నారాయణపురం వరం పండిత రాఘవాచార్యులు

  అది నారాయణపురం, పేర్చిన పెద్ద బతుకమ్మ వంటి ఊరు. ఒక నారాయణభట్టు వాజ్మయ దురంధరుడై తోడుగా నిల్వగా నన్నయ జగద్ధితంబుగ భారత సంహితా రచన బంధురుడయ్యాడు. మరొక నారాయణభట్టు సిరిసిల్ల పాత తాలూకాలోని ప్రస్తుత ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఒక మైలు దూరంలో “నారాయణపురం” అనే ఊరును పొందిచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వూరు చదువులో, పదవుల్లో, కళల్లో మకుటాయమానంగా వెలుగుతున్నది. సరస్వతి మాత కటాక్షానికి నోచుకున్నది. అక్షరం అక్కడ బంగారు రథమ్మీద […]

 

అది నారాయణపురం, పేర్చిన పెద్ద బతుకమ్మ వంటి ఊరు. ఒక నారాయణభట్టు వాజ్మయ దురంధరుడై తోడుగా నిల్వగా నన్నయ జగద్ధితంబుగ భారత సంహితా రచన బంధురుడయ్యాడు. మరొక నారాయణభట్టు సిరిసిల్ల పాత తాలూకాలోని ప్రస్తుత ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఒక మైలు దూరంలో “నారాయణపురం” అనే ఊరును పొందిచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వూరు చదువులో, పదవుల్లో, కళల్లో మకుటాయమానంగా వెలుగుతున్నది. సరస్వతి మాత కటాక్షానికి నోచుకున్నది. అక్షరం అక్కడ బంగారు రథమ్మీద బ్రహ్మాండంగా ఊరేగుతున్నది.

నారాయణపురం ఊళ్లో ఒక రామాలయం. దానికి ఎదురుగా కారంచేటి తిరుమల వారి యిల్లు. వేంకటమ్మ, మనోహరాచార్య దంపతులకు (పుష్యమాస శుద్ధ ద్వాదశి నాడు) 1929లో జన్మించారు. కే.వి. రాఘవాచార్యగారు (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.వి. రమణాచారి తండ్రిగారు). మొదట తండ్రిగారి దగ్గరే విద్యాభ్యాసం. తదుపరి ఆవునూరులో ఆచ్చి నరసింహాచార్యుల వద్ద శిష్యరికం. రాఘవాచార్యుల ఇంటి పక్కనే పండిత భావికృష్ణశాస్త్రి గారి గృహం. ఆవునూరిలోని ఆచ్చి వేంకటాచార్యులు కవిత్వం చెప్పడానికి ఈ కృష్ణశాస్త్రిగారే ప్రేరకులు. పైగా రాఘవాచార్యుల గురువుగారైన ఆచ్చి నరసింహాచార్యులూ. ఈ భావి కృష్ణశాస్త్రిగారూ ఇద్దరూ జంట కవులు. గోలకొండ కవుల సంచికలో నారాయణపురం ఊరు నుండి ముగ్గురి రచనలున్నాయి. అందులో ఒకరు పండితభావి కృష్ణశాస్త్రి.

మరొకరు చిలకమఱ్ఱి వేంకటనృసింహాచార్యులు. ఇంకొకరు నమిలకొండ శ్రీరంగాచార్యులు. ఈ ముగ్గురూ కే.వి. రాఘవాచార్యగారి యింటికి మూడు వైపులా వుండేవారు. ఇట్లా తన యింటి చుట్టూ వున్న పెద్దల కవిత్వాలూ, ఆవునూరులోని తన గురువులైన ఆచ్చి వేంకటనృసింహాచార్యుల కవిత్వాలూ గోలకొండ కవుల సంచికలో అచ్చవడం చూసి అచ్చెరువందారు రాఘవాచార్యగారు. తనూ కవిత్వ రచన చేయాలనుకున్నారు. కానీ తండ్రిగారు శాస్త్రజ్ఞానం కవిత్వానికి జీవధాతువు అనగానే నాటక ఛందోలంకార శాస్త్రాల వైపు మరలారు రాఘవాచార్యగారు.1950 ప్రాంతాల్లో జీవనోపాధికి అవసరమైన లౌకిక విద్యార్హతలు పొందారు. మొదట ఏకోపాధ్యాయ పాఠశాలలో చేరారు. కే.వి.రాఘవాచార్య. ఇంటికి పెద్దవారు. రెండో వారు పార్థయ్యగారు, మూడో వారు తిరుమల శ్రీనివాసాచార్యగారు. నర్సయ్యగారు నాలుగో వారు. వేంకటరమణాచారిగారు చివరివారు.

