అక్షర బంధాల మోహరింపు ‘నిశ్శబ్ద యుద్ధ’ రంగం

  మనిషి పద్యం వైపు మళ్లడానికి గల నేపధ్యాన్ని పరిశీలిస్తే, పద్యం, సామాజిక ప్రయోజనం కోసం అనివార్యం మ్మని తలిస్తే ఆ మనిషి మూలాలు కాన్వెంట్ స్కూల్ కన్నా వెన్కటి, సర్కారు బడి కన్నా , తపస్సుగ భావించి , పవిత్రమైన మనస్సుతో కొలువు దీరిన వెన్కటి ‘కానిగి బడి’ లో కట్టె పల్క మీద దిద్దిన అక్షర బంధానికి ముచ్చట పడటం, ఒకింత చకితం, మరింత సత్యం. కానిగి సోపాల సద్వినోళ్లు కలెక్ట రయిండ్రు, దేశాధినేతలయిండ్రు, […] The post అక్షర బంధాల మోహరింపు ‘నిశ్శబ్ద యుద్ధ’ రంగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనిషి పద్యం వైపు మళ్లడానికి గల నేపధ్యాన్ని పరిశీలిస్తే, పద్యం, సామాజిక ప్రయోజనం కోసం అనివార్యం మ్మని తలిస్తే ఆ మనిషి మూలాలు కాన్వెంట్ స్కూల్ కన్నా వెన్కటి, సర్కారు బడి కన్నా , తపస్సుగ భావించి , పవిత్రమైన మనస్సుతో కొలువు దీరిన వెన్కటి ‘కానిగి బడి’ లో కట్టె పల్క మీద దిద్దిన అక్షర బంధానికి ముచ్చట పడటం, ఒకింత చకితం, మరింత సత్యం. కానిగి సోపాల సద్వినోళ్లు కలెక్ట రయిండ్రు, దేశాధినేతలయిండ్రు, కవులయిండ్రు. గొట్టిపర్తి యాదగిరిరావు గారు ఇందుకు మూడవ అక్షర సాక్షి.

మధురాక్షర సమూహం జాలువారించేందుకు లాలిపాటగా, లయబద్ధపు గీతంగా, అందాల రసిక రాగంగా, మలయానిల వీచికా స్వప్నంగా, ప్రేమలేఖగా, శ్రామికుల అండ నిలిచే విప్లవగీతంగా సమాజపు స్థితిగతులకెప్పటి కెయ్యది అవసరమో అయ్యది సృజించి చూపిన కవికుల శ్రేష్ఠుడు గొట్టిపర్తి. అనుభవంలోకి విసరబడిన దృశ్యాన్ని అంతరంగంలో మగ్గబెట్టి,మగ్గబెట్టి పుటం బెట్టిన అక్షరంగా సారవంతమైన కవిత్వంగా మలుస్తున్న అక్షర శిల్పకారుడు. రాతల తోవ తెలిసి, లక్షణమైన లక్ష్యాలు గీసి, కవిత్వ ప్రయోజనంతో గట్టుకు చేరే కవి బాటసారి.

ఇవన్నీ గర్భీకరించుకున్న సంపుటి నిశ్శబ్ద యుద్ధం.
51 నెమరేతల, పలవరింపుల, కోపతాపాల, చెణుకుల, చురుకుల, మురిపాల, విలాపాల మరిన్ని మంచి మంచిల మోహరించిన యుద్ధరంగం.
వస్తువు చుట్టూ శిల్ప గాఢబంధనం కన్నా అనుబంధమై అల్లుకునే సహజత్వం ఇష్టమేమో. కవి హృదయాన్ని /అక్షరగంధం అభిషేకిస్తున్నది అన్నడు. అనుభూతివాదం హృదయ సంబంధి గదా! కవికి పాఠకుడికి ఈ మార్గమే ఆత్మీయమైనది.
పురుళ్ళు /కటిక చీకటిలోనో /పట్నానికి మోసుకెళుతున్న/నులక మంచాల్లోనో జరుగుతాయి. హృదయ విదారకమైన ఘటనకు ఈ కవి ఇచ్చిన అక్షరరూపానికి చెమ్మగిల్లని నయనముండదు.ఈ సమాజానికి (వెట్టికి తప్ప) అక్కరకు రానట్టుగా విసిరేసిన తండా పై రాసిన అరుదైన, బరువైన కవిత.
ఆదివారం అబిడ్స్ బజార్లలో పాత పుస్తకాల జాతరలో చెదలు పట్టేలా వున్న చరిత్ర పుస్తకాలను- పాత రత్నాలు అని అభివర్ణించాడు. బేరసారాల దృశ్యీకరణ ఇందులో ఆసక్తి రేకెత్తించే వైచిత్రి.
పల్లెతనానికి, రైతు మనస్తత్వానికి తొలకరి కవిత పట్టం కట్టింది. దుక్కి దున్నడానికి సాగుతున్న/రైతు భుజం మీద/నాగలి బరువనిపించడం లేదు. హృదయాస్వాదన, మార్దవ భావన, వేల కట్టలేని త్యాగారాధన
ముప్పేటల అల్లిక ఈ కవి అద్భుత సాధన.
వడకట్టిన, గడ్డకట్టిన ద్వైదీ భావనల దృశ్యరూపమే కిటికీ గుండా ఒలికించాడీ కవి.’చేయి తిరిగిన చిత్రకారుడు/ గీసిన చిత్రంలా వుంది/కిటికీ బయటి జీవితం ఒక వైపు, కిటికీ మూసి వెనక్కి తిరిగితే/గదిలో అలుముకున్న చీకటి/వెక్కిరించింది, అనేది రెండో వైపు. వేదాంత స్పృహ ఉన్నట్లనిపించినా, కవి మనోవాక్కు అది కాదు. అంతరంగపు నిర్బలత్వాన్ని వెక్కిరించిందనే, దాన్ని జయించాలనే లోతైన తపన చెప్పే ప్రయత్నం అంతర్లీనంగా చూస్తం.
ప్రకృతి అందాలకు మరిన్ని అందాలద్దే వాక్చిత్రాలను రచించాడీ కవి. ఇంకా ప్రకృతిని స్త్రీ మూర్తి గా ఆరాధించిండు. పచ్చికపై దొర్లుతున్న /తుషార బిందువులోని/ఇంద్రధనుస్సు ను ఆవిష్కరిస్తున్నడు. గలగల పారుతున్న /అభిసారిక లాంటి సెలయేరు అని అందగిస్తున్నడు.
ఈ కవిలోని మరోపార్శ్వం ‘సంవేదనాత్మక ధర్మాగ్రహం.’
ఊరకుండలేనితనమే,ఊడిగం చేయలేనితనమే కవికి శిరోభూషణం.మార్గగామిగా, సత్యవాదిగా, సుబోధ చేసే మహర్షిగా కవి కనిపిస్తాడిందులో. ముసుగు లేని దొంగలు ఊళ్ళేలుతున్నారు, బాధ పడేవాడు చేసే ధర్నాలను/బాధించేవాడు చేస్తున్నాడు. కపట సమాజపు నైచ్యాన్ని అవగతపరుస్తున్నడు.సైనికుడు-నాయకుడు కవితలో వ్యత్యాసాల పోలికతో ప్రయోగపరంగా రాసినట్టనిపిస్తుంది.ఒకరు త్యాగజీవి అయితే రెండోవారు భోగజీవి. తుపాకుల మోతల్లో/ఉదయాన్ని స్వాగతిస్తాంమేం/తుపాకుల పహారా లేందే/కాలు బయట పెట్టరు మీరు.వాస్తవానికి చిక్కదనపు,చక్కదనపు వాక్య కూర్పు తీరిది.
అకవుల, అవార్డుల యావల, నిబద్దత లేని వేదికలను ఊరేగే కాకులు అని సంబోధిస్తూ నిరసన ధ్వని వినిపించిండు.
దేశాన్ని, డబ్బు జబ్బు పట్టిన రోగిగా, నల్లధనపు నలుపుతో మన ముందు నిలబెడ్తడు.ఆ నలుపు రోగం/రూపు మాసిపోతుందా అన్నది/ ఐసీయూ నుండి/బయటకు వస్తే కాని తెలియదు. కాలానికి తగు కర్తవ్యం,హెచ్చరిక నర్మగర్భంగా పలికిన విధానం శిల్ప చమత్కారం.
సారాంశంగా….ఈ సంపుటిలో అక్షరబంధం,సైనికుడు-నాయకుడు,నీవు,రంగుల లోకం,ప్రక్రుతి,తండా,రెండు పట్టణాల మధ్య వారధి,పాతరత్నాలు,అమ్మ-నాన్న,కానిగి సదువు,మరో మనిషి, బొందితో నరకం, నా తెలంగాణం… ఇట్లా సింహభాగం కవితలు వస్తు పరిమళాలను, వైవిధ్య భరితాలను, నూత్న కోణాలను, అడుగడుగునా గుమ్మరిస్తూ,పద సోయగాలతో అలరారే కవిత్వానికి హామీ, ధీమా దొరుకుతుంది. ‘అలజడి, విస్ఫోటనం’ సంపుటాల అనుభవమున్న కవి గదా!ఇద్దరు సాహిత్య మేరునగ ధీరులైన సిధారెడ్డి , గుడిపాటి పరిచయ పత్రాల మధ్య నిశ్శబ్ద యుద్ధం ప్రకటించిండ్రు.
ఏం చేయాలన్నా/ఎప్పుడూ/అడ్డుతగిలే మనిషి నుంచీ….
శాంతి కపోతం కళ్ళల్లో /నిప్పులు రాజుకుంటున్న సందర్భం దాక….
కొనసాగిన ‘నిశ్శబ్ద యుద్ధాన్ని’ అవధరించాల్సిందే,ఆచరించాల్సిందే!!
‘blessed is the man who, having nothing to say, abstains from giving us wordy evidence of fact.’
george eliot.

Story on Quiet fighter book

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అక్షర బంధాల మోహరింపు ‘నిశ్శబ్ద యుద్ధ’ రంగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.