బిజెపిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు…

 

నాకు కాషాయ రంగు పులమడానికి యత్నించారు

అలాంటి వారి ట్రాప్‌లో పడను
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు కాషాయ రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే తాను మాత్రం వారి ట్రాప్‌లో పడబోనని స్పష్ట చేశారు. శుక్రవారం తన గురువు కె బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తూ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువళ్లువార్ చిత్రాన్ని బిజెపి ట్వీట్ చేయడంపై చెలరేగిన వివాదంపై స్పందించాలని విలేఖరులు అడగ్గా.. తిరువళ్లువార్‌తో పాటుగా తనపైన కూడా కాషాయ రంగు పులమడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తమిళనాట రాజకీయ శూన్యత ఉందన్న ఆయన తాను రాజకీయ పార్టీని ప్రారంభించేంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. రజనీకాంత్ బిజెపికి సానుకూలంగా ఉన్నారని, 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరుతారంటూ వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను బిజెపికి చెందిన వ్యక్తినని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల రాష్ట్ర బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో తాను భేటీ కావడంపైనా రజని స్పందించారు. రాధాకృష్ణన్ తనను బిజెపిలోకి ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. అయోధ్యపై తీర్పు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమిళ ప్రాచీన కవి తిరువళ్లువార్ నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు, మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న ఫొటోను ఇటీవల బిజెపి తమిళనాడు విభాగం ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కాగా రజనీకాంత్ వ్యాఖ్యలపై బిజెపి, ప్రతిపక్ష డిఎంకె సైతం స్పందించాయి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏవరినైనా కలుసుకునే హక్కు ఉంటుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. రజనీకాంత్‌ను బిజెపిలో చేరమని తాము ఎప్పుడూ కోరలేదని, అంతేకాదు, ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తామెప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.అలాంటి ఊహాగానాలపై తమకు ఆసక్తి లేదని కూడా ఆయన అన్నారు. కాగా రజనీకాంత్ ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారో తమకు తెలియదని, అది ఆయన అభిప్రాయం మాత్రమేనని డిఎంకె కోశాధికారి దురై మురుగన్ అన్నారు.

Super Star RajiniKanth Sensational Comments on BJP

The post బిజెపిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.