిస్టుల కుటుంబాలకు 1.51 కోట్ల రూపాయలు అందజేశారు. మరణించిన 57 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా ఈ నిధి నుండి సహాయాన్ని అందించారు. కెజి టూ పిజి ఉచిత విద్యలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. దీని ద్వారా క్రైం రేటు గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ షి టీవ్‌‌సు, భరోసా పథకం, సిసిటివి సర్వైలన్స్ ప్రాజెక్టు మొదలైన అంశాల్లో తెలంగాణ పోలీసు శాఖ ప్రగతి సాధించింది. ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి ఉద్దేశించిన కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) కింద మంజూరైన 664 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకుంది తెలంగాణ. ప్రత్యామ్నాయ అడవుల పెంపకంతో పాటు ఇప్పటికే ఉన్న అటవీ భూముల పరిరక్షణకు కూడా పలు చర్యలను చేపట్టింది. ఈ నిధులను వందశాతం ఉపయోగించి దేశంలోనే ప్రముఖ స్థానం పొందింది. తెలంగాణ రాష్ట్రం నిరంతర కృషితో వృద్ధి రేటులో ముందంజలో ఉన్న రాష్ట్రాల జాబితాలో నిలిచింది.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతిని కనబర్చి పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఆర్థిక వృద్ధిలో తెలంగాణను ముందంజలో నిలపడంతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం ప్రగతిని కనబర్చినందుకు ఎకనమిక్ టైవ్‌‌సు బిజినెస్ రిఫార్మర్ అవార్డును 2018 సంవత్సరానికి గాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పొందారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణకు గాను తెలంగాణ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ 22 స్కోచ్ అవార్డులను పొందడం విశేషం. మిషన్ భగీరథ, హరిత హారం తదితర పథకాల అమలుకు గాను ఉత్తమ మౌలిక వసతుల కల్పన పురస్కారాన్ని కూడా రాష్ట్రం పొందింది. 2017లో వృద్ధి రేటులోనూ పరిశుభ్రతలోనూ రెండు కేటగిరీల్లో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు కైవసం చేసుకుంది. జాతీయ పర్యాటక రంగ అవార్డులు ఎనిమిదింటిని రాష్ట్రం పొందింది. కెసిఆర్ కిట్ల రూపకల్పనకు స్కోచ్ అవార్డు స్వీకరించింది. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఐదు అవార్డులను పొందింది. సిఎస్‌ఐ నిహిలెంట్ ఇగవర్నెన్స్ అవార్డు, సిఎన్‌బిసి టివి 18 సంస్థల ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు, అసోచావ్‌ు అవార్డు తదితర పురస్కారాలను తెలంగాణ పొందింది.

తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ అకాడమీ (టాస్క్), రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు, పురపాలక శాఖ, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ స్కోచ్ అవార్డులు అందుకున్నాయి. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ నిర్వహణ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించినందుకు అప్పటి మంత్రి కె.తారకరామారావు ‘లీడర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందారు. స్కోచ్ ఐటి మినిస్టర్ ఆఫ్ ద ఇయర్, స్టార్టప్ ఇండియా కేటగిరీలో స్కోచ్ ఛాలెంజర్ పురస్కారాలను కూడా ఆయన పొందారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందుకు తెలంగాణ రాష్ట్రం ‘లీడింగ్ డిజిటల్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ ’ పురస్కారాన్ని పొందింది. వైద్య, ఆరోగ్య రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఉత్తమ స్థానంలో నిలిచి, ‘2017 సంవత్సరానికి జాతీయ స్థాయి ఇ గవర్నెన్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విధంగా కేవలం ఐదేళ్ల కాలంలో తెలంగాణ ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. వృద్ధి రేటులో ముందుండడంతో పాటు అసాధారణ ప్రగతి కనబరుస్తోంది. బంగారు తెలంగాణ ఆశయ సాధన దిశగా అడుగులు వేగంగా వేస్తోంది.

Telangana a role model for other States in the country

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బంగారు తెలంగాణ దిశగా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: