ఎయిడ్స్ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్

AIDS

 

హైదరాబాద్ : తెలంగాణలో హెచ్‌ఐవి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వెల్లడించారు. శుక్రవారం నుంచి 15 రోజుల పాటు ‘బి స్మార్ట్-గెట్ టెస్టెడ్-నో యువర్ స్టేటస్’ పేరిట స్క్రీనింగ్ కొనసాగుతుందని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, హిజ్రాలు, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు సహా హైరిస్క్ ఉన్నోళ్లందరికీ ఈ 15 రోజుల్లో టెస్టులు చేయిస్తామన్నారు. టెస్టులు చేయించుకునేలా వాళ్లను ఒప్పించేందుకు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని, మరో 50 ఎన్‌జిఒల సహాయం కూడా తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 1,32,000 మంది హెచ్‌ఐవి పేషెంట్స్ ఉన్నట్టు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంచనా వేసిందని వెల్లడించారు. అయితే, ఇందులో 82 వేల మందిని మాత్రమే గుర్తించగలిగామన్నారు. ఇంకా సుమారు 50 వేల మంది ట్రీట్మెంట్ తీసుకోకపోవడంతో, వాళ్ల ద్వారా వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదముందన్నారు. ఈ 50 వేల మందిని కూడా గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తోడ్పతుందన్నారు. అరక్షిత శృంగారం వల్ల కలిగే అనర్థాలు, హెచ్‌ఐవి ప్రమాదం, దాని వల్ల జరిగే నష్టాలపై ఈ 15 రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కండోమ్ వినియోగించేలా ప్రోత్సహించేందుకు, పబ్లిక్ ప్రదేశాల్లో కండోమ్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు కూడా ఆమె వెల్లడించారు.

Statewide screening for AIDS control

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎయిడ్స్ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.