“మొదటి నాగలి ఎట్ల నడిస్తే వెనుక నాగలి అట్లనే నడుస్తది”. అన్నట్లు తన తమ్ముళ్లందరూ వాళ్ల వాళ్ల రంగాల్లో నిష్ణాతులవడానికి రాఘవాచార్యులే సూర్తిదాయకులు. మెతుకు కోసం వెతుక్కుంటూ మెతుకుసీమకు వెళ్లారు. మాసాయిపేట, చక్య్రాల, సిద్ధిపేటల్లో ప్రసిద్ధిని పొందారు. ప్రసంగ వ్యాసంగంలో దిట్ట అయ్యారు. ఉపన్యాస విన్యాసంలో మేటి అయ్యారు. పురాణ ప్రవచనాల్లో ప్రముఖులయ్యారు. ‘యువభారతి’ని తన ‘మాఘకావ్య వైభవం’ వ్యాఖ్యానంతో పండితభారతిని చేసారు. అట్లా వ్యాఖ్యానాల పరంపర కొనసాగింది. కే.వి. రాఘవాచార్యులు బహుభాషాకోవిదులు. మధురమైన మాతృభాష తెలుగు, అమృతసదృశ్యమైన ద్రవిడ భాష అంటే తమిళం, గీర్వాణ భాష సంస్కృతం, మార్దవోపేతమైన ఉర్దూ తదితర భాషల్లో ఆయన వైదుష్యానికి మరొక సాదృశ్యమేలేదు. ప్రధానంగా సంస్కృత ద్రవిడ భాషల్లోని సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశారు రాఘవాచార్యగారు. అందులో వేదాంతదేశికులు పాదుకా సహజ్రి వ్యాఖ్య సాటిలేనిది.

రాఘవాచార్య గారి జీవితం నిరాడంబరం. వారిది నిస్వార్థమైన వ్యక్తిత్వం. దాదాపు తెలంగాణలో కవులందరూ పోతన వారసులు. అందులో రాఘవాచార్యులు ముందువరుసలో ఉంటారు. ప్రచార ఆర్భాటాలకూ, ఆడంబరాలకూ, కీర్తికండూతికి దూరంగా వుండి లోతైన పాండిత్యంతో వైష్ణవ తత్వ సాహిత్యాన్ని బాగా పండించిన కృషీవలురు రాఘవాచార్యులు. పెద్ద జీయర్‌స్వామివారి ప్రశంసలు అందుకున్న అరుదైన వ్యక్తి. చిన్న జీయర్‌గారి నుండి పురస్కారాలు పొందినవారు. విశిష్టాద్వైత వేదాంత విశారద వంటి బిరుదులకూ, ఉభయ వేదాంత మొదలైన పురస్కారాలకూ గౌరవాన్ని సమకూర్చిపెట్టిన వారు. “నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అంటారు పెద్దలు. కానీ ఊరు మంచిదైతేనే మనుషులు మంచి వాళ్ళవుతారు. మనుషులు మంచి వాళ్ళయితేనే వాళ్ల మాటలూ మంచిగానే ఉంటాయి. నారాయణపురం గొప్ప ఊరు. ఆ రోజుల్లోనే సురవరం ప్రతాపరెడ్డి గారు అడుగుపెట్టిన మంచి ఊరు.

పక్కన మానేరు. చుట్టూ వాగులూ, వంకలూ, కాల్వలూ, ఒర్రెలూ. పచ్చని పంట చేల్లు. ఊళ్లో అనేక భజన మండళ్ళు. వేసవిలో హరికథాకలాపాలు. నాటకాలూ, యక్షగానాలకు కొదవే లేదు. ఇటువంటి పరిసరాలన్నీ కె.వి. రాఘవాచార్య గారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే గొప్ప పరికరాలయ్యాయి. వారికి శిష్య పరంపర గురించి చెప్పవలసిందేలేదు. వరంగల్లు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ మొదలైన జిల్లాల్లో వేలాది మంది శిష్యకోటి వున్నారు. కె.వి. రాఘవాచార్య గారికి పూర్వం నుండి ఆ వూళ్ళో మొదలైన అక్షరయాత్ర ఇప్పటికీ నిరాఘాటంగా కొనసాగుతూ ఉండడం ఆ వూరి ప్రత్యేకత. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదవీ విరమణ చేసి కీర్తిశేషులైన ఎర్రం రాములు, వేళ్ళ మీదే గణితాన్ని కల్గి ఉన్న వెంకటయ్య లద్దునూరి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ప్రశంసలు పొందిన నటుడు నలిమెల శ్రీనివాస్, రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన నమిలికొండ ప్రభాకరాచార్యులు, పాత్రికేయ వృత్తిలో అద్భుతంగా రాస్తున్న , రాణిస్తున్న బొల్లం శ్రీనివాస్.. ఇట్లా ఎందరెందరో ఆవూరి బిడ్డలు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఉత్తీర్ణతా శాతం నారాయణపురంలోనే చాలా సార్లు అధికంగా ఉంటుంది. మా ఊళ్ళో యింటింటికీ దాదాపు ఒక ఉద్యోగి లేక ఒక విద్యాధికుడూ ఉంటారు. ఆ ఊరి మట్టి కె.వి. రాఘవాచార్యగారిని ఒక గొప్ప సాహిత్య ఆధ్యాత్మిక వైష్ణవ తత్తవేత్తగా తీర్చిదిద్దితే, ఆచార్యగారు ఆ వూరికి వన్నె తెచ్చారు. ఆ మట్టి మనిషికీ, గట్టి మనిషికీ ఇది అక్షర నివాళి.

Story on Narayanapur Varam Pandita Raghava Charyulu

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: