నారంశెట్టి ఆనందలోకం

  జానపదమనగా జనం మధ్య నుండి వచ్చినది. అంటే పల్లె భాష, మట్టి పరిమళం లాంటి భాష. సాధారణ ప్రజలు పాడుకునే పాటలనే జానపదములు అంటారు. పూర్వం నుండి జానపద సాహిత్యం ఉన్నది. నేటికి ఆ సాహిత్యం అక్కడక్కడ కనపడుతూనే ఉంది. పాటలు, గేయాలు ఎక్కువగా ఈ సాహిత్యంలో కనపడుతుంది. జనుల నోట్ల నానే భాష ఆధారంగా వచ్చినదే జానపద సాహిత్యం. అన్నమాచార్యలు జానపద బాణీలలో చాలా పదములు రాశారు. ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట, […] The post నారంశెట్టి ఆనందలోకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జానపదమనగా జనం మధ్య నుండి వచ్చినది. అంటే పల్లె భాష, మట్టి పరిమళం లాంటి భాష. సాధారణ ప్రజలు పాడుకునే పాటలనే జానపదములు అంటారు. పూర్వం నుండి జానపద సాహిత్యం ఉన్నది. నేటికి ఆ సాహిత్యం అక్కడక్కడ కనపడుతూనే ఉంది. పాటలు, గేయాలు ఎక్కువగా ఈ సాహిత్యంలో కనపడుతుంది. జనుల నోట్ల నానే భాష ఆధారంగా వచ్చినదే జానపద సాహిత్యం. అన్నమాచార్యలు జానపద బాణీలలో చాలా పదములు రాశారు. ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు, శారదగాండ్రు, చెంచు బాగోతం, కొమ్ముకథ, వీధి నాటకం, పిచ్చుక కుంట, వీరముష్టి, దొమ్మరాట, కొఱవంజి, గొల్లసుద్దులు, జంగం కథ, జక్కుల కథ, కాటిపాపలకథ, దాసరికథ, చెక్క భజన, యక్షగానం, పులివేషాలు తెలుగువారి జానపద కళారూపాలు అనే పుస్తకంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు విస్త్రుతంగా చర్చించారు.

జానపద సాహిత్యంలో బాల సాహిత్యం అద్బుతంగా ఉండేది. అనేక కారణాలతో బాలసాహిత్యాన్ని రచయితలు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దేశ భావితరాలకు చక్కని బాలసాహిత్యాన్ని అందిస్తున్న నేటి రచయితలు చాలా తక్కువగా ఉన్నారు.
తెలంగాణ నుండి పెండెం జగదీశ్వర్ గారు జానపద బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సందర్భంలో వారి అకాల మరణం బాలసాహిత్యానికి తీరని లోటు కలిగించింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో బాలసాహిత్యంలో కథ, నవల, గేయం, పాట అన్ని ప్రక్రియలను రాస్తున్న నేటి ప్రముఖ కవుల్లో నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు ముఖ్యులు.

ఇప్పటికే బాలసాహిత్యంలో ఇరవైకి పైగా పుస్తకాలు ముద్రించారు. 2018 కి గాను వారు రాసిన ఆనందలోకం అనే బాలసాహిత్య జానపద నవలకు కేంద్ర సాహిత్యం అకాడమి పురస్కారం అందుకున్నారు. రచనలు చేయడమే కాకుండా తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం, సాహిత్య పోటీలను నిర్వహించడం అంటే వారికి అమితమైన ఇష్టం. వారి సహా ధర్మపత్ని అయినా అమ్మాజి గారు కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నారు. నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి ప్రతి అడుగులో అడుగు వేస్తూ వారిని ముందుకు సాగేలా చేస్తున్నారు. వ్యక్తిగతంగా అమ్మ అని నేను ప్రేమగా పిలుచుకుంటాను. స్వచ్చమైన ప్రేమ అందరిని కలుపుకోవడం అమ్మ గారి ప్రత్యేకత.

ఆనంద లోకం నవలను నా కోణంలో విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నవల ఒక రాజ వంశానికి చెందినది. హేళాపురి రాజ్యానికి విక్రమ దేవుడు రాజు వారి భార్య వకుళాదేవి. ఎన్నో పూజలు, వ్రతాలూ చేసిన తర్వాత పుట్టిన కొడుకు విజేయుడు. నవల మొత్తం ఈ విజయుడు మీద ఉంటుంది. దేశ పర్యటనలో తన రాజ్యంలో, పక్క రాజ్యాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. ఈ నవలలో చాలా చిన్న కథలు కూడా మనకు తారసపడతాయి. అన్ని కథల్లో రచయిత పిల్లలకు మంచి, చెడు వివరించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. పిల్లలకు సంబంధించిన నవల కనుక భాష విషయంలో సరళంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. జానపద నవల కనుల పాత్రల పేర్లు, రాజ్యాల పేర్లు నాటి స్మృతులను గుర్తుకు తెస్తాయి. సాధారణంగా పిల్లలకు ఊహ ప్రపంచం అంటే ఇష్టం కనుక ఇందులో విజేయుడికి అన్ని జీవులు భాషను అర్థం చేసుకునే వారాన్ని పొందేలా రచయిత సృష్టించి సకల జీవరాశి యొక్క అభిప్రాయాలను, బాధలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు. ఒక సందర్భంలో విజేయుడి గుర్రమైన పంచకళ్యాణికి, గ్రద్దకు స్నేహం కుదురుతుంది. వారి స్నేహం ఆధారంగా ఇతర రాజ్యాల పరిస్థితులను అర్థం చేసుకుంటాడు.

పరిస్థితులకు అనుగుణంగా సమయస్పూర్తితో సమస్యలను చాకచక్యంగా ఎలా పరిష్కరించుకోవాలి, ముందు గా వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలి లాంటి ఎన్నో విషయాలు ఈ నవలలో కనపడతాయి. ఉదాహరణకు రాజ్యంలో ఏనుగులు జొరబడి బీభత్సం చేసి ఆస్తి, జననష్టం చేస్తాయి. ఆ సందర్భాల్లో విజయుడు చూపించిన తెలివితేటలూ, ఏనుగులను ఏ విధంగా పట్టుకోవాలి లాంటి అంశాలపై సుదీర్ఘంగా రాశారు. ఏనుగులను చంపకుండానే పట్టుకోవాలి పర జీవులను చంపకూడదు అనే నియమాలు, శత్రువు దీన అవస్థలో ఉన్నప్పుడు దాడి చేయకూడదు అనే నియమాలు కనపడతాయి. అలాగే శత్రువు దుర్మర్గుడైతే తగిన శిక్ష పడాలి అని విజేయుడి పాత్ర నుండి నేర్చుకోవచ్చు. ఇదే సందర్భంలో రచయిత పరిశీలన శక్తి ముఖ్యమైందని విజేయుడి పాత్ర ద్వారా తెలియజేస్తారు. ఒక సమస్యపై పోరాడాలంటే ముందుగా ఏమి జరిగింది, ఎలా జరిగింది, అలాంటి పరిస్థితులను అక్కడి ప్రజల ద్వారా తెలుసుకుంటాడు. పోరాటం దుడుకుగా చేయకూడదు అన్ని తెలుసుకోవాలనే అర్థం కనపడుతుంది.

చాలా చోట్ల అవసరానికి తగినట్టుగా సామెతలు వాడటం జరిగింది. సామెతలు లేదా లోకోక్తులు అంటే ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు‘ అంటారు. ప్రజలు తమ అనుభవాల్లో నుంచే సామెతలను పుట్టించారు. నేటి కాలంలో వీటి వాడుక తక్కువై పోయింది కాని ఆరోజుల్లో సామెతలను సందర్భానుసారంగా చక్కగా వాడేవారు. సాహిత్యంలో అక్కడక్కడ కొంతమంది రచయితలే వాడుతున్నారు. ముఖ్యంగా బాలసాహిత్యంలో సామెతలు వాడటం వల్ల పిల్లలను విషయాన్నీ బాగా అర్థమయ్యేలా చేయవచ్చు. సామెతలు వాడటం చేత రచన దీపంలా వెలుగుతుంది. అప్పటివరకు సాదాగా సాగిన వ్యాఖ్యానంలో సామెత ఒక మెరుపులా మెరుస్తుంది. సామెతలు వాడటం చేత రచనను సాధారణమైన రీడర్ కి చేరువ చేయవచ్చు. ఆ విధంగా ఈ నవల ప్రతి హృదయానికి హత్తుకుంటుంది.

రచనలో రచయిత వాడిన వ్యక్యానం పరిశీలిస్తే విజేయుడు దేశాటనలో ఉన్నప్పుడు తేజస్వి అనే మునిని నదిలో మొసలి పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు విజేయుడు ఆ మొసలితో పోరాటం చేస్తాడు. ఆ సందర్భంలో మొసలి శరీరపు అడుగు భాగంలో జల్లెడగా మారిపోయింది అంటే చాలా సార్లు పొడవడంతో కత్తిపోట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి ఈ విధమైన ప్రతీక వాడి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పోలికలు, ప్రతీకలు రచనలో చాలా కనపడతాయి రచన సాఫీగా సాధారణమైన శైలిలో రాసుకుంటూ పోతే ఎంత గొప్ప సబ్జెక్టు అయినా చదవడానికి రీడర్స్ ఇష్టపడరు. నవలకు చదివించే శైలి ఉండాలి అది లేకపోతే రచన చతికిలపడి పోతుంది. ఈ విషయంలో కూడా రచయిత చాలా జాగ్రత్త వహించారు. ఈ నవలలో శబ్ద కాలుష్యం, గోవధ , కరువు కాటకాల, అన్యాయాలు, పేద ప్రజల దైన్యాన్ని, దోపిడీ వ్యవస్థను, శ్రామిక ప్రజల నిస్సహాయతను వారి అమాయకత్వాన్ని చర్చించడం ద్వారా బాలలకు అనేక విషయాల పట్ల అవగాహనా కల్పించారు.

ఈ నవల ముగింపు బాగా ఆకట్టుకుంటుంది. ఒక మునీశ్వరుడు ఆనందలోకాన్ని సృష్టిస్తాడు. మనకు నిజంగానే ఆనందలోకం అవసరమున్నది. నిరంతరం ఒత్తిడి, బాధలు, డబ్బు సంపాదన, ఎత్తుకు పైఎత్తులు ఇవే సరిపోతున్నాయి. బంధాలు బీటలు వారుతున్న ఈ కాలంలో కనీసం కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఇక ఇతరులతో ఎలా ఆనందంగా ఉండగలము, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం సకల చెడు గుణాలను మనలో ఉంచుకొని మంచిని విస్మరిస్తున్నాము, మానవత్వాన్ని వదిలేశాము. అందుకే నేడు ఆనందలోకం కావాలి అందుకే రచయిత ఆనందలోకం అనే ప్రస్తావన తెచ్చారను కుంటాను. ఏది ఏమైనా అనేక విషయాలను చర్చించి ఒక మంచి నవలను అటు పిల్లలకి మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి ఉపయోగపడే పుస్తకాన్ని మనకు అందించిన నారంశెట్టి గారికి ధన్యవాదాలు.

Story about Anandalokam Folk novel Book

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నారంశెట్టి ఆనందలోకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: