భిన్నకవితల సమాహారం భరోసా

  అమ్మంగి వేణుగోపాల్ గారు పరిచయం అవసరం లేని కవి. తెలుగు సాహిత్యరంగంతో, సాహితీ సంస్థలతో వారు మమేకమైనంతగా మమేకమైనారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కొందరు కవుల తొలి కవిత్వ పుస్తకాల్లో కవిత్వం ప్రాథమికస్థాయిలో ఉండటం గమనిస్తాం మనం. కాని, అమ్మంగి గారి మొదటి రచన అయిన మిణుగురు నుండి నాలుగేళ్ల క్రితం వచ్చిన గంధంచెట్టు వరకు అన్ని కవితా సంపుటులలో ఎక్కడా కవిత్వపు లోటు కనిపించదు మనకు. అంటే, ప్రారంభదశలోనే చెప్పుకోతగిన స్థాయిలో కవిత్వం […] The post భిన్నకవితల సమాహారం భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమ్మంగి వేణుగోపాల్ గారు పరిచయం అవసరం లేని కవి. తెలుగు సాహిత్యరంగంతో, సాహితీ సంస్థలతో వారు మమేకమైనంతగా మమేకమైనారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కొందరు కవుల తొలి కవిత్వ పుస్తకాల్లో కవిత్వం ప్రాథమికస్థాయిలో ఉండటం గమనిస్తాం మనం. కాని, అమ్మంగి గారి మొదటి రచన అయిన మిణుగురు నుండి నాలుగేళ్ల క్రితం వచ్చిన గంధంచెట్టు వరకు అన్ని కవితా సంపుటులలో ఎక్కడా కవిత్వపు లోటు కనిపించదు మనకు. అంటే, ప్రారంభదశలోనే చెప్పుకోతగిన స్థాయిలో కవిత్వం ఉన్నదన్న మాట! వారు ఇప్పటివరకు ఐదు కవితా సంపుటులను వెలువరించారు. భరోసా పేరుతో వచ్చిన పుస్తకం గురించే రాస్తున్నానిక్కడ.

సంపుటి పేరు, ముఖచిత్రం రెండూ బాగున్నాయి. కవిత్వం గురించిన ఒక భరోసా, అందులో పరచుకుని వున్న సంవేదన గురించిన భరోసా, సమాజసంక్షేమం గురించి కవి పడే తపన గురించిన భరోసా – ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి కనుకనే శీర్షిక, లోపలి విషయాలకు తగినట్టుగా బాగుదనటం. ముళ్లకంచె, ప్రాణం లేని రాళ్లు, చిగురింత లేని గెడకర్రలు – వీటన్నిటి మధ్య పువ్వులు! ఇంత మంచి కాన్సెప్ట్ వున్న ఈ ముఖచిత్ర దృశ్యం జీవితం పట్ల భరోసాను కాక దేన్ని సూచిస్తుంది! వెనుక అట్ట మీద కూడా మంచి చిత్రమే వుంది. ఇనుపతీగల కంచెకు ఇనుమడించిన ఉత్సాహంతో అల్లుకుపోతున్న లతలు! అదీ భరోసా అంటే.

ఈ సంపుటిలో 29 కవితలున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో సాధారణంగా మామూలు కవులు ఆదరాబాదరాగా రాసిన ఇంకొక్క కవితను చేర్చి సంఖ్యను 30 కి పెంచుతారు. అమ్మంగి గారు అట్లా చేయకపోవటానికి, కేవలం ఇతరులకంటె భిన్నంగా ఉండాలనే కోరిక మాత్రమే కారణం కాకపోవచ్చు. పూర్ణసంఖ్య (round figure) కోసం మామూలు స్థాయి కవితను చేర్చితే పుస్తకంలో అనవసరంగా కొంత పేలవత్వం చోటు చేసుకుంటుంది. దీనికి అదనంగా మరో కారణం ఉండే అవకాశం కనిపిస్తున్నది. అదేమిటంటే, జీవితంలో సంపూర్ణతను సాధించడం సాధ్యమయ్యే పని కాదు అనే సత్యాన్ని అన్యాపదేశంగా చెప్పడం. ఇది వారి అణకువను సూచిస్తుంది. కవితలన్నిటినీ వచనకవిత ప్రక్రియలోనే రాసినా వస్తుపరంగా, శిల్పపరంగా భిన్నమైన కవితలున్నాయి ఈ పుస్తకంలో.

సీరియస్ అయిన తెలంగాణ సెంటిమెంట్ తో రాసినవి కొన్ని (వ్యాకరణం, నీకు నాకు నడుమ, ప్రశ్నల నడుమ విరామం, తల్లీ నీకో దండం, దిక్సూచి), బతుకుపోరు సలిపే బడుగుజీవుల పట్ల సహానుభూతితో రాసినవి కొన్ని (చేపమందు, హరేక్ మాల్ చారానా, నల్లగొండతల్లి), స్త్రీమూర్తుల మీద రాసినవి కొన్ని (సానియా, రోదసి అనువాదం), ఇంకా ప్రకృతివిపత్తుల గురించి రాసిన సునామీ…సునామీ, భూకంపం; ఉన్నతమైన కళాసృష్టి గురించిన కలలు కటకటాలు – ఇట్లా ఎన్నో రకాలవి. కేవలం వీటిని మాత్రమే ఉదాహరిస్తే ఈ పుస్తకంలోని వైవిధ్యం పూర్తిగా అవగాహనలోకి రాకపోవచ్చు. ఈ సంపుటి వేరేవాటికన్న ఎందుకు భిన్నమైనదో, విశిష్టమైనదో తెలిపే కొన్ని ప్రత్యేక కవితలున్నాయిందులో. వాటి గురించి వ్యాఖ్యానించడం అవసరం.
మూసిన తలుపులు అనే కవిత ప్రారంభంలో

రోడ్డు మీద తెగిపోయిన చెప్పుల్ని చూసినప్పుడల్లా
అవి చెప్పులు కావు రెండు పాదాలు అనిపిస్తుంది
రెండు పాదాలు కావు నిండు ప్రాణాలు అనిపిస్తుంది
అంటారు కవి. ఇది మామూలు మనుషులకు – ఆ మాటకొస్తే మామూలు కవులకు – వచ్చే ఊహ కాదు. తెగిపోయిన చెప్పుల్ని చూసి ఆ చెప్పులను తొడుక్కునే వ్యక్తికి సంబంధించిన దిక్కుమాలినతనాన్ని ఊహించుకోవటం సంవేదనాత్మకతకు, దృశ్యాన్ని దర్శించడంలోని కొత్తదనానికి పరాకాష్ఠ. దీన్ని ప్రత్యామ్నాయ సహానుభూతి (vicarious empathy) గా అభివర్ణించవచ్చు. ఇటువంటి ఉదాహరణలే మామూలు కవికీ ఉన్నతస్థాయి కవికీ మధ్య వుండే భేదాన్ని చూపుతాయి. ఇక ఈ కవిత ముగింపు ఎట్లా వుందో చూడండి.
సమాజమే రోజుకో అద్దె ఇల్లు మారుతుంటే
రాత్రికి ఇల్లు చేరనివాడి చిరునామా ఎవరు చెప్తారు?
నేటి సమాజ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదని అన్యాపదేశంగా చెప్తున్నారు కవి.

కవిత్వాన్ని ఆధునికంగా రాయాలనుకునేవాళ్లకు రూపం (form) గురించిన అవగాహన, కొత్త రూపంలో రాయటం పట్ల కోరిక అవసరం. భావాన్ని బలంగా వ్యక్తీకరిస్తూ రాయడం ఒక స్థాయిని సూచిస్తే, భావంతో పాటు దాన్ని execute చేసే (అంటే రాసే) విధానంలో కొత్తదనాన్ని అవలంబించడం ద్వారా విశిష్టమైన రూపం ఆవిష్కృతమయ్యేలా రచన చేస్తే అది పైమెట్టు స్థాయి నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ భిన్నమైన, కొత్తదైన రూపానికే మొదటి ప్రాధాన్యం. నైపుణ్యప్రదర్శన అన్నది దానంతట అదే జరుగుతుంది. అంటే అది సెకండరీ అన్న మాట. భిన్నమైన, కొత్తదైన కవితారూపాన్ని సాధించడం కోసం పాటించే విధానాలలో సమాపక క్రియలు లేకుండా చూసుకోవడం ఒకటి. ముఖ్యంగా అవి వాక్యాంతాల్లో – అంటే పంక్తుల చివరల్లో – రాకుండా జాగ్రత్త పడితే మరీ మంచిది. అసలు క్రియలే లేకుండా రాయటం ఈ విషయం గురించిన మరింత బలమైన స్పృహను సూచిస్తుంది. ఈ పుస్తకంలోని భూకపం అనే ఈ కవితను పరిశీలించండి.

ఏది భూమో/ ఏది పామో/ ఎవరు పావో/ ఏది గావో/ మీదిపొర కుబుసం/ బుస కొడితే
విషం/ తల మీద అడుగు/ కాళింది మడుగు/ సప్త సముద్రం/ మహా ప్రళయం/ అనుకంప
లేని/భూకంపం!/ నైసర్గికాలు/ తారుమారు/ నాగరికతలు/ నాశనం/ పునాది లేని గిరి/
తలారి లేని వురి/ గాజుకళ్ళ ఉషస్సు/ విహ్వల గగనం/ వికల కుటుంబం/ అదిగో క్రేన్/
ఫైరింజన్ ఫైరింజన్/ మై గాడ్/ హెలీపాడ్/ బీభత్స ప్రాంగణం/ మంత్రి రాకడ/ ప్రాణం పోకడ/
పరామర్శలు/ పునరావాసం/ విమర్శలు/ విచారణ/ హాహాకారం ఆనవాలు/ ఆర్తనాదం
చిరునామా/ నోటి నిండా మట్టి/ మొలిచిన మూలుగు/ చివరి వూపిరి/ చిన్న ఆశ/ అదిగో
అదిగో/ అట్టడుగున స్త్రీ/ మూగరోదన/ ప్రసవ వేదన/ ఒన్ టూ త్రీ/ క్షమయా ధరిత్రీ
ఇన్ని పంక్తులున్న ఈ కవితలో ఒక్క సమాపక క్రియ కూడా లేకపోవడం మనం గమనించగలుగుతాం. కాబట్టి, దీన్ని ఒక రకమైన ప్రయోగమనవచ్చు.

ఫ్యూడలిస్టిక్ భావాలు, వాటికి అనుగుణమైన జీవనశైలితో బతికే కవులకు బడుగుజీవుల పట్ల నిజమైన, నిష్కపటమైన సహానుభూతి వుండటం అరుదైన విషయం. పేదప్రజల పట్ల అమ్మంగి గారికి అచ్చమైన సహానుభూతి వుందని నిరూపించే కవితలు కొన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో. నిరుపేదలను ఆదుకునే సంస్కారమున్న ఆయుర్వేద వైద్యం అందుబాటులో లేకపోయే పరిణామాన్ని కవి సహించలేకపోవటం చేపమందు అనే కవితలో కనిపిస్తుంది మనకు. ‘అమీరుకైనా గరీబుకైనా/ అదే ఆహ్వానం అదే ఆదరణ/ రోగులు పెళ్లివిందుకు వచ్చినట్టుగా వచ్చేవారు’ – అంటూ ఆ దృశ్యాన్ని తల్చుకుని కవి అంతరంగం చెమ్మగిల్లుతుంది ఈ కవితలో.

పావలా నాణెం చలామణిలో లేకపోతే ధనవంతులకు కలిగే పెద్ద ఇబ్బందేమీ లేదు. ఎటొచ్చీ బీదవాళ్లకే అవస్థలు. ఎందుకంటే వాళ్ల చేతుల్లో ఆడేవి చాలా వరకు ఆ నాణాలే. ఈ నేపథ్యంలో కష్టజీవుల వెతలు ఈ కవికి మనస్తాపాన్ని కలిగించాయి. అందుకే పావలాను పోపుగింజల డబ్బాల్లోని గుప్తనిధిగా అభివర్ణిస్తూ ‘ఈ నిధిని ఎవరెత్తుకు పోయారో’ అని కలత చెందటం జరిగింది హరేక్ మాల్ చారానా అనే కవితలో. ఈ రకానికే చెందిన మరో కవిత నల్లగొండ తల్లి. ఆంధ్ర ప్రాంత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడ్డారు కనుక, దీన్ని తెలంగాణ కవిత కింద కూడా జమ కట్టవచ్చు.
‘పదినెలలు మోసి కని పెంచి’ – అదో పాత పదబంధం
పదేండ్లుగా చంక దిగని పాపాయి కొత్త అనుబంధం
నల్లగొండ అమ్మ వొడిలో ఫ్లోరోసిస్ బొమ్మ
పురుళ్ళు పుణ్యాలు తెలియని యీ అనామిక
అమ్మచెట్టు మీద పెరుగుతున్న బదనిక – అంటూ ఫ్లోరోసిసిస్ బాధితుల దీనస్థితిని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తారు కవి.

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా అవతరించాలని కలలు కన్నవారిలో అమ్మంగి గారు ముఖ్యులు. పూర్వపాలకుల హయాంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని వస్తువుగా తీసుకుని వారు రాసిన కవిత్వం పెద్ద పరిమాణంలోనే వుంది. అందులో వారి ప్రాంతీయాభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. నీకు నాకు నడుమ అనే కవితలో కూడా అది ఎట్లా ప్రతిఫలించిందో చూడండి.
నీకు నాకు నడుమ దేశం
అనురాగం చూపితే అన్నదమ్ములం
ఆగ్రహిస్తే యుద్ధఖైదీలం
మరో కవితలో ‘సిక్స్ టెన్ శిలాశాసనం/ శాపవిమోచనం పొంది/ నిరుద్యోగ యయాతులకు/ పునర్ యౌవనం/ ప్రసాదించేనా?’ అనీ, ‘అటు రాజకీయ రాక్షసబల్లి/ ఇటేమో తెలంగాణ తల్లి/ ఇకనైనా చరిత్ర వైపు/ త్రాసుముల్లు మొగ్గేనా?’ అనీ అంటారు కవి. అదే విధంగా తల్లీ నీకో దండం అనే కవితలో ‘ఉమ్మడి కుటుంబమే వద్దంటె/ ఉలిపికట్టె సామెత చెప్పి/ నన్ను కలుపుకున్న తెల్లారె కలుపుమొక్కను చేస్తివి/ ఈ దిక్కు లేని అనాథకు యాభయ్యేండ్లు’ – అంటూ బాధను వ్యక్తం చేస్తారు.

‘సానియా’, ‘రోదసి అనువాదం’ కవితలలో సానియా మిర్జానూ, సునీతా విలియమ్స్ నూ మన దేశానికి గర్వకారణాలుగా తలపోసి ప్రస్తుతించడం వుంది. వి. శాంతారాం దర్శకత్వం వహించిన దో ఆంఖేఁ బారా హాథ్ ఖైదీలను సంస్కరించవచ్చునని చెప్పిన గొప్ప చలనచిత్రం. దీన్ని వస్తువుగా మలిచి రాసిన కలలు కటకటాలు అనే కవిత ఉంది ఈ పుస్తకంలో. ఇందులో ఖైదీల పట్ల కవి వ్యక్తం చేసిన సహానుభూతి కనిపిస్తుంది. ఆ చిత్రం ‘వెండితెర మీద సంకల్ప సంతకం చేసింది’ అంటూ కవితాత్మకంగా రాస్తారు కవి.

ఇన్ని రకాల కవితా వస్తువులతో తులతూగిన ఈ సంపుటిలో ఎన్నో చోట్ల హాస్యరసం ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. అమ్మంగి గారు నిజజీవితంలో కూడా ఎంతో హాస్యప్రియులు అన్న విషయం తెలియని సాహితీపరులుండరు బహుశా. అయితే ఆ రసాన్ని అందంగా పలికించటం అందరివల్లా అయ్యే పని కాదు. దోమశకం అనే కవితలో

సూదివి నీవే సిరంజివి నీవే
అణుబాంబు పేలినా చిరంజీవివి నీవే
రెక్కల హెలీకాప్టర్ వై నామీద వాలి
నానో సెకండ్ లో నన్నో రోగకేంద్రాన్ని చేస్తావు
నా శరీరం నిండా నీకు పెదవులే
నీవన్నీ దొంగిలించిన ముద్దులే
దోమా! నామీద నీకెందుకంత ప్రేమ? – అంటూ నవ్వుల్ని పూయిస్తారు కవి.
జీవగర్ర అనే కవితను చూడండి.

ఇంట్లో కాలు పెట్టగానే నువ్వు లేవన్న దుర్వార్త
నిప్పై కాల్చింది కలల పంట మాడ్చింది
చిన్నా! నిన్నెవరు కిడ్నాప్ చేశారో
ఏ నల్లగదుల్లో దాచారో
ఎంత డిమాండ్ చేస్తారో – అంటూ మొదలవుతుంది కవిత. కిడ్నాప్ కు గురైంది ఎవరో చివరిదాకా తెలియదు పాఠకునికి. అంటే ఒక రకమైన ఉత్కంఠ చోటు చేసుకుంటుందన్న మాట. ఆఖరి పంక్తుల్లో అసలు విషయం తెలుస్తుంది. ఆ పంక్తులు ఇవే. రా! కదలిరా! ఉల్లిగడ్డా! నా బతుకు జీవగర్రా!!
టు శునీ విత్ లవ్, ఐస్ క్రీం కవితలు కూడా హాస్యాన్ని గుప్పిస్తాయి. ఇన్ని రకాల వస్తువుల మీద రాసిన కవిత్వం ఉండటం వల్ల ఈ సంపుటిలో ఎంతో వైవిధ్యం చోటు చేసుకుంది.

అమ్మంగి గారు సాధ్యమైనంత వరకు సరళమైన భాషను వాడుతారు తమ కవిత్వంలో. చాలా అవసరం అయితే తప్ప గ్రాంథిక పదాలు ఉండని డిక్షన్ వారిది. ఎక్కడైనా అటువంటి పదం ఉన్నా అది సందర్భానికి అతికినట్టుగా, సహజంగా వుంటుంది. ఈ లక్షణం మొదట్నుంచీ వారి కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తూ వస్తున్నది. ఆధునిక వచనకవిత్వం ఇట్లానే వుండటం అవసరం. శుద్ధమైన ఛందోబద్ధ కవి త్వం సంగతి వేరు. అందులో గ్రాంథిక భాష వున్నా పెద్దగా ఆక్షేపణ తెలుపలేం. భరోసాలో కవితలు పెద్దసంఖ్యలో లేకపోయినా, గంగిగోవుపాలు గరిటెడైనను చాలు అన్న చందంగా కావలసినంత అనుకంప, కవిత్వస్పర్శ, మానవతా ఛాయలు ఎక్కువగా ఉండటం గమనిచదగింది.

Story about writer Ammangi Venugopal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భిన్నకవితల సమాహారం భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: