మౌలిక వసతుల కల్పనపై టాస్క్‌ఫోర్స్

Task force

 

ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటు
అయిదేళ్లలో చేపట్టాల్సిన పథకాలపై సమగ్ర నివేదిక

ముంబయి: దేశంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా రూ.100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడం కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయిదేళ్ల కాల వ్యవధిలో చేపట్టాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ఈ టాస్క్‌ఫోర్స్ నివేదిక రూపొందిస్తుంది. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు రూ.100 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను దేశంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా చేపట్ట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ఒక నివేదికను రూపొందించడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ టాస్క్‌ఫోర్స్‌కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పాటుగా నీతి ఆయోగ్ అధికారులు కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు.201920 ఆర్థిక సంవత్సరంనుంచి 202425 ఆర్థిక సంవత్సరం దాకా చేపట్టాల్సిన కార్యాచరణను టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పొందుపరుస్తుంది. ముందుగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ఆర్థికంగా సాధ్యపడే ప్రాజెక్టులను టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో తెలియజేస్తుంది. అలాగే మిగిలిన ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టులను కూడా ఇది గుర్తిస్తుంది. ఒక్కోటి వందకోట్ల విలువైన గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు కూడా ఈ నివేదికలో ఉంటాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నివేదికను అక్టోబర్ 31 నాటికల్లా సమర్పిస్తుంది. మిగతా సంవత్సరాలకు సంబంధించి డిసెంబర్ చివరి నాటికి నివేదికను అందజేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో మౌలిక రంగంలో పెట్టుబడులు కొంతమేర ఉపాధి కల్పనకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత పదేళ్ల కాలంలో మన దేశం మౌలిక సదుపాయాల రంగంలో దాదాపు లక్ష కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అయితే రాబోయే అయిదేళ్లలో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు సరయిన ప్రణాళిక లేకుంటే కష్టమవుతుంది. రాబోయే అయిదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 100 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెపారు.

ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ప్రాజెక్టులను అమలు చేసేటప్పుడు ఏయే సంవత్సరంలో ఏయే ప్రాజెక్టులను అమలు చేయాలో ప్రాధాన్యతా క్రమంలో స్పష్టమైన ప్రణాళిక అవసరమని, అందుకే ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఏటా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేయాలి, అందుకు అవసరమైన నిధులను ఆయా మంత్రిత్వ శాఖలు ఏ విధంగా సమకూర్చుకోవాలి, తక్కువ ఖర్చులో నిర్ణీత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎలాంటిచర్యలు తీసుకోవాలి లాంటి అన్ని వివరాలు టాస్క్‌ఫోర్స్ సమర్పించే నివేదికలో ఉంటాయి. కాగా ఆయా శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖలదేనని కూడా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Task force to identify infra projects for Rs 100 lakh crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మౌలిక వసతుల కల్పనపై టాస్క్‌ఫోర్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.