గురు వందనం

Guru Purnima

 

గురుపూర్ణిమ సందర్భంగా, నాతో ఓనమాలు దిద్దించి బతుకుకు బంగారుబాటలు వేయడానికి ఆద్యుడైన నా మొట్టమొదటి గురువును స్మరించుకోవటం నా బాధ్యత. అప్పుడు నాకు అయిదు లేదా ఆరేళ్లుంటాయి. మా అన్నయ్య నాకంటే మూడేళ్లు పెద్దవాడు. అందరు పిల్లలలాగే మేమిద్దరం ఆటపాటలతో, పరస్పరం గిల్లికజ్జాల తో ఒకరిపై మరొకరం “శికాయత్‌”లు చేసుకోవటంతో కాలం గడిచిపోయేది. అటు మా అమ్మమ్మవేపు నుండి ఇటు మా నాన్నవేపునుండి, మా అన్నయ్యే మొదటి సంతానం. గారాబం ఎ క్కువ. దీనికి తోడు మా నాన్నమ్మ మా అన్నయ్యకు వాళ్లాయన అంటే మా తాతపేరు పెట్టుకుంది. ప ల్లెత్తు మాట, చిన్నదెబ్బ పడనిచ్చేది కాదు.

మమ్మల్ని బడిలో వేయాల్సిన సమయం వచ్చింది. అ ప్పటికే మా అన్నయ్య ఒకటి రెండు ‘ఖానిగి’ బళ్లలో మా పిన్ని వెంట వెళ్లి వచ్చిన అనుభవం ఆయనకు ఉం ది. మా అన్నయ్య ఆ బళ్ల గురించి చెప్పే తీరును బట్టి బడికి వెళ్లటం అంటే భయంగా ఉండేది. దానికి తోడు, ఖానిగి బళ్ల పంతుళ్లు కొంచెం సీనియర్ విద్యార్థులను పంపించి పిల్లలను ‘గొర గొర’ లాక్కుపోయేవారు. పిల్ల ల ఏడుపులతో వాళ్లని బడికి పంపుతున్నారని వాడకంతటికీ తెలిసిపోయేది.

ఇవన్నీ చూసాక మా అన్నయ్యకు ‘బడి జ్వరం’ పట్టుకునేది. ససేమిరా వెళ్లననేవాడు. మొండికేసేవాడు. మా నానమ్మ వెనక నక్కేవాడు.ఆ రోజుల్లో 54వ తరగతి వరకు ఖానిగి బడిలో వి ద్యాభ్యాసం కానిచ్చి, ఆ తర్వాత సర్కార్ బళ్లకు పంపేవారు. ఇట్లా బలవంతాన లాక్కెళ్లటం, కూర్చోబెట్టుకోవ టం, సర్కార్ బళ్లవాళ్లు చేసేవారు కాదు. అందుకని ఓం ప్రథమం ఖానిగి బడి తప్పనిసరి. ఓ రోజు ఎప్పటిలా మా ఆటపాటల్లో మేం ఇద్దరం ‘బిజీ’గా ఉన్నాం. ఓ ఆగంతకుడు మా ఇంట్లోకి వచ్చి మమ్మలిద్దరినీ పలకరించాడు. “ రేపు మీ ఇద్దరూ ఇంటికి రావాలి” అన్నాడు. “ ఎందుకు?” అడిగాడు మా అన్నయ్య ధైర్యం చేసి.

చెయ్యెత్తు మనిషి. గుచ్చుకునే చూపు, ముఖం మీద స్ఫోటకం మచ్చలు, కంచుగంటలా గొంతు, నాకు కొం చెం భయం వేసింది. మా అన్నయ్య వెనక్కే దాక్కుని ఆయన్నే పరీక్షగా చూస్తున్నాను. “మా ఇంట్లో పుట్టెంటుకలు” ఆగంతకుడి జవాబు. కొంచెం బెరుకు పోయింది నాకు. “ఎవరివి”? అని అడిగాను. “ నావే!” అన్నాడు నర్మగర్భంగా నవ్వుతూ. ఈ నాడైతే తెలిసేది. కాని ఆనాడు ఆ నవ్వు వెనక అర్థం శోధించేంత ‘ పరిణితి’ లేదు. “ ఇంత పెద్ద పెరిగాకనా?” ప్రోబింగ్ ప్రశ్న ఒకటి వేసి జవాబు రాబట్టుకునే ప్రయత్నం చేసాను. “ మా అమ్మానాన్నలు, నా చిన్నతనంలో మరిచిపోయారట. అందుకని” అని ‘మీరు తప్పక రావాలి’ అంటూ వెళ్లిపోయాడాయన.

మా పెద్దమ్మా, అమ్మా నర్మగర్భంగా నవ్వుతోంటే, ఆ నవ్వు వెనక అర్థం ఆనాడు తెలియలేదు. మర్నాడు తలంటు కానిచ్చి, కొత్త షర్టు నిక్కరు వేసుకు ని మొఖాన ‘వెలగ’ బొట్టు పెట్టుకుని తయారయ్యాం. కొత్తబట్టలుంటే ఎవరికి సరదా ఉండదు? నేనూ అన్న య్యా ‘ ఆగంతకుడి వెనుక ఠీవిగా నడుస్తూ వెళ్లాం. ఆయన ఇల్లు కం బడి, రాజరాజేశ్వరుడి గుడి దగ్గర శనిగరం నర్సయ్యగారి సందులో ఉంది. మేము ఆ యన ఇల్లు సమీపిస్తున్న కొద్దీ పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి. “ఒక్కొక్కర ఒక్కటి ఒకట్రెండ్రెండు!,

అమ్మ, ఆవు, ఇటుక, ఈగ, ఆదివారం నాడు అరటి మొలిచింది” అంటూ వినబడుతున్నాయి పిల్లల గొంతులు. బడి గడప ముందు మా అమ్మ వేపు తాత కనిపించాడు. ఆయన చేతిలో కొత్త పలకలు, పొడవు బలపాలున్నాయి. మా జేబుల్లో పుట్నాలు, పేలాలు నింపి మావేపే జాలి చూపు చూస్తూ, బలవంతాన వెళ్లిపోయాడు.

మొదటిసారి కాబట్టి నాకేమి అర్థం కాలేదు. అనుభవం ఉన్న మా అన్నయ్యకు తెలిసింది. మేం వచ్చింది ‘పుట్టెంటