సాహిత్య వారధి ప్రతిలిపి

  ప్రపంచ వేదికపై ఎన్ని కళలు ఉన్నా, సమాజ గతిని అనునిత్యం ప్రతిబింబిస్తూ, తన అస్తిత్వంతో ప్రభావానికి గురి చేసే సుసంపన్న జ్ఞానం ఒక్క సాహిత్యానికే సొంతం. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి గొంతుకగా, మరెన్నో సంస్కరణలకు బాసటగా నిలిచి అనాదిగా ప్రజా పక్షపాతిగా వర్ధిల్లింది. ఒక ప్రాంతపు సామజిక సాంస్కృతిక సాంప్రదాయాలను, ఆర్థిక రాజకీయ కోణాలను ఆ కాలపు సాహిత్యం ప్రతిబింబిస్తుంది. కాలాన్ని బట్టి, తత్వాన్ని బట్టి ఎప్పటికప్పుడు తన సరళులను మార్చుకుంటూ, నూతన ప్రక్రియలను ధరిస్తూ […] The post సాహిత్య వారధి ప్రతిలిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రపంచ వేదికపై ఎన్ని కళలు ఉన్నా, సమాజ గతిని అనునిత్యం ప్రతిబింబిస్తూ, తన అస్తిత్వంతో ప్రభావానికి గురి చేసే సుసంపన్న జ్ఞానం ఒక్క సాహిత్యానికే సొంతం. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి గొంతుకగా, మరెన్నో సంస్కరణలకు బాసటగా నిలిచి అనాదిగా ప్రజా పక్షపాతిగా వర్ధిల్లింది. ఒక ప్రాంతపు సామజిక సాంస్కృతిక సాంప్రదాయాలను, ఆర్థిక రాజకీయ కోణాలను ఆ కాలపు సాహిత్యం ప్రతిబింబిస్తుంది. కాలాన్ని బట్టి, తత్వాన్ని బట్టి ఎప్పటికప్పుడు తన సరళులను మార్చుకుంటూ, నూతన ప్రక్రియలను ధరిస్తూ ఆధునిక ధోరణిలో ముందుకు సాగుతుంది. పద్యం, గద్యం, వచనం సరళి ఏదైనా సామాజిక శ్రేయస్సే లక్ష్యం. అందుకే సాహిత్యం సమాజ హితం. ఎప్పుడో స్వాతంత్య్రం రాక మునుపు రాసిన మహాప్రస్థాన గీతాలు, ఇరవై ఒకటవ శతాబ్దపు యువకుల నర నరాల్లోనూ ప్రవహించి, వారిని రచనా వ్యాసంగంలోకి అడుగు పెట్టించడమే కాదు, అభ్యుదయ భావాలతో రచనలు చేయడానికి కారణమవుతున్నాయంటే, కాలాలు గడిచినా, శతాబ్దాలు అంతర్దానమైనా సాహిత్య ప్రభావం వర్తమానపు సమాజంపై ఉంటుందనేది నిర్వివాదాంశము. అందుకే సాహిత్యం వ్యక్తిగత సంపద కాదు, సమాజ సంపద.

ఒక సాహితీ వేత్త ఒక కథో, కవితో, నవలో రాసి నాలుగు గోడల మధ్య పరిమితం చేస్తే, కాలంతో పాటే అది శిథిలావస్థలో కూరుకుపోతుంది. అదే ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపొతే, ఓ మంచి మార్పుకి కారణభూతమవుతుంది. చైతన్యాన్ని ప్రోద్గొలిపే ఆశాకిరణం అవుతుంది. అప్పుడే ఆ రచనకు ఒక సార్థకత ఏర్పడుతుంది. అందుకే సాహిత్య రచనలు అగ్గిపెట్టలో దాగున్న నిప్పు లేని అగ్గి పుల్లల్లా అజ్ఞాతంలో కాలం వెళ్లదీయకూడదు. తానూ మండి ఈ ప్రపంచానికి వెలుగునివ్వాలి. జ్ఞాన జ్యోతిని, చైతన్య ఆర్తిని ప్రేరేపించాలి. అందుకే రచనలు విశ్వవ్యాప్తం కావాలి, నడి వీధుల్లో స్వేచ్ఛగా పచార్లు చేయాలి, ఇంటింటి తలుపు తట్టాలి. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలి. నవీన నాగరికతలో భాగంగా ఓ సరికొత్త ప్రపంచానికి వేదిక అవుతున్న సాంకేతికత, ఇప్పుడు సాహిత్యానికి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం వార్తా పత్రికలు, పుస్తకాల ద్వారా మాత్రమే సాహిత్యం అందుబాటులో ఉండేది. కాబట్టి నచ్చిన రచయితల రచనలు చదవాలంటే ఎన్నో పరిమితులు.

సామాజిక మాధ్యమాల వాడకం విస్తృతం అవడం ద్వారా వాట్సాప్, ఫేస్ బుక్ లలో సమూహాలుగా ఏర్పడి కవులు, రచయితలూ తమ తమ రచనలను కూర్చున్న చోటి నుండే ప్రపంచంతో పంచుకునే వెసులుబాటు వచ్చింది. ఓ పక్క పరాయి భాష అవసరం, మోజు వల్ల మాతృ భాషలు మనుగడ క్రమేణా కోల్పోతూ, ప్రాంతీయ సాహిత్యం ప్రభావాన్ని కోల్పోతున్న సమయంలో, సామాజిక మాధ్యమాలు తిరిగి ఊపిరులూదుతున్నాయనే చెప్పవచ్చు. అదేమీ అతిశయోక్తి కాదు. పుస్తకాల రూపంలో, పత్రికల రూపంలో విస్తృత వ్యాప్తికి పరిమితులు ఉన్నట్లు గానే, సామజిక మాధ్యమాలకీ కొన్ని పరిమితులున్నాయి. ఆ లోటుపాట్లను కప్పిపుచ్చుతూ, సాహిత్యాన్ని మరింత ఎక్కువ మందికి సులభంగా అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో, భావి తరాలకు జ్ఞాన సంపదను అందించాలనే భవిష్యత్ దృక్కోణంతో, ఇటు రచయితలకి తమ తమ రచనలను శాశ్వతంగా భద్రపరుచుకునే హక్కును ఉచితంగా కల్పించడంతో పాటుగా, పాఠకులకు రచయితలకు మధ్య అనుసంధానాన్ని కల్పిస్తూ, సాహిత్య విస్తరణను ఆకాంక్షిస్తూ ఓ సరికొత్త వేదిక అన్ని హంగులతో ఆవిర్భవించింది.

అదే ప్రతిలిపి.ప్రతిలిపి ఒక స్వీయ ప్రచురణ వేదిక. ప్రస్తుతం ఎనిమిది భాషల్లో సేవలందిస్తుంది. హిందీ, గుజరాతీ భాషలతో మొదట ప్రారంభమై తెలుగు, బెంగాలీ, మరాఠీ , తమిళం, కన్నడ భాషలకు తన సేవలను విస్తరించి, మరిన్ని ఇతర భాషలకు ఈ సౌలభ్యాన్ని అందించడానికి అడుగులు వేస్తుంది. బహు భాషా కోవిదులకి ప్రతిలిపి మరింత ఉపయుక్తకరంగా ఉంటుంది. ప్లే స్టోర్ నుండి దీనిని ఉచితంగా పొందవచ్చు. www.pratilipi.com అను website ద్వారా కూడా ప్రతిలిపిని వినియోగించుకోవచ్చు. ప్రతిలిపిని ప్రారంభించగానే తెరపై ఎనిమిది భాషలు కనిపిస్తాయి, అందులో ఏదేని ఒక భాషని పాఠకుడు లేదా రచయిత ఎంచుకోవచ్చు.అవసరమనుకున్నప్పుడు భాషను మార్చుకునే వెసులుబాటూ ఉంది. రచయిత తమ రచనలను ప్రచురించుకోవాలన్నా, ఇతర రచయితల రచనలను సమీక్షించాలన్నా ముందుగా తమకంటూ ఓ సభ్యత్వాన్ని ఇమెయిల్ అకౌంట్ ద్వారా సృష్టించుకోవాలి. ఈ ప్రక్రియ సులభం. అంతగా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వారు కూడా సులువుగా ఉపయోగించుకునే రీతిలో ప్రతిలిపి నిర్మాణం ఉంది.

రచయితలు తమ రచనలను ప్రచురించుకోవడానికి, పాఠకులు తమకు నచ్చిన ప్రక్రియలను చదవడానికి వివిధ విభాగాలు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. కవితలు, కథలు, నవలలు, ప్రేమ, హర్రర్, సస్పెన్సు, ధారా వాహికలు, మినీ కథలు, జీవితం, సామాజికం, హాస్యం, సంస్కృతి, ఆధ్యాత్మికం, బాల సాహిత్యం, బాల వనం, లేఖా సాహిత్యం వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. రచయిత ఆయా రచన ఏ విభాగానికి సంబంధించినదో ఆ విభాగంలో రచనను పొందుపరుచుకోవచ్చు. ఇలా వివిధ ప్రక్రియలకు విభిన్న విభాగాలు ఉండడం వలన ఇటు రచయితలకు, అటు పాఠకులకు తమకి కావలసిన ప్రక్రియను ఎంచుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. ప్రచురించబడిన రచనను ఎంత మంది పాఠకులు చదివారో తెలుసుకునే సదుపాయాన్ని ప్రతిలిపి కల్పించింది. అలాగే ఆయా రచనలను స్టార్స్ రూపంలో పాఠకులు రేటింగ్ ఇచ్చే సదుపాయమూ ఉంది. తద్వారా రచయితలు తమ రచనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని మెరుగులు దిద్దుకునే సౌలభ్యం ఏర్పడుతుంది.

అలాగే పాఠకులు ఆయా రచయితలతో సంభాషించే అవకాశం, ప్రచురణను సమీక్షించే అవకాశమూ ప్రతిలిపి కల్పించింది. ఇది రచయిత, పాఠకుల మధ్య అనుసంధాన కర్తగా ఉపయోగపడుతుంది. ఇందలి రచనలు శాశ్వతంగా పొందుపరచబడతాయి, రచయితకు తమ రచనలను పొందుపరుచుకునే డేటాబేస్ లా ప్రతిలిపి ఉపయోగపడుతుంది. ఆయా రచనలను రచయిత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సవరించుకునే అవకాశం, తొలగించుకునే అవకాశం ఉంది. ఒకే చోట రచనలు ఉంటాయి కాబట్టి నచ్చిన వారి రచనలను పాఠకులు నచ్చిన విధాన క్రమంలో చదువుకోవచ్చు. రాసిన ప్రతీ రచనను పుస్తక రూపంలో ప్రచురించుకోవడం అసాధ్యమే. ఆయా రచనలు అన్నింటినీ ఇక్కడ ఉచితంగా ప్రచురించుకుని ఆ భావాలను ప్రపంచం ముందు ఆవిష్కరించే అవకాశం రచయితకు కలుగుతుంది. ఒక రకంగా ప్రతిలిపి అంతర్జాల గ్రంధాలయం. ఇందలి రచనలను డౌన్లోడ్ చేసుకుని, ఆఫ్ లైన్ లోను చదువుకునే వెసులుబాటు ఉంది. ఈ ఆప్ నుండే నచ్చిన రచనలను సామజిక మాధ్యమాలతో, అక్కడ పొందుపరిచిన షేర్ ఆప్షన్ ద్వారా పంచుకోవచ్చు. గ్రాంఫోన్ సదుపాయాన్నీ ప్రతిలిపి అందిస్తుంది. కవితలు, కథలు చదివి పాఠకుడు అనుభూతిని పొందడము సహజమే. వాటిని ఆయా రచయితల స్వరాల్లో వినడం ద్వారా ఓ కొత్త అనుభూతికి పాఠకుడు లోనవుతాడు. మంచి స్వరంతో భావాన్ని వ్యక్తీకరించే నైపుణ్యమున్న వారికి ఇది అత్యంత ఉపయోగకరం.

ప్రతిలిపి బ్లాగ్ అండ్ ఎడిటోరియల్ సెక్షన్ అనే విభాగం ద్వారా వివిధ వ్యాసాలు, అనువాద నవలలు ఇందులో పొందుపరచబడతాయి. ఈ రోజుల్లో గుర్తింపు పొందిన రచయిల అనుభవాలను తెలుసుకుని, తమను తాము మెరుగుదిద్దుకోవాలని తపించిపోయే రచయితలెందరో. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు. ప్రతిలిపి ద్వారా ఆ కొరతనీ తీర్చుకోవచ్చు. అనుభవమున్న సాహితీ వేత్తల అనుభవాలు, వారి సాహిత్య ప్రస్థానం, నవ తరానికి వారందించే మెళుకువలు మొదలైన అంశాలతో సాగిన ఆ ఇంటర్వ్యూలు ఇందులో నిక్షిప్తం చేస్తుంది ప్రతిలిపి. అవి ప్రతీ ఒక్కరికీ ఉపయుక్తకరంగా ఉంటాయి. సాహితీ కార్యక్రమాలు అను మరో విభాగం పారదర్శకతను అందిస్తూ, ఇప్పటి వరకు ప్రతిలిపి నిర్వహించిన కార్యక్రమాల వివరాలను, భవిష్యత్తులో నిర్వహించబోయే సాహితీ సేవలను పాఠకుల ముందు ఉంచుతుంది.

తద్వారా మునుముందు ప్రతిలిపి నిర్వహించబోయే కార్యక్రమాల్లో భాగస్వాములు అవొచ్చు. అలానే ప్రతిలిపిని ఎలా వాడాలో చెప్పే సమాచారం ఇందులో నిక్షిప్తం అయి ఉంది. ఇతర సందేహాలకు సమాధానాలు ఈ విభాగంలో పొందుపరచబడ్డాయి.ప్రతిలిపి తరచుగా సాహిత్య పోటీలను నిర్వహిస్తూ రచయితలను ప్రోత్సహిస్తుంది. పోటీలలో కవిని పరిమితుల సంకెళ్లతో బంధించకుండా పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. స్వీయ ప్రచురణల ద్వారా కథలను,వ్యాసాలను ప్రచురించిన వారికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలను అందిస్తూ రచయితల్లో నూతనుత్తేజాన్ని నింపుతుంది. ప్రతీ రచనను ప్రచురించడమే కాక, పలు రచనలను ఫేస్ బుక్ లో ప్రమోట్ చేసి వేల పాఠకుల దగ్గరికి ఆయా రచనలను చేరుస్తుంది.

తెలుగు భాష వాడకం క్రమంగా తగ్గుతున్న నేటి పరిస్థితుల్లో, పరాయి ఒడిలో పెరుగుతున్న బాల్యానికి అమ్మ భాషని అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది భాషని ప్రేమించే సాహిత్య కారులకు, రచయితలకే సాధ్యం. మారుతున్న కాలాలకు అనుగుణంగా సాహిత్యాన్ని డిజిటలీకరించాలి. అది ప్రతిలిపి వంటి ఇ లైబ్రరీలకే సాధ్యం. ఇప్పటికే వేల మంది రచయితలు తమ తమ రచనలను ప్రతిలిపిలో భద్ర పరచుకోవడమే కాక, మంచి సంఖ్యలో పాఠకులను పొందుతూ, వారి అమూల్యమైన అభిప్రాయాలను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం ప్రతిలిపిని వాడే పాఠకుల సంఖ్య ఒక లక్ష కు చేరడం గమనిస్తే, సాహిత్యాన్ని డిజిటలీకరిస్తున్న ప్రతిలిపికి రచయితల, పాఠకుల నుండి వస్తున్న ఆదరణ అవగతమవుతుంది. ప్రతిలిపిలో తమ ప్రచురితం అయిన రచనలు దీర్ఘ కాలం పాటు పాఠకుడి ఆదరణ పొందుతూనే ఉంటాయి. తద్వారా రచనలు ఎక్కువ మంది పాఠకులు చదివే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వయంగా రచనలు చేయని సాహిత్య ప్రేమికులు, సాహిత్యానికి చేరువ కావడానికి ప్రతిలిపి వైపు అడుగులు వేస్తుండడము ఆహ్వానించదగిన పరిణామం.

ఏ రచయిత అయినా కోరుకునేది తమ రచనలు ఎక్కువ మందికి చేరాలనే. ఆ కోరికను ప్రతిలిపి ద్వారా సులభంగా అంది పుచ్చుకోవచ్చు. కాలక్రమంలో తనను తాను సంస్కరించుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ రచయితలకు, పాఠకులకు తగిన సౌకర్యాలను అందిస్తున్న ప్రతిలిపి, భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావడానికి అడుగులు వేస్తుంది. ఆ అడుగులు రచయితలకు పాఠకులకు హితోధికంగా ఉపయోగపడగలవు. ప్రతిలిపి తెలుగు బాషా విభాగ అధినేత తక్కెడశిల జానీ భాషా చరణ్ , తెలుగు సాహిత్యంలో ప్రతిలిపి ముఖ్య భూమికను పోషించే విధంగా క్రియాశీల చర్యలు చేపడుతుండడం అభినందించదగిన విషయం. వివిధ ప్రాంతీయ భాషల ఉనికిని, సాహిత్యాన్ని భుజానికెత్తుకున్న ఇటువంటి సంస్థల ఉనికి, క్రియాశీలత ఇటు రచయితలకు, పాఠకులకు, అటు సాహి త్య సంస్కృతికి, భావి తరానికి, ప్రాంతీయ భాషాభివృద్ధికి హితోదికంగా దోహదం చేస్తుంది.

Speecial story about Sociocultural traditions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సాహిత్య వారధి ప్రతిలిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: