సీతారాముల కల్యాణం చూతము రారండి!

శ్రీరామ నవమి అనగానే భద్రాద్రి రాముని కల్యాణ మహోత్సవం మదిలో మెదులుతుంది. సీతారాముని కల్యాణాన్ని చూడటానికి భక్తులు తహతహలాడుతుంటారు. వసంతకాలంలో వచ్చే శ్రీరామనవమినాడు ఒకే సమయంలో కల్యాణోత్సవం నిర్వహించడం భద్రాద్రిలో సంప్రదాయం. భద్రగిరి రాముడి పెళ్లంటే మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు, వింజామర సేవలు, పన్నీటి చిలకరింపులు, సీతారాముల ఓరచూపులు… ఇలా ఎన్నో ఎన్నొన్నో దివ్యానుభూతులు మనసుని పులకరింపజేస్తాయి. ప్రతి ఏటా కల్యాణం జరిగినా ఏ యేటికాయేడు చూడముచ్చటగానే ఉంటుంది. ఎన్నిసార్లు ఆలకించినా తనవితీరని కమ్మని కావ్యం రామాయణం. వసంత రుతువు నవ్య సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని వీరి కల్యాణమే ఆవిష్కరిస్తుంది. చలువ పందిళ్లు, తాటాకు విసనకర్రలు, చాందినీల అలంకారాలు, కర్పూర కళికల పరిమళాలు ఇవన్నీ కలిస్తేనే భద్రాద్రి రాముని కల్యాణోత్సవం.

Sri RamaNavami

లుగు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. తెలుగు నేలపై జరిగినంత వైభవంగా దేశంలో ఎక్కడా శ్రీరామ కల్యాణం జరగదంటే అది అతిశయోక్తి కాదు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పుతో బాటు బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం స్వామికి నివేదించి అందరికీ పంచుతారు. పితృవాక్య పరిపాలకుడైన రాముడు సాక్షాత్తూ విష్ణువుకి చెందిన ఏడవ అవతారంగా రూపుదాల్చాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పదహారు గుణాల సంపన్నుడు. రామునిలోని ప్రతి పార్శ్వం మానవ జీవన గమనానికి దిశా నిర్దేశం చేసేదే. లోకాభిరాముడు, సత్య వాక్పరిపాలకుడు, ఏకపత్నీవ్రతుడు, ధర్మ సంరక్షకుడయిన శ్రీరాముడు కొలువుదీరిన అపురూప క్షేత్రమే భద్రాచలం.

భద్రాచలంలో భోగరాముడు

Sri Rama navami

భద్రాచలానికి ఆ పేరు రావడానికి మూలం మేరు కుమారుడు భద్రుడు. రామభక్తుడైన భద్రుడు రా ముని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో రామలక్ష్మణులు సీతాన్వేషణలో ఉన్నారు. అలా తిరుగుతూ ‘భద్ర‘ పర్వతం మీద విశ్రమించా రు. అపుడు భద్రుడు శ్రీరాముడ్ని తనకు మోక్షమివ్వమని ప్రార్ధించగా, రాముడు అనుగ్రహించాడు. అయితే రావణ సంహానంతరం రామావతారం చా లించి విష్ణువుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది తెలుసుకున్న భద్రుడు తిరిగి రాముని కోసం తప స్సు చేశాడు. భద్రుని తపస్సుకు మెచ్చి విష్ణువుగా శంఖ చక్రాలు, రామునిగా ధనుర్భాణాలు ధరించి భద్రునికి మోక్షమిచ్చాడు. క్షేత్ర వైశిష్ట్యంలో భద్రునికి మోక్షమివ్వాలనే తపనతో భాగవతంలో పోతన చెప్పినట్లు ‘సిరికిం చెప్పడు…’ అను రీతిన కుడి చేతి లో ధరించాల్సిన చక్రం,ఎడమ చేతిలో ధరించాల్సి న శంఖువులకు బదులు కుడి చేతిలో ధనస్సు, ఎడ మ చేతిలో బాణం ధరించి భద్రునికి మోక్షమిచ్చా డు.చతుర్భుజ వైకుంఠ రామునిగా ఆవిర్భవించాడు.
ఈ పర్వత శిఖరం మీద రాముల వారి పాదాలున్నటువంటి శిలను ‘భద్ర శిరస్సు’ అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు చెప్పినట్లు ‘వామాన్ కస్తద జానకీ…’ అనడానికి నిదర్శనంగా రాముడు పద్మాసనంగా, ఎడమ తొడ మీద సీతను, పక్కనే లక్ష్మణ స్వామితో ఆవిర్భవించాడు.

Sri Rama Navami

స్వామి వారు కొంతకాలం వరకు వల్మీకంలో (పుట్ట) ఉండిపోయారట. తరువాత భద్రాచలానికి దగ్గరలో ‘బద్రిరెడ్డిపల్లె’ అనే గ్రామం లో నివసించే ‘పోకల దమ్మక్క’ అనే మహిళకు స్వామివారు స్వప్నంలో కనిపించి తాను భద్రుని కొండ మీద ఉన్నానని, తనను వెలికి తీసి ఆరాధించమని చెప్పాడట. దమ్మక్క శ్రీరాముని విగ్రహాలను వెలికి తీసి, ఒక పందిరి కింద శ్రీరాముని ఆరాధిస్తూ ఉండేది. ఇలా కొంత కాలం అయిన తరువా త కంచర్ల గోపన్న పాల్వంచ తహసిల్దారుగా (ఒకప్పుడు వరంగల్ జిల్లా పాల్వంచ తాలూకా, భద్రాచ లం గ్రామం) పన్నులు వసూలు చేయడానికి వచ్చి రామునికి ఆలయ గోపురాదులు కట్టించాలని నిర్ణయించి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. ఆలయ నిర్మాణానికి రాజ్య ధనాన్ని వినియోగించి అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా చేత చెరశాలపాలయ్యాడు. అనంతరం శ్రీరామ అనుగ్రహంతో లోకప్రసిద్ధి పొందాడు.

Sri Rama navami

శ్రీరామదాసు ఆలయ నిర్మాణాన్ని చేసి న అనంతరం, తనకు గోదావరి నదిలో శ్రీరాముడు అనుగ్రహించిన సుదర్శన చక్రాన్ని ఆలయ శిఖరంపై ప్రతిష్ట చేశాడు. ఈ సుదర్శన చక్రంలో తొ మ్మిది చక్రాలున్నాయి. పూర్వపు ఆలయాన్ని ఆంధ్ర సంప్రదాయంగా నిర్మించారు. కొంతకాలానికి తూ ము లక్ష్మీ నరసింహదాసు అనే భక్తుడు, ఆలయాన్ని సందర్శించి, శ్రీరంగంలో మాదిరిగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం లో కూడా విధి విధానాలు సశాస్త్రీయంగా జరిపించాలని తలచి దశ విధ ఉత్సవాలు ఏర్పాటు చేశా డు. ఈ క్రమంలో మేరు పర్వతానికి ప్రబోధ ఉత్స వం, స్వామి వారికి దంతాలు కడిగించడానికి దం త దావనోత్సవం, స్నానం చేయించడానికి స్నపనోత్సవం, తర్పణానికి క్రుత కర్మ ఫలోత్సవం, ఆరగింపునకు బాలా తీలా మహోత్సవం ఏర్పాటు చేశా రు. మధ్యాహ్నం పూట జగ స్వరూపోత్సవం, ప్రకాశోత్సవం, దర్బారు ఉత్సవం, మహరాజ సేవోత్స వం, ఏకాంతసేవ చేయడానికి పర్యంతోత్సవం తదితరాలను ఏర్పాటు చేశారు.
సీతారామచంద్ర స్వామి వారి పురాతన ఆలయం 1953 సంవత్సరానికి పూర్వం ఆల యం చిన్న గోపురంతో చిన్నగా ఉండేది. గోపురానికి బంగారపు రేకులు, సుదర్శన చక్రం ఉండేవి. చుట్టూ పరివార గోడలు, ప్రహరీ ఉండేవి. అయితే 1959లో వాస్తు రీత్యా ఆలయాన్ని మార్పు చేయదలచి, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి 1964కి పూర్తి చేశారు. ఎస్.ఎం.గణపతి, మందరపు చిన సూర్యానారాయణ స్తపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్వామి భోగరాముడిగా ప్రసిద్ధికెక్కాడు.

Sri Rama Navami

ఇప్పటికీ రామదాసు చేయించిన తాళి బొట్టే..

వసంత రుతువు ఆరంభంలో ఉగాది తరువాత వచ్చే తొలి పండుగ శ్రీరామనవమి. ఇంటింటా మాత్రమే కాదు ప్రసిద్ధ దేవాలయాలలో, క్షేత్రాలలో, ఊరూవాడా అనే తేడా లేకుండా అంతటా శ్రీసీతారామ కల్యాణాన్ని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి, కృతార్థులౌతారు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఏటా చైత్రశుద్ధ నవమినాడు నిర్వహించే ఈ కల్యాణోత్సవంలో ఇప్పటికీ రామదాసు చేయించిన తాళిబొట్టునే వినియోగిస్తున్నారు. కల్యాణ సమయంలో అప్పటి తానీషా ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. ఈ కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

మూర్తీభవించిన ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. మర్యాద పురుషోత్తముడైన ఆ స్వామి ఈ భూమిపై సాధారణ మానవుడిగా జన్మించిన దినమే శ్రీ రామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయాన పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని ప్రజల విశ్వాసం. అలాగే శ్రీ సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజున జరగడం విశేషం.

ఏది జన్మదినం, ఎప్పుడు కల్యాణం?

ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయాలలో అర్చా మూర్తికి ఏనాడు ప్రతిష్ట జరుగుతుందో అదే ఆ మూర్తి జన్మదినం. ఏది ఆ మూర్తి జన్మదినమో ఆనాడే వారికి కల్యాణం చేయమని శాస్త్రం చెబుతోంది. భద్రాచల క్షేత్రంలోని మూలమూర్తులు స్వయంవక్తములుగా బ్రహ్మపురాణం చెబుతోంది. భద్ర మహర్షి తపః ఫలితంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తుందే తప్ప అది ఏ కాలంలో ఏనాడు అనేది ఇదమిత్థంగా తెలియదు. ఎప్పుడు వెలిశాడో తెలియని మూర్తికి ఏనాడని ప్రతిష్టా దినాన్ని నిర్ణయిస్తాం. ఈ సమస్య భక్త రామదాసు సమయంలో నిర్ణయాత్మకమైన శాసనం వైపు దారి తీసింది. వారి ఆచార్యులయిన రఘునాథ భట్టార్ ఆచార్యుల వారి సమక్షంలో పెద్ద చర్చలు జరిగి, విష్ణుమూర్తి శ్రీరామచంద్రునిగా భద్రునికి సాక్షాత్కరించిన భగవదవతారం కనుక త్రేతాయుగంలోని శ్రీరాముని జన్మదినాన్నే భద్రాద్రి రాముడు ఆవిర్భవించిన దినంగా పరిగణించి శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణం చేయాలని శాసనం చేశారు. భద్రాచల క్షేత్రంలోనే మొదలైన విశిష్ట ఆచారమిది.

ఔషధాలే ప్రసాదాలు

మిరియాల పొడి, యాలకులు, శొంఠి, బెల్లంతో చేసే పానకం ఎండ వేడిమికి శరీరంలో ఆవిరై పోయిన నీటి శాతాన్ని తిరిగి పూరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం తీపిని తగిలించి, రుచిని పెంచుతుంది. బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని మెరుగుపరుస్తుంది. ఆస్తమా బాధను తగ్గించడానికి, తిన్న ఆహారం అరగడానికి తోడ్పడుతుంది. అలాగే రక్తాన్ని ఉరుకెత్తించి నీరసం లేకుండా చేయడానికి, శక్తి నివ్వడానికి మిరియం ఉపయోగపడుతుంది. ఇక శొంఠి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా యాంటీ ఫంగల్ గానూ, యాంటీ బాక్టీరియల్‌గా కూడా ఉపయోగపడుతుంది. యాలుకలు జీర్ణకోశాన్నిబాగా ఉంచడానికి, గుండెను మెదడును సజావుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వడపప్పులో వాడే పెసర పప్పు థైరాయిడ్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మినరల్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిలో వాడే కొబ్బరి తురుము, మామిడి, నిమ్మరసం, అరటి పండు ముక్కలు, బెల్లం అన్నీ పోషక పదార్ధాలే.

Sri Rama Navami

గోటి తలంబ్రాలు

సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలన్నీ గోటి తలంబ్రాలే. వీటిని భక్తులే స్వయంగా గోటితో వడ్లను ఒలిచి దేవస్థానానికి పంపించే సంప్రదాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో తొలుత గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమైంది. వీటికి ఉడతాభక్తి తలంబ్రాలు అని నామకరణం చేశారు. అనంతరం మేము సైతం అంటూ వేలాది మంది భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలు దేవస్థానానికి పంపిస్తుంటారు. ఈ తలంబ్రాలన్నింటినీ పసుపులో కలిపి కల్యాణ తలంబ్రాలుగా తయారు చేస్తారు.

రామాలయం ప్రాంగణంలో ఇతర ఆలయాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కుడి వైపున బయట ప్రాంగణంలో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఇదే ప్రాంగణంలో మరో పక్క భద్రమహర్షి మందిరం ఉంది. రామదాసుతో పాటు ఇంకా వివిధ దేవీదేవతల చిన్నిమందిరాలున్నాయి. ఇదే ప్రాంగణంలో మహాలక్ష్మీ ఆలయానికి సమీపంలో అద్దాల మండపం ఉంది. దీనిలో భక్త రామదాసు స్వామివార్లకు స్వయంగా చేయించిన బంగారు ఆభరణాలను చూసే భాగ్యం భక్తులకు కలుగుతుంది. అలాగే సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయానికి చుట్టుపక్కల గోవిందరాజులస్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయం, యోగానంద నరసింహస్వామి ఆలయం, శ్రీరామదాసు ధ్యానమందిరం, రంగనాయక స్వామి ఆలయం , వేణుగోపాలస్వామి ఆలయం, హరనాధ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.

Sri Rama Navami

పర్ణశాలలో శోకరాముడిగా..

దశరథుని ఆదేశం మేరకు వనవాసానికి వచ్చిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా గౌతమీ తీరంలోని అయిదు మర్రి వృక్షాలు కలిగిన ప్రాంతంలో దక్షిణంగా ప్రవహిస్తున్న గోదావరి తీరంలో పర్ణశాలను నిర్మించుకున్నాడని ప్రతీతి. అందువల్లే దీన్ని పంచవటి అంటారు. పొరెటాకులతో కుటీరం నిర్మించుకోవడం వల్ల ఇది పర్ణశాలగా ఖ్యాతిగాంచింది. ఇదే నేడు పర్ణశాల గ్రామంగా మారింది. ఇది భద్రాచలం పట్టణానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ రాముడు శోక రాముడిగా పూజలందుకుంటున్నాడు. ఆలయానికి ఈశాన్యంలో పర్ణశాల ప్రాంగణం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన పరిసరాల నడుమ అలరారుతున్న ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా శ్రీరాముని పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడే సీతమ్మవారి పాదాలు, లేడి పాదాలు కూడా కానవస్తాయి. వీటికి కొంచెం సమీపంలో పర్ణ కుటీరం దర్శనమిస్తుంది.

 

ఇక్కడే సీతమ్మవారు మూర్చిల్లిన స్థలం, రావణుడు భూమిని పెళ్ళగించిన స్థలం దర్శనమిస్తాయి. ఆయా సంఘటనలకు గుర్తుగా ఈ ప్రాంగణంలో సీతారాములు లేడిని చూడడం, పర్ణశాలలో పరిచారికలు కాపలా ఉండడం, రావణుడు జంగమ బ్రాహ్మణ వేషంలో రావడం, సీతమ్మవారు భిక్షతేవడం, రావణుడు తన నిజ స్వరూపాన్ని చూపించినపుడు సీతమ్మవారు మూర్చిల్లి పడిపోవడం లాంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు వీక్షించే విధంగా ఇక్కడ అందమైన

శిల్పాల రూపంలో పొందుపరిచారు. పర్ణ కుటీరాని కి సమీపంలో ఆధునికంగా మరో కుటీరాన్ని ఏర్పాటు చేశారు. పర్ణశాల మాదిరిగానే ఇక్కడ కూడా వివిధ మూర్తులను ఏర్పాటు చేశారు.  పర్ణ కుటీరానికి సమీపంలో రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ రామలింగేశ్వరస్వామి వారిని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి.

ఇక్కడకు సమీపంలోనే సీతవాగు ఉం ది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ సీత వాగును లక్ష్మణుడు తన బాణంతో సృష్టించి సీతమ్మవారి దాహం తీర్చాడని చెబుతారు. ఆ నీరే సెలయేరై ప్రవహిస్తూ, గోదావరి నదిలో కలిసి సీత వాగుగా పేరుతెచ్చుకుంది. ఆ కొండయే లక్ష్మణ గుట్టగా ఖ్యాతిగాంచింది. సీతాదేవి ఆ సెలయేటిలో స్నానాదికాలు చేసి నారచీరలు ఆరవేసుకున్న గుర్తులు నేటికీ ఇక్కడ భక్తులకు అస్పష్టంగా దర్శనమిస్తాయి. శ్రీ రాముని ఉత్తరీయం, అమ్మవారు ఆడుకున్న వామనగుంటలు, రాముడు కూర్చున్న శిలా సింహాసనం ఇప్పటికీ దర్శనమిస్తాయి. సీతవాగులో లభించే కుంకుమ రాళ్ళు , పసుపు రాళ్ళనే సీతమ్మవారు పసుపుకుంకుమలుగా ఉపయోగించుకున్నారని చెబుతారు. పర్ణశాలకు పడమట దిక్కున రథచరగుట్ట దర్శనమిస్తుంది. రావణుడు సీతమ్మవారిని అపహరించడానికి రథంపై వచ్చి ఈ కొండమీదే రథాన్ని ఉంచినట్లు కథనం.

దుమ్ముగూడెంలో ఆత్మారాముడిగా..

Seetharamula Kalyanam

భద్రాచలం, పర్ణశాల మార్గంలో ఉన్న మరో పవిత్ర క్షేత్రమే దుమ్ముగూడెం. రావణుడు సీతమ్మవారిని అపహరించుకుపోయే సమయంలో జటాయువు అనే పక్షిరాజం రావణుడ్ని ఎదుర్కొందట. ఆ సంఘటనలో విపరీతంగా దుమ్మురేగడం వల్ల ఈ ప్రాంతానికి దుమ్ముగూడెం అని పేరొచ్చిందంటారు. అలాగే, ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది గనుక ఈ గ్రామానికి దుమ్ముగూడెం అనే పేరొచ్చిందని మరో పురాణ గాథ. దుమ్ముగూడెంలో ఉన్న ప్రాచీన రామచంద్ర స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీరాముడు ఆత్మారాముడిగా ప్రసిద్ధికెక్కాడు.

జటాయువు ప్రాణాలిచ్చిన క్షేత్రం ఏటపాక

sri Rama navami

భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాచీన క్షే త్రం ఏటపాక. సీతాపహరణం స మయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఏటపాక గ్రామంలోనే జటాయువు కాలును రావణుడు నరికాడని చెబుతారు. జటాయువు కాలు శిలా రూపంలో ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ క్షేత్రం ఇప్పటికీ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

శ్రీరామగిరిలో సుందరరాముడిగా..

శ్రీరాముడు పక్షిరాజుకు పిండ ప్రదానాలు చేసిన క్షేత్రం శ్రీరామగిరి. ఇది భద్రాచలానికి 80 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. దట్టమైన అడవిలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామం ఓ గిరిజన గ్రామంగా విరాజిల్లుతోంది. ఓ పక్క గోదావరి, మరో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్ర సౌందర్యాన్ని మరింత పెంచాయి. సీతారామచంద్రస్వామి వార్ల ఆలయం కొండ మీద ఉంటుంది. సాక్షాత్తు మాతంగి మహర్షి ఇక్కడస్వామి వార్లను ప్రతిష్టించి, సుందర రాముడిగా పేరు పెట్టారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే రామలక్ష్మణులు తపస్సు చేసిన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ రాముడిని యోగరాముడని కూడా అంటారు. ఇక్కడకు సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలోనే శ్రీరాముడు జటాయువుకు పిండ ప్రదానాలు చేశాడని చెబుతారు.

శబరి, గోదావరిల సంగమ క్షేత్రం కూనవరం

రాముడి అచంచల భక్తురాలయిన భక్త శబరి, ఆ స్వామి అనుగ్రహంతో నదిగా రూపుదాల్చింది. ఆ శబరి నది కూనవరం ప్రాంతంలో స్పష్టంగా దర్శించవచ్చు. అలాగే శబరి నది గోదావరిలో సంగమించే ప్రాంతం కూడా ఇదే.
భక్త శబరి రాముని వర ప్రభావంతో నదిగా మారిందని చెబుతారు. ఆ కారణంగా ఈ గ్రామానికి వరరామచంద్ర పురమని పేరొచ్చిందంటారు.

రేఖపల్లి

రావణుడికి, జటాయువుకు జరిగిన పోరులో రావణుడు జటాయువుకు చెందిన రెక్కలను ఖండించాడట. వాటిలో ఒక రెక్క ఈ క్షేత్రంలో పడడం వల్ల ఈ గ్రామానికి రేఖపల్లి అని పేరొచ్చింది. పూర్వం దీనిని రెక్కపల్లి అని పిలిచేవారు. కాలాంతరంలో అదే రేఖపల్లిగా రూపాంతరం చెందింది. ఇది భద్రాచలానికి 55 కి.మీ. దూరంలో, వరరామచంద్రపురం గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది.

జీడిగుప్ప

ఈ గ్రామం రేఖపల్లి గ్రామానికి సుమారు 15 కిలో మీటర్ల్ల దూరంలో ఉంది. ఇక్కడ రాముడు ప్రతిష్టించినదిగా చెప్పబడుతున్న స్వయంభువు మహాదేవలింగమొకటి ఉంది. ఆ కారణంగా ఈ స్వామిని రామలింగేశ్వరస్వామిగా కొలుస్తున్నారు. పునాదులు కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ లింగం దొరికిందట. దాంతో స్వామి బాలానంద శిష్యుడు, అప్పటి గ్రామ పటేలుగా ఉన్న చల్లా సుందరరామానంద, తన కుటుంబ సభ్యులు, ఇతర భక్తుల సహకారంతో ఇక్కడ కొండ మీద స్వామిని ప్రతిష్టించారు. అనంతరం భక్తులు స్వామికి చిన్న ఆలయాన్ని నిర్మించారు. సాక్షాత్తు మహాదేవుడు ఓ వృద్ధుడి రూపంలో ఇక్కడ సంచరిస్తాడని ప్రతీతి.

మనోహర దృశ్య కావ్యాలు పాపికొండలు

ఇవి భద్రాచలానికి సుమారు 100 కిలోమీటర్లు దూరంలో, జీడిగుప్ప గ్రామానికి సుమారు 35 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దున ఉన్నాయి. గోదావరి నదికి అటూఇటూ ఉన్న ఈ కొండల అందాలు వర్ణనాతీతం. టూరిస్టు స్పాట్ గా ప్రసిద్ధి చెందిన ఈ పాపికొండలను చేరుకోవడానికి నేరుగా బస్సు సౌకర్యంగాని, రైలు సౌకర్యం గాని లేదు. అయితే భద్రాచలం వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో వర రామచంద్రపురం మీదుగా అటవీ మార్గం ద్వారా ములకపల్లి మీదుగా ఇప్పూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ గోదావరి తీరంలో ఉన్న లాంచీలలోగాని, మర పడవలలో గాని ప్రయాణించి పాపికొండలు చేరుకోవచ్చు. ఇప్పూరు నుంచి పాపికొండలకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది. పాపికొండలలో ఉన్న మహత్తర క్షేత్రం ఇక్కడున్న పేరంటాళ్ళపల్లి. స్వామి బాలానంద ఆశ్రమం ఇక్కడుంది. ఈ ఆశ్రమమంతా గిరిజన మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తూ, అసలు సిసలైన ఆశ్రమాలకు ప్రతీకగా నిలిచింది. అలాగే భద్రాచలం నుంచి కూనవరం వరకు వచ్చి అక్కడ నుంచి నేరుగా లాంచీలో కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

రామనామం అత్యంత పవిత్రమైనది. అన్ని నామాలలో కెల్లా ఉత్కృష్టమైనది. కోటి రెట్ల ఫలితాలనిచ్చేది. అందువల్ల స్వామి వారి కల్యాణోత్సవ సమయంలో రామనామం జపిస్తే ఏడేడు జన్మల పాపాలు సైతం పోయి, రామానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ జగదభిరాముడు సదా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక.. సర్వేజనా సుఖినో భవంతు..

శాంభవి. ఏ

 

 

 

The post సీతారాముల కల్యాణం చూతము రారండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.