మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు

 

 కీలక 37000 మార్క్ దిగువకు సెన్సెక్స్
 ఒక్కరోజే 624 పాయింట్లు పతనం

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ భారీగా కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ కీలక 37,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మంగళవారం ఒక్క రోజే సెన్సెక్స్ 624 పాయింట్లు నష్టపోయి 36,958 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 184 పాయింట్లను కోల్పోయి 11100 స్థాయి దిగువకు పడిపోయింది. ఆఖరికి 10,925 వద్ద ముగిసింది. ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్)లకు సర్‌చార్జీ తగ్గింపుతోపాటు ఇతర ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇవ్వనుందనే అంచనాలతో గతవారం గురు, శుక్రవారాల్లో స్టాక్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత పరిస్థితులు, విదేశీమారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా బలహీనపడటంతో సూచీలు కుప్పకూలాయి. అలాగే విదేశీ ఇన్వెస్టర్లపై విధించిన అదనపు పన్నును ఎత్తివేయవచ్చనే అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సూచీలు లాభంతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి.

అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బిఐ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఇలో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 702 పాయింట్లు (2.50 శాతం) నష్టపోయి27,729.10 వద్ద ముగిసింది. వరుసగా తొమ్మిదో నెలలోనూ కార్ల అమ్మకాలు తగ్గినట్టు గణాంకాలు వెలువడ్డాయి. దీంతో ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, నిఫ్టీ ఆటో సూచీ 4 శాతం పతనమైంది. నిఫ్టీ ఇండెక్స్ 10,901 నుంచి- 11,145 మధ్యశ్రేణిలో, అలాగే సెన్సెక్స్ 36,888 నుంచి 37,755 పాయింట్ల మధ్యశ్రేణిలో కదలాడాయి. ఐషర్‌మోటర్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. జీ, గెయిల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Stock Market loss 624 points in a day

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.