అంత‘రంగరించిన’ విమర్శ

Criticism

 

కవి అంతరంగాన్ని పట్టుకోవడం అంత సువులు కాదు. కాలాన్ని మదించి కవిత్వపు అంతరంగాన్ని పట్టుకోవడం అంతకన్నా సులువు కాదు. కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి ఈ పనే చేశారు. కవిత్వంపై ఉన్న ప్రేమ వల్ల కావొచ్చు. పుట్టి పెరిగిన ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాహిత్య స్థితి గతుల ప్రభావం కావొచ్చు. కవిత్వపు అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథాన్ని తెలుగు పాఠకుల ముందుకు తెచ్చారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఈ గ్రంథం కేవలం కవిత్వపు అంతరంగానికి, కవిత్వ విమర్శకే పరిమితం కాలేదు. కాల పరీక్షను ఎదుర్కొంటున్న కవుల నేపథ్యాలను, స్థల కాలాల పరిధులు, పరిమితులను కూడా ఈ రచయిత బలంగా పట్టుకున్నారు.

గడిచిన కొన్నాళ్లుగా తెలుగు సాహిత్యంలో కొంత మంది కవులు కాల పరీక్షను ఎదుర్కొంటున్నారు. తమ గురించి రాయలేదని కొందరు…. తమ అస్తిత్వాలను పట్టించుకోలేదని మరి కొంత మంది వాదోపవాదాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది మంచిదే. చర్చ జరగాల్సిందే. ఈ గ్రంథం ఇలాంటి వాదోపవాదాలకు, చర్చలకు, సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ జన జీవితాలను అల్లుకున్న పాట, గేయం, పద్యం, వచన కవిత్వం వంటి వాటన్నంటినీ ఈ గ్రంథంలో చర్చించారు రచయిత. మొత్తం గ్రంథంలోని సాహిత్య విమర్శ జరిగిన తీరు గురించి కాకుండా ఈ గ్రంథం చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని అన్పించిన విషయాలను కొన్నింటిని ప్రస్తావిస్తాను.

ఈ పుస్తకంలో రెండు వందల పేజీలున్నవి. ఇది ఆధునిక తెలుగు సాహిత్యపు తీరును. పాటను. మాటను. పలుకుబడిని. సాహిత్యంగా మారిన ఊహలను. నిష్పాక్షింగా తూకం వేసింది. కవులను వారి నేపథ్యాలను కూడా విడమర్చి వివరించింది. సమాజంలో వచ్చిన మార్పులు కవిత్వంపై ఎట్లా ఉన్నాయో కవిని, ఆయన కాలాన్ని పట్టుకున్నాడు రచయిత. అందుకే “ఒంకర టింకర తొవ్వల్లో సీతారాం” (పేజీ.38)లో ఒంకర టింకర గీతలు గీయడం చాలా కష్టం అంటాడు. ప్రపంచీకరణ కాలంలో మనుషులు మారిన తీరు. మనస్తత్వాల్లో వచ్చిన మార్పు. ఎదుటి వారిని అంచనా వేసే పద్ధతులు.

పాలకులు, పాలితులు, ఇలాంటి విషయాలన్నీ సీతారాం తన సాహిత్యంలోకి వొంపిన తీరును అద్భుతంగా మనను అక్షరాల వెంట తీసుకెళ్లి చూపిస్తాడు ఏనుగు నర్సింహారెడ్డి. “నా పేరు ప్రజా కోటి/ నా ఊరు ప్రజావాటి” అని ఎలుగెత్తి చాటిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. నాటి నిజాం నవాబు పాలన గురించి, గడీల గండాల గురించి గళమెత్తిన వాడు. కలంతో ఈడ్చీ కొట్టిన వాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోదయం వైపు ఎందుకున్నారనే ఆరోపణ ఉంది. దానికి సమాధానం అంతరంగం ఆధునిక కవిత్వ విమర్శలో దొరుకుతుంది. 1969 నాటి జై తెలంగాణ ఉద్యమాన్ని. 1972లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమాన్ని నిరసించారు. విప్లవాన్ని కాంక్షించిన కవి, రచయిత ఎందుకిలా చేశారంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

సి. నారాయణ రెడ్డి మీద కూడా ఇలాంటి చర్చనే ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన సమయంలో ఆయన “తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది” అన్నారనే విమర్శ గట్టిగానే ఉంది. అంతే కాదు భారతం పుట్టిన రాజమహేంద్రవరంలో.. భాగవతం వెలిసిందే ఏకశిలా నగరంలో ఈ రెండింటిలో ఏది కాదన్నా ఇన్నాళ్ల తెలుగు సంస్కృతి నిండు సున్నా అని కూడా అన్నారు. ఆ తర్వాత ఈయనే తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని కూడా అన్నారు. ఇలా రెండు రకాలుగా ఎందుకు చెప్పారు సి.నా.రె. అంటే దానికి సమాధానమూ ఈ గ్రంథం లో చాలా స్పష్టంగా దొరుకుతుంది. సి.నా.రె. సాహిత్యాన్ని, కవిని, కాలాన్ని ఇట్లా అంచనా వేశాడు ఈ గ్రంథ కర్త.“కవిత్వంలోని మెరుపుల్ని చూడండి. మరకల్ని కాదు…. కవి ఓపెన్ గా ఉండాలంటాడు సి.నా.రె. కవి ఏ ఒక్క వాదానికో, వర్గానికే పరిమితం కాకూడదనే విషయన్ని చెప్పారు. సి.నా.రె. ప్రగతశీల మానవ వాదాన్ని ఎంచుకున్న తీరుకు సంబంధించిన మంచి ఉదాహరణలు చూపించారు.

ప్రపంచ మానవుల గురించి గొంతెత్తి ఘోషించిన శ్రీ.శ్రీ. ఎందుకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ లేదు. తెలంగాణ ఆకాంక్షను ఎందుకు రాతల్లో చూప లేదు అనే ప్రశ్నలున్నా యి. పైన పేర్కొన్న కవుల పరిస్థితిలాగే ఈయనదనే సమాధానం సులభంగానే దొరుకుతుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో వచ్చిన కవిత్వాన్ని కవుల గురించిన నేపథ్యాన్ని. వారికి ప్రజల పట్ల. ఈ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమనాను రాగాలు. వేదన. రోదన. ఆర్తిని అక్షరాల్లో వ్యక్తం చేసిన తీరును సరిగ్గా పట్టుకున్నారు. కాళోజీ, సిద్దారెడ్డి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, జూకంటి వంటి వారి కవిత్వాలు చెప్పుకో దగినవి. “నీలం సంజీవరెడ్డి…. నీ బతుకు బంజరు దొడ్డి” అని కాళోజీ అంటే….“ పట్టి ముట్ట లేదు/ రావడానికైనా/ ముట్టడానికైనా/ పిట్టలుంటే కదా/ముట్టడానికి.” సిద్దారెడ్డి పుట్టెడు దు:ఖంతో బొందలగడ్డలైన తెలంగాణ పల్లెల వలపోతను వ్యక్తీకరించిన తీరును ఈ పుస్తక రచయిత మనకు చెప్తాడు. అంతే కాదు ఈ ప్రాంతపు కవుల నేపథ్యం భూమితో. పోరాటాలతో.

ఆరాటాలతో మమేకం అయినందు వల్ల జన సాహిత్యాన్ని పుట్టించారనే కవుల నేపథ్యం మనకు చెప్పకనే చెప్తాడు. అందుకే ఈ గ్రంథంలో కాలంతో పాటు… కవులను. వారి పరిధులను. పరిమితులను. ఏక కాలంలో చెప్తాడు ఏనుగు. అంతే కాదు తెలుగు నేలపై రాలిన చైతన్యపు సాహిత్యపు రాశులు అవి పురాణాల్లో నుండి వచ్చినా, జనపదుల మౌఖిక సాహిత్యాల్లో నుండి వచ్చినా ఆయా కాలాలను, నాటి సమాజపు పోకడలను, భాషలను బాగా అర్థం చేసుకున్న కవిగా విమర్శకుడిగా మనకు ఏనుగు నర్సింహారెడ్డి కన్పిస్తాడు. ఆధునిక, సంప్రదాయ సాహిత్యాల ముద్ర తెలుగు నేలపై ఉన్న తీరునూ చెప్పారు. అందుకే సదాశివ మాష్టారు సాహిత్యాన్ని తీసుకున్నారు.

భారతం, భాగవతాలు, ఇతరేతర ఆయన రచనా వస్తువులను మనకు పరిచయం చేస్తారు. గ్రామీణ ప్రాంత నేపథ్యాలను, సాహిత్యపు వ్యక్తీకరణ తీరును చెప్తూ ఆచార్య కూరెళ్ల విఠలాచార్య తాత్వికతను చూపిస్తారు. అంతే కాదు హైద్రాబాద్ నగరపు జన జీవితాలను అక్షరాల్లో అద్దిన కవి ఆశారాజు సాహిత్యాన్ని, పొక్కిలి, మత్తడి అంటూ పొలికేక పెట్టిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఆర్తిని, ఆర్ద్రంగా వ్యక్తీకరించిన అక్షరాల పంక్తుల కవాతుల రీతులను, వాటి నేపథ్యాలను ఈ తరానికి పరిచయం చేస్తున్న గ్రంథం. అంతరంగం… ఆధునిక విమర్శ గ్రంథం. దీంట్లో మొత్తం 26 వ్యాసాలున్నాయి. ఆయా సందర్భాల్లో రచయిత రాసుకున్నవి. ఒక్క మాటలో చెప్పాలంటే కవులు కాల పరీక్షను ఎందుకు ఎదుర్కొంటారు. దానికి సమాధానం ఏమిటీ.? వారిని సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే చాలా చాలా విషయాలను మనకు సులభంగా అర్థం చేయిస్తుందీ గ్రంథం.

Story about Antharangam criticism on modern poetry

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అంత‘రంగరించిన’ విమర్శ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.