లోచూపు ‘వెలుతురు చెట్లు’

నూతన అభివ్యక్తులతో, కవితా నిర్మాణ పద్ధతులతో భాషను మాధ్యమంగా చేసుకుని ఒక వస్తువును శిల్పంగా మలిస్తే అది మంచి స్థాయి కవిత్వం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తినపుడు,విస్తృతమైన కోణాలుండే ఒక వస్తువును, నువ్వు ఏ కోణం నుండి దర్శించావు, ఆ కోణాలలో దాగున్న నిగూఢత ఎంత, విభిన్నత ఎంత అన్న మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. కేవలం శిల్పం మాత్రమే ఒక వస్తువును ఉన్నతంగా మలచగలుగుతుందా అన్న సంశయం కలిగినపుడు, కొత్తదనం నింపుకోని వస్తు నిర్మాణ వ్యూహంలో […] The post లోచూపు ‘వెలుతురు చెట్లు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నూతన అభివ్యక్తులతో, కవితా నిర్మాణ పద్ధతులతో భాషను మాధ్యమంగా చేసుకుని ఒక వస్తువును శిల్పంగా మలిస్తే అది మంచి స్థాయి కవిత్వం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తినపుడు,విస్తృతమైన కోణాలుండే ఒక వస్తువును, నువ్వు ఏ కోణం నుండి దర్శించావు, ఆ కోణాలలో దాగున్న నిగూఢత ఎంత, విభిన్నత ఎంత అన్న మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. కేవలం శిల్పం మాత్రమే ఒక వస్తువును ఉన్నతంగా మలచగలుగుతుందా అన్న సంశయం కలిగినపుడు, కొత్తదనం నింపుకోని వస్తు నిర్మాణ వ్యూహంలో ప్రత్యేకత ఏముంది అన్నది సమాధానంగా నిలుస్తుంది.

శిల్ప నిర్మాణంలో కవి యొక్క ఊహా శక్తి, సృజనాత్మకత, భాషపై పట్టు ముఖ్య అంశాలుగా ఊపిరి తీస్తే, వస్తువును దర్శించడంలో కవికున్న లోచూపు, ఆ వస్తువుపై కవికున్న పరిశీలనా శక్తి మీద, ఆ వస్తువును ఎలాంటి నూతన కోణాల నుండి శిల్పీకరించగలరు అన్న విషయం ప్రస్ఫుటమవుతుంది. కవిత్వానికి శిల్పం ఎంత ప్రాధాన్య పూర్వకమైన అంశమో, విభిన్న వస్తు కోణ దర్శనానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. మూస పోసిన కోణాల నుండి వస్తువును శిల్పీకరిస్తున్న కవిత్వం ఒక వైపు, శిల్పమే లేని కవితా వస్తువులు మరో వైపు హెచ్చుగా ప్రవహిస్తున్న ప్రస్తుత కవితా ఉదృతిలో, విభిన్నంగా విలక్షణంగా వస్తువును లోచూపుతో దర్శించి, ఆ వస్తువుకు చక్కని అభివ్యక్తితో శిల్పాన్ని తొడిగి, సరళమైన భాష, సమతూకంతో సాగిన పద అర్థ శబ్ద బంధాలతో తాత్వికతను మార్మికతను అద్దుకుని, వినూత్వ జవసత్వాలను నింపుకున్న కవితా సంపుటి కవి ‘శాంతయోగి యోగానంద‘ రచించిన ‘ వెలుతురు చెట్లు‘.

వెలుతురు చెట్లు సంపుటిలోని కవిత్వంలోనే కాదు, కవితా శీర్షికల్లోనూ ఆ నూతనత్వం పాఠకుడిని పలకరిస్తుంది. శీర్షిక నుండే కవితా వస్తువుకు చెందిన ఆలోచనల్లోకి, సందిగ్దావస్థల్లోకి, పరిశీలనాతత్వంలోకి, ఉత్సుకతలోకి పాఠకుడు అడుగులు వేస్తాడు. ‘వెలుతురు చెట్లు, ముసలి దుప్పట్లు‘ వంటి కవితా శీర్షికల్లో చిక్కని మెటాఫర్ లు ప్రాణం పోసుకుని శ్వాసిస్తే, ‘రాత్రి అడవిలో, సముద్ర నిద్ర, తగలబడ్డ వాక్యం‘ వంటి శీర్షికల్లో, కవి ఏ వస్తువును కవిత్వంగా మలచబోతున్నాడు అన్న ఉద్రిక్తత సందిగ్దత పాఠకుడిని సంఘర్షణల్లోకి విసిరేస్తుంది. కవి తొలి విజయం కవితా శీర్షికల్లోనే పాఠకుడి నాడిని పట్టుకుని కవితలోకి వారి మనసును అంతర్లీనం కావించిడం.

సందర్భానుసారంగా వాక్య నిర్మాణాలలో ప్రయోగించిన చిక్కని మెటాఫర్, సిమిలి, అలిగోరి వంటి కవితా నిర్మాణ ప్రక్రియలు నూతన అభివ్యక్తీకరణలతో సంభాషిస్తూ ఇక్కడ మనసును కదిలిస్తాయి. ‘నచ్చేలా ఓ కవిత‘ , ‘ముసలి దుప్పట్లు‘ కవితలు పూర్తి స్థాయి మెటాఫర్ లు. అరుదుగా కనపడే ఇలాంటి ప్రయోగాలు కవిత్వ స్థాయిని పెంచి, పాఠకుడికి కవిత్వాన్ని చదవాలనే జిజ్ఞాసను ప్రేరేపించగలవు. కవిత్వ శ్వాసను, ఉనికిని కొత్త తీరాలకు చేర్చగలవు. ఇలాంటి కవనాల్లో శిల్పం కన్నా ఒక మెట్టు పైన విలక్షణ దృక్కోణం నుండి సాగే వస్తు నిర్మాణం నిలుస్తుంది. ఆ వస్తువును కవి దర్శించిన కోణమే ఇతర కవితల నుండి ఆయా కవితలను విలక్షణంగా నిలబెడుతుంది.

‘అభివృద్ధి సూచీ పై పైకి వెళుతోందని చెప్పడమే కాదు, అందులోంచి జారిపోయిన వారెవరో కూడా తెలియాలి‘. ఆ జారిపోయిన వారే ఈ కవి కవితా వస్తువులు. ‘ఇప్పటికీ కూడు గూడు అని పద్యాలు రాయాల్సొస్తోంది‘ అంటూ తన కవిత్వ వేదన ఎవరి కోసమో చెప్తూ, ఈ కవిత్వం యొక్క ఊపిరిని సింబలైజ్ చేసిన కవితా పంక్తులివి. పేదరికంలో నలిగిపోతున్న బాల్యాన్ని, కార్పొరేట్ మార్టులు దొంగలిస్తున్న ఖాళీ గోనె సంచి నవ్వుల్ని, మనుషుల్ని విభజిస్తున్న రేఖలను, మనసులను విరగ్గొడుతున్న గీతలను, నల్లపూసలు పోగొట్టుకున్న విధి వంచిత నిస్సహాయ స్థితులకు అక్షర రూపమిస్తూ, సమాజాన్ని ప్రశ్నిస్తూ, పరిణామక్రమిస్తున్న నాగరికతను ఎండగడుతూ వెలుతురు చెట్లు సంపుటిలోని కవితలు ప్రాణం వాసనను వెదజల్లుతున్నాయి.

మిక్కిలి కవితల్లో ప్రారంభ ఎత్తుగడ ప్రశ్నార్థకంగానో, సందేహంగానో ఉండి కవి చెప్పదలుచుకున్న వస్తువు యొక్క ఉద్దేశాన్ని కప్పి చెప్పేలా సాగుతుంది. పాఠకుడి నాడిని పట్టుకోగలిగే ఓ నిర్మాణ వ్యూహం ఇది. ‘మనసాక్షి‘ ‘అది నగరం‘ వంటి కవితలు పూర్తిగా కప్పి చెప్తూ, ఆ కవనం సంధించిన ప్రశ్నలు ఏ వస్తువుకు చెందినవి, ఆ వస్తువుల్లో దాగున్న మూలాలేంటి అన్న విషయాన్ని పాఠకుడి ఆలోచనా శక్తికి వదిలివేయబడ్డాయి. ఈ కవిత్వ సారాన్ని మూలాన్ని విప్పి చూడాలంటే పాఠకుడు ఆ కవితా పాదాలతో సంఘర్షణకు గురి కావల్సి వస్తుంది. అలా పాఠకుడిని సంఘర్షణల్లోకి నెట్టి వేయబడ్డ కవిత తన ఉనికిని స్థిర పరుచుకుంటుంది. మిఠాయి పొట్లం అంటూ నోస్టాల్జియా ను పలికించినా, నెమరు పిట్టయు అంటూ ప్రణయ సంవేదనల్లోకి మనసును పరుగులు పెట్టించిన వస్తువులు సైతం ఇక్కడ భిన్న శైలిని కలిగి ఉన్నాయి. దాదాపు కవితలన్నీ చక్కని నరేషన్ తో సాగి, జీవితం నింపిన అనుభవ సారాలను తాత్విక మార్మిక ధోరణిలో పొయెటిక్ ఫీల్ ను వాస్తవికంగా స్పృశించాయి.

‘ఆ విషయంలో నీవూ నేను ఒకటే, ఏది తెలియాలో అది మనకు తెలుసు‘ అంటూ ఆదిలోనే ఉత్సుకతను ప్రేరేపించేలా ప్రారంభమైన కవిత ‘నచ్చేలా ఓ పాత్ర‘. ఒక పక్షి జీవన విధానాన్ని, జీవిత పోరాటాన్ని మనిషి జీవితానికి ప్రతీకగా తీసుకుని అరుదైన అభివ్యక్తి నవ్యతను, పరిపక్వతను, దార్శనికతను ఆవిష్కరించారు కవి. ఈ కవిత ఆసాంతం ఒక మెటాఫర్. ఆ మెటాఫర్ లోని ఆత్మ ‘నీవూ నేను ఒక్కటే‘ అన్న వాక్యంలో ఉంది. గాఢమైన అర్థతతో కూడిన వస్తువుకు, పరిపక్వతను నింపుకున్న శిల్పం తోడైతే అది ముసలి దుప్పట్లు కవిత. పల్లెల్లో పిల్లలు ఎగిరిపోయి, అనాథలై రోదిస్తున్న అభాగ్యులైన బీద ముసలి మనుషుల కన్నీటి వెతలకు, ముడుతల శిల్పాన్ని వెచ్చగా చెక్కిన కవిత. ఈ కవితలో కవి ఎక్కడా ముసలి మనుషులు అనే పద ప్రయోగం లేకుండా, ముసలి మనిషిని దుప్పటిగా సింబలైజ్ చేస్తూ సాగిన కవనం హృద్యం.

‘కుమిలి కుమిలి కన్నీళ్ళొత్తుకుంటున్న దుప్పటికి, ఒక చోట తడారుతుంటే, మరో చోట తడౌతుంది‘ ‘కన్నీటితో దుప్పటి ఉప్పు తేలింది‘ అన్న లోతైన గాఢత కలిగిన వాక్యాల్లో కవి యొక్క ఊహాత్మక దృష్టి, సృజనాత్మకత ప్రస్ఫుటమవుతే, వస్తువును దుప్పటిగా సింబలైజ్ చేయడంలో లోచూపు కనిపిస్తుంది. ఎవరైనా మాట వరకు పిలిస్తే చాలు, దుప్పటి ప్రాణం రెపరెపలాడుతోంది‘ అన్న వాక్యాలు ఆ ముసలి ప్రాణాలను కళ్ళ ముందు దృశ్య మానం చేసి ఇమేజరీ ని కళ్ల ముందు నిలిపి మనసును చలింపజేయగలవు. ఇలాంటి నూత్న నవ్యత, హృద్యత కలిగిన వాక్యాలెన్నో వెలుతురు చెట్లు కవితా సంపుటిలో పలుకరించి హృదయాన్ని కదిలిస్తాయి. ప్రపంచ దుఖం, తెలుపు సందేశం, వారి బాల్యం వారికిచ్చేయాలి, తగలబడ్డ వాక్యం, ఒక నది అంతరంగం వంటి ‘కవితలూ వినూత్న ధోరణిలో కవిత్వీకరించబడ్డాయి.

తన తొలి కవితా సంపుటిలోనే వస్తువుకున్న భిన్న ధృవాలను తనదైన ప్రాపంచిక దృష్టితో స్పృశిస్తూ, పలు నిర్మాణ పద్దతులను కవితలుగా మార్చడం ప్రస్తుతం వెలువడుతున్న సాహిత్య సంపుటాలలో అరుదైన విషయం. చక్కని ప్రయోగాత్మక కవితలకు ప్రాణం పోసిన కవి శాంతయోగి యోగానంద గారికి అభినందనలతో ‘వెలుతురు చెట్లు‘ కవితా సంపుటికి స్వాగతం. ఈ చెట్లు సంపుటిలోని కవనాలకి ప్రతీకలు అయితే, ఆ వెలుతురు కవితల నుండి ఉద్భవించిన దార్శనికత.

Story about Veluthuru Chettu Novel Book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లోచూపు ‘వెలుతురు చెట్లు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: