ఇలా ఆడితే ప్రత్యర్థులకు కష్టమే!

  క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా క్రీడా విభాగం : ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. ప్రతిష్టాత్మకమైన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జయభేరి మోగించింది. ఇందులో వెస్టిండీస్‌పై రెండు, సౌతాఫ్రికాపై మూడు విజయాలు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా భారీ విజయం అందుకుంది. వెస్టిండీస్, సౌతాఫ్రికాలపై క్లీన్‌స్వీప్ సాధించిన భారత్ సమరోత్సాహంతో బంగ్లా సిరీస్‌కు సిద్ధమైంది. ఇక, ఇండోర్ వేదికగా జరిగిన […] The post ఇలా ఆడితే ప్రత్యర్థులకు కష్టమే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా

క్రీడా విభాగం : ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. ప్రతిష్టాత్మకమైన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జయభేరి మోగించింది. ఇందులో వెస్టిండీస్‌పై రెండు, సౌతాఫ్రికాపై మూడు విజయాలు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా భారీ విజయం అందుకుంది. వెస్టిండీస్, సౌతాఫ్రికాలపై క్లీన్‌స్వీప్ సాధించిన భారత్ సమరోత్సాహంతో బంగ్లా సిరీస్‌కు సిద్ధమైంది. ఇక, ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే సొంతం చేసుకుని తనకు ఎదురులేదనే విషయాన్ని మరోసారి నిరూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేకుండా పోయింది. బంగ్లాతో జరిగిన మొదటి టెస్టులో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమయ్యారు. అయినా దాని ప్రభావం ఏమాత్రం జట్టుపై పడలేదు.

కొత్త అస్త్రం మయాంక్
యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే డబుల్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. ఆడింది కొన్ని మ్యాచులే అయినా టెస్టు క్రికెట్‌పై మయాంక్ తనదైన ముద్ర వేశాడనే చెప్పాలి. స్వల్ప టెస్టు కెరీర్‌లోనే రెండు డబుల్ సెంచరీలు, మరో శతకం సాధించడం ద్వారా తానెంత కీలక ఆటగాడో మయాంక్ ప్రపంచానికి చాటాడు. మయాంక్ బ్యాటింగ్‌ను భారత మాజీ దిగ్గజం సెహ్వాగ్‌ను తలపిస్తోంది. బంగ్లాపై అతను సిక్సర్‌తో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆడేది టెస్టు క్రికెట్ అయినా పరిమిత ఓవర్ల మాదిరిగా వేగంగా ఆడడం ద్వారా మయాంక్ అభిమానులను తనవైపు తిప్పుకుంటున్నాడు. అతని బ్యాటింగ్‌పై దిగ్గజాలు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెహ్వాగ్‌లాగే వేగంగా ఆడడం మయాంక్ అలవాటుగా మార్చుకున్నాడు. ఇక, రోహిత్ రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. దీంతో రానున్న రోజుల్లో భారత ఓపెనర్లకు ఎదురు ఉండదనే చెప్పాలి.

గాడిలో పడ్డారు..
ఇక, కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు మళ్లీ గాడిలో పడ్డారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వీరిద్దరూ కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. రోహిత్ విఫలమైనా పుజారా సమన్వయంతో ఆడి ఆ ఒత్తిడి జట్టుపై పడకుండా చూశాడు. మయాంక్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న తీరు అభిమానులను కట్టి పడేసింది. స్వతహాగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చే పుజారా కొంతకాలంగా ధాటిగా ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా ధాటిగా ఆడి అలరించాడు. బంగ్లాపై కూడా చూడచక్కని ఆటతో కనువిందు చేశాడు. పుజారా ఫామ్‌లోకి రావడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పక తప్పదు. ఇక, రహానె కూడా మెరుగైన బ్యాటింగ్‌తో తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు.

రహాను మళ్లీ ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు శుభసూచకంగా చెప్పాలి. దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి రహానె నిలకడగా ఆడుతున్నాడు. జట్టులో ఎంతో కీలక ఆటగాడిగా ఉన్న రహానె గతంలో పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమయ్యాడు. ఒకదశలో జట్టులో స్థానం కూడా నిలబెట్టుకోవడం కూడా కష్టంగా మారింది. అయితే అసాధారణ పోరాట పటిమతో మళ్లీ పూర్వవైభవం అందుకున్నాడు. మయాంక్‌తో కలిసి తొలి టెస్టులో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రానున్న మ్యాచ్‌లో కూడా ఇలాగే ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇక, రవీంద్ర జడేజా కూడా తన ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. బ్యాట్‌తో బంతితో చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

షమి మ్యాజిక్
మరోవైపు బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి భారత్‌కు ప్రధాన అస్త్రంగా మారాడు. దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి షమి నిలకడైన ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. కీలక బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా లేని లోటును కనబడకుండా షమి చూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై షమి అసాధారణ రీతిలో చెలరేగి పోతున్నాడు. అతని బౌలింగ్‌ను చూస్తుంటే రానున్న రోజుల్లో భారత ప్రధాన ఆయుధంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పరిస్థితులకు తగినట్టుగా బౌలింగ్ చేస్తూ వికెట్ల పంట పండిస్తున్నాడు. కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నాడు. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో షమి బౌలింగ్ అసాధారణ రీతిలో సాగింది.

తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన మూడు వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈసారి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఉమేశ్ యాదవ్ కూడా అద్భుత బౌలింగ్‌తో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. తొలి టెస్టులో ఉమేశ్ తీసిన వికెట్లు అతని సత్తాకు నిదర్శనంగా చెప్పాలి. కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను క్లీన్‌బౌల్ట్ చేసిన తీరు అభిమానులను కట్టి పడేసింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు.

కీలక వికెట్లతో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ఎప్పటిలాగే భారత్ ప్రధాన అస్త్రంగా కొనసాగుతున్నాడు. పిచ్ నుంచి సహకారం లేకున్నా తనమార్క్ బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. తొలి టెస్టులో కీలక వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణిస్తుండడంతో ప్రపంచ క్రికెట్‌లో భారత్ బలమైన శక్తిగా మారింది. టీమిండియా ఇలాగే ఆడితే ప్రత్యర్థి జట్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.

Team India irresistible force in Test cricket

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇలా ఆడితే ప్రత్యర్థులకు కష్టమే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: