పాటను ఆత్మనుంచి ఆత్మకు చేర్చిన గద్దర్ సాహితీయానం

Gaddar

 

లంగాణ, ఆంధ్రప్రేదేశ్‌లోనే కాదు, తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాలలో స్థిరపడ్డ తెలుగువారు ఆయన ఆలాపించే పాటలకు, ప్రదర్శనకు లక్షలాది మంది గద్దర్ అభిమానులుగా మారారు. కాళోజీ, శ్రీశ్రీ, సినారె, కెవిఆర్, చెరబండరాజు, ఇతర దిగంబరకవులు, వరవరరావు, బెంగాల్, హిందీభాషలకు చెందిన అగ్ర శ్రేణి రచయితలు ఆయనను అభిమానించి ఆయన కవితా శక్తియుక్తులను ప్రశంసించినవారే. తెలుగు సాహిత్యరంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కెవి రమణా రెడ్డి 1978లోనే ఆయనను లిజెండ్‌గా కీర్తించారు. ఆయన అభిమానులలో సాధారణ ప్రజలేగాక జాతీయ స్థాయి నాయకులు, జార్జ్‌ఫెర్నాండేజ్, మాజీ ప్రధాని వాజ్‌పేయి నుంచి సోనియాగాంధీ, చెన్నారెడ్డి వరకు, సీపిఐ, సీపిఎం కార్యకర్తలనుంచి, అగ్రశ్రేణి నాయకులకు వరకు, సినిమా పరిశ్రమకు చెందిన దాసరినారాయణరావు మోహన్‌బాబు, పవన్ కళ్యాణ్, నారాయణమూర్తి సహా తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ వరకు అనేక మంది ఉన్నారు.

సంప్రదాయ సంగీతంలలో శిక్షణపొంది, సినీ నేపధ్య గాయనిగా ప్రసిద్ధగాంచిన బాల సరస్వతి వరకు ఆయన అభి మానులలో ఉన్నారు. భాషకు సంబంధించి, పాటల బాణీలకు సంబంధించి, ఎవరికోసం పాడుతున్నామో వారి గురించి అవగాహన కలిగించి, శిక్షణ ఇచ్చి, అయన అనుసరించే కళా దృక్పథంపై అవగాహన కలిగించి ఆయన వేసిన మార్గంలో నడుస్తున్న వందలాది మంది కళాకారులు దేశవ్యాప్తంగా ఉన్నారు. కళ అనేది మతం, కులం, దేశం, వర్గం వంటి వైరుధ్యాలకు అతీతమన్నది ఒక అభిప్రాయం. దీనిని చెప్పుకోవడమే కానీ వాస్తవికంగా నిరూపించిన వారు లేరు. కానీ గద్దర్ సార్వజనీనమైన మానవ స్సందనలను తన పాటలలో దట్టించి దాని నిరూపించారు. నిర్దిష్టమైన రచనలతో దానిని నిరూపించారు. గద్దర్ దానిని చాలా వాస్తవికంగా నిరూపించారు.

నిర్దిష్టత అన్నది సాహిత్యరంగానికి ప్రాణమైంది. నిర్దిష్టతలోనే అంతర్జాతీయత ఉంటుంది. దేశమేదైనా, దాదాపు కాలమేదైనా మానవజీవితం, వారి ప్రతిస్సందనలు, శరీరధర్మాలు అన్నీ ఒకటే. 99 శాతం మనుషుల బతుకు పోరాటాలు ఒకటే. ఇందుకు ఆయన రాసిన పాట పాడేపాట ఒక దాఖలా. వామపక్షాల పాటలు, కవితలు ఇతర ప్రక్రియలు అన్నీ వారి ప్రచారవ్యూహంలో భాగమనీ, అవి నాసిరకమైనవనీ, ప్రచారాత్మకమైనవనీ అన్న వాదన ఉన్నది. కొంత వరకు ఇది వాస్తవం కూడ. గద్దర్ రచనలకు ఈ వాదన వర్తించదు. గద్దర్ తన గురించి చెబుతూ తన ఆత్మతో పాటను రూపొందించి మనిషి ఆత్మకు చేర్చడమే తాను చేస్తున్నదంతా అంటాడు. అందుకు ఆత్మనుంచి ఆత్మకు అన్న సూత్రీకరణ చేశాడు. ఎంతటి సంగీతకారుడైనా కేవలం ఆయా భాషలకే పరిమితం. భిన్న వర్గాల సామాజిక శ్రేణులను ఆకట్టుకోవడానికి అనుసరించే కళాదృక్పథం ముఖ్యం. గద్దర్ ఆయా భాషలలో పాడే శక్తి ఉన్నవారు. ఒకే పాటను 20 భాషలలో పాడి మెప్పించిన సమర్థుడు. బహుభాషా కోవిదుడు.

ఆయనకు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలు బాగా వచ్చు. ఇంతటి ప్రశస్తిని సాధించిన గద్దర్ గాలిలోంచో, ఏ దైవమహిమతోనో పుట్టుక రాలేదు. అందుకు కారణం శతాబ్దాల తరబడి చెక్కు చెదురకుండా కొనసాగి 1980ల వరకు పటిష్టంగా ఉన్న తెలంగాణ సంగీత, సాహిత్య సంప్రదాయాలు. ఎనిమిది వందల చారిత్రక పరంపర. ఆనాటి కాకతీయుల కాలంలో తెలంగాణసహా వారి పాలక సమాజం ఆర్థికాభివృద్ధి, సామాజిక సుస్థిరత, శాంతిని సాధించింది.ఇంజనీరింగ్, ఉక్కు తయారీ సహా సాహిత్యం, సంగీతం, ఇతర సామాజిక రంగాలలో వారికంటూ స్పష్టమైన విధానం ఉన్నది. ఇందుకు దాఖలా వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామం. వీరశైవధర్మం ప్రభావంతో మహాకవి పాల్కుర్కి సోమన వంటి సంగీత చరిత్రకారుని ప్రభావంతో రూపు దిద్దుకున్న సాహిత్యం, సంగీతం, వాయిద్యాలు ప్రధాన కారణం.

తన నేపథ్యంలో బలమైన ఈ సంప్రదాయ పరంపర, దానికి తగిన అధ్యయనం, అందులో చిన్న నాటి నుంచి లభించిన శిక్షణ నుంచి గద్దర్ అనే మహావ్యక్తి రూపు దిద్దుకున్నాడు. ఆచరిత్రను స్వల్పంగా పాఠకులకు పరిచితం చేస్తే గద్దర్ శక్తియుక్తులను మరింత లోతుగా అవగాహన చేసుకోవచ్చు. దానిదరిమిలా తెలుగు సంస్కృతికీ, సాహిత్యం, భాషారంగాలలో గద్దర్ 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న పాత్ర గురించి చర్చించడం ఉంటుంది. ..క్రీస్తుపూర్వం 6శతాబ్దం నుంచి అంటే బౌద్దం ఉన్నత దశలో ఉన్న కాలం నుంచి తెలంగాణ చరిత్ర లిఖిత పూర్వకంగా ఉన్నది. బుద్దుని జాతక కథలలో అంధక దేశం పేరుతో, ఆనాడు ఏర్పడ్డ 16 జనపథాలలో ఒకటిగా వాసికెక్కింది. పురాణాలలో త్రిలింగ దేశంగా పేరెన్నిక గన్న రాజవంశాల పాలనకు కేంద్రంగా ఉన్నది. వారి ఆధ్వర్యంలో సుస్థిరమైన పాలనను తెలంగాణ చవి చూసింది. ఆయా రాజవంశాలు తెలంగాణ కేంద్రంగా పుట్టుకొచ్చి మధ్యభారతం నుంచి కన్యాకుమారి వరకు ఆయా రాజ్యాలు ఏర్పడ్డాయి.

అయినా ఒక భౌగోళిక భూమండలంగా తెలంగాణ పేరు యథావిధిగా కొనసాగుతోంది. అదే కాలాన ఉత్తరాదిని చూస్తే దక్షణాదిలో అడుగు పెట్టాలంటే వింధ్యపర్వతాలు, కొంత అడవిభాగం దాటాలి. తొలుత అడుగు పెట్టేది తెలంగాణ భూభాగంలోనే. దక్షణాదిని తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకున్న ప్రతిరాజవంశం తెలంగాణ మీద దాడులు చేసింది. దేవగిరి రాజులు అనేక సార్లు, అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యం 13సార్లు దాడులు చేసినా కాకతీయ సామ్రాజ్యం నిలదొక్కుకున్నది. 300 ఏళ్లపాటు కొనసాగింది. పరాయి పాలకుల పాలనలో, ఢిల్లీకేంద్రంగా జరిగిన పాలనలో తెలంగాణ ఏనాడూ లేదు. ఏనాడూ వలస పాలనలోలేదు. కుతుబ్షాహీలు, తెలంగాణ ప్రధాన భాగమైన హైదరాబాద్ రాష్ట్రాధినేతలు కూడా భారతీయులే. జపాన్,రోవ్‌ు, చైనా, గ్రేట్ బ్రిటన్ దేశాలవలే తెలంగాణ సర్వ స్వతంత్ర దేశంగా ఉన్నది. పురాణాల కాలం నుంచి ఒక భౌగోళిక ప్రాంతంగా తెలంగాణ ( ఇప్పటి ఆంధ్రకు చెందిన భూభాగాలు, రాయలసీమ భాగాలు, కర్ణాటక, మహారాష్ర్ట, చత్తీస్‌గఢ్‌లోని భాగాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు) ప్రస్తావన ఉన్నది.

మనిషి మనుగడకు, జీవరాశి మనుగడకు అనుకూలమైదిగా ఒక ప్రత్యేకలక్షణం కలిగిన భూమండలంగా ఉన్నది. ఇంతేకాకుండా తెలంగాణ ప్రస్తావన ఉన్న శాసనాలు ఒడిష్సా నుంచి మొదలు పెడితే తమిళనాడు లోని రామేశ్వరం దేవాలయం వరకు కనిపిస్తాయి. ఈ క్రమంలో శాతవాహనులు, రాష్ర్టకూట, పశ్ఛిమ చాళుక్యుల పాలనను చవిచూసి వారిపాలనకు రాజధానిగా ఉన్న తెలంగాణ కాకతీయుల కాలాన ఒక కొత్త దశలోకి వచ్చింది. ఈ కాలాన యూరోపులో తొలిదశ వికాస ఉద్యమం కొనసాగుతున్నది. అదే కాలాన ఉత్తరాది సాంతం అశాంతితో యుద్ధాలతో మునిగి తేలుతున్నది. రాష్ర్టకూట రాజవంశంలో భాగం, తెలంగాణ కేంద్రంగా రాజ్యాధికారానికి వచ్చిన కాకతీయ రాజవంశం క్రమంగా కనౌజ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించింది. ఆరోజులలో ఆర్థికంగా, రాజకీయ పరంగా సైనికపరంగా బలోపేతమైంది. ఇందుకు కారణం వ్యవసాయరంగం. వజ్రాల వ్యాపారం. ఉక్కు ఆయుధాల ఎగుమతి, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు దిగుమతుల వ్యాపారం పరాకాష్టకు చేరింది.

సామాజికంగా ఆనాటి రోజులలో రూపుదిద్దుకున్న కులాలు గ్రామపాలక వ్యవస్థలో సాధికారత సాధించాయి. వ్యవసాయోత్పత్తి, కుటీర పరిశమ్రలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఆర్థికాభివృద్ధితో పాటు సుస్థిర సామాజిక శాంతి ఏర్పడడంతో అనేక వైవిధ్యభరితమైన శాస్త్ర గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి.కళలు అనేకం వికసించాయి. ఉత్తరాదితో పోలిస్తే సాహిత్యం, సంగీతం సామాజిక రంగాలతో కాకతీయ సామ్రాజ్యం ఎంతో ముందంజలో ఉన్నది. వీరశైవం అధికారమతం కావడం వల్ల కష్టజీవులైన శూద్ర కులాలకు సాధికారత లభించింది. కులపురాణాల వల్ల ప్రతిసామాజిక వర్గం తమదైన అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో జీవించాయి. రాష్ర్ట కూటులైన తొలి కాకతీయ రాజులు ఆ రాజ వంశంతో విడివడి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 300 ఏండ్లపాటు పరిపాలించింది. ఆ రాజ్యం అంతటి సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడానికి ఒక తాత్విక భూమికను ఏర్పాటు చేసిన మహనీయుడు. ఆయన గద్దర్ కంటే 900ల ఏళ్ల ముందు వాడు. ఆమహానీయుని పేరు పాల్కుర్కి సోమన. వీరిద్దరి మధ్య తెలంగాణ భాష సంస్కృతుల కోసం కాపాడడం కోసం ఉపక్రమించిన మహ కవులు కొంతమంది ఉన్నారు.

ముఖ్యుల గురించి చెప్పుకోవాలంటే గోన బుద్దారెడ్డి, కొరివి గోపరాజు, పోతన, పొన్నగంటి తెలగన, గద్వాల మహారాజు సోమ భూపాలుడు, దున్న ఇద్దాసు, రాకంచర్ల వెంకట దాసు, వేపూరు హనుమద్దాసు, జొన్న ఎల్లదాసు, సురవరం, కాళోజీ ఉన్నారు. ఆయా కాలాల్లో ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిన రచయితలువీరు. తెలంగాణ సాంస్కృతిక రంగం పునర్జీవనంలో కీలక పాత్రదారులు. గద్దర్ గత 50 ఏళ్లుగా నిర్వహించిన పాత్ర వారి కంటే కూడ కొన్ని విషయాలలో విశిష్టమైంది. తెలుగు భాష పరిరక్షణలో ఆయన పాత్ర. ఆయన కాళాకారుడు, వ్యాఖ్యాత, రాజకీయ తాత్విక భూమిక ఉన్న సంగీతకారుడు కావడం వల్ల ఆయన తన రచనలలో వాడే ప్రజల భాష, నుడికారం, లక్షలాది మంది జనానికి చేరగలిగాయి. అందుకే ఆయన పాత్ర విశిష్టమైంది. వీర శైవధార్మిక ప్రచారం వల్ల సోమన భావాలు ఆ రోజులలో సామాన్యజనం లోకి వెళ్లాయి. ఆయన రాసిన బసవపురాణం ఇప్పటి వీరశైవ ధర్మానుయాయిల ఇండ్లలో పరమ పవిత్ర పారాయణ గ్రంథం. గూగీ కూడా అంతే.

భాషకు సంబంధించి వలసపాలకుల ఆధిపత్యాన్ని, వారి రాజకీయాలను సైద్ధాంతిక స్థాయిలో వ్యతిరేకించిన రచయితగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన కీన్యాకు చెందిన నల్లజాతి రచయిత గూగి వా థియాంగో ఉన్నారు.వీరశైవధర్మం సోమనకు గద్దర్‌కు ఒకటే కావడం చూడ వచ్చు. గూగికి, గద్దర్‌కు మార్క్సిస్టు తాత్విక భూమిక ఒకటే కావడం చూడవచ్చు. వ్యవస్థనుంచి వివక్ష అనుభవించడంలో గద్దర్‌కు గూగికీ సారూప్యత ఉండడం గమనించాలి. గద్దర్ తెలుగు భాషకు సంబంధించి ఉత్తరాదిలో స్థానిక భాషల వికాసం కోసం పరోక్షంగా కొంత ప్రత్యక్షంగా ఆ తరహాలో పనిచేసి ఉన్నారు. ఇందుకు అనేక మంది రచయితలైన కళాకారులు, రచయితలకు భాష,పాటల రచన విషయంలో గద్దర్ శిక్షణ ఇచ్చారు. వలస పాలకుల పాలన సజావుగా సాగడానికి రూపుదిద్దు కున్న ప్రామాణిక భాషను, ఫ్యూడల్ సంగీత సంప్రదాయాన్ని తిరస్కరిస్తూ రెండు పుస్తకాలు రాసిన గద్దర్ గూగికంటే ముందే ఆ పని చేశాడు. ఆరెండిటిలో ఆయన భాషా దృష్టితో ఒక పుస్తకం రాశారు.

దాని పేరు “ ప్రతి పాట వెనుక కథ ఉందా” మరొకటి ఫ్యూడల్ సంస్కృతిని ప్రజాస్వామిక సంస్కృతిగా మార్చే ప్రక్రియపై తన అనుభవాలను రంగరించి “తరగని గని” పేరుతో ఒక పరిశోధక గ్రంథం రాశారు. గద్దర్ 50 ఏళ్ల కృషి గురించి బాగా అవగతం చేసుకోవాలంటే ఆయన కార్యరంగానికి సారూప్యతలు ఉన్న కవులు, రచయితల కృషిని అర్థం చేసుకోవల్సి ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే సోమన, గూగితో పోల్చి చర్చించదలుచుకున్నాను.ఇందుకు నేను పూనుకోవడానికి కారణాలు ఉన్నాయి. తెలంగాణ సాహిత్య, సంగీతం సప్రదాయాలకు, సారాంశంలో ఆధునిక భారతదేశ ప్రజాస్వామిక విలువలకు, ప్రత్యామ్నయ రాజకీయాలకు గద్దర్ ఒక ప్రతీక. విప్లవ సాంస్కృతిక రంగం, తెలుగుభాషే కాకుండా తెలుగులో గోండు ఆదివాసి సాహిత్యానికి, దళిత, తెలంగాణ సాహిత్యోద్యామాలకు ఆయన పయనీర్.

ఇంతటి చరిత్ర ఉన్న గద్దర్‌ను మౌలిక మార్పుకు ఉద్యమిస్తున్న విప్లవపార్టీ ఆయన గురించి గర్వంగా చెప్పుకోవల్సిన వ్యక్తి గద్దర్ వ్యవసాయ కూలి, అంటరాని కులంలో జన్మించిన ఒక బాలునికి ఒక అవకాశం వచ్చి పరిస్థితులు సానుకూలిస్తే ఏస్థాయిలో ఎదుగుతాడో గద్దర్ జీవిత పయనమే నిదర్శనం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం సాధించిన విజయం. సారాంశంలో ప్రజా ఉద్యమాలు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సాధించిన విజయం కూడ. అయినా ఆశ్చర్యంగా ఆయన మీద ఎటువంటి అధ్యయనం వెలువడక పోవడం చూడవచ్చు. అయన రచనలు కూడ పూర్తిగా అందుబాటులో లేవు.

ఆయన జననాట్యమండలిలో పాడిన పాటలను కూడ చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతే కాకుండా తన రచనలను తనకు తానుగా గద్దర్‌లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి వాటిని వెలుగులోకి తీసుకరావడానికి సాధ్యం కాని పని. ఆయన పనిచేసిన సంస్థలకు సంబంధించి, ఆయన భాగమైన ఉద్యమ వ్యక్తులు పూనుకుని చేయవలిసింది. కానీ కారణమేదైనా ఉపేక్ష జరిగింది. ఉన్నవాటి మీద కూడ అధ్యయనం లేదు. దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన చెరబండరాజు రచనలలో కనీసంగా ఒక కవితా సంపుటి కూడ దొరకదు. ఆయనమీద ఒక పుస్తకం కూడ అందుబాటులో లేదు. ఉద్యమాల ముసుగులో సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఫ్యూడలిజానికి గుర్తయిన కులతత్వవాదులు నెరిపే ఆధిపత్యం, వారి ప్రాధామ్యాలే ఇందుకు కారణమని భావిస్తున్నాను.

Story about KV Ramana Reddy Telugu Literature

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాటను ఆత్మనుంచి ఆత్మకు చేర్చిన గద్దర్ సాహితీయానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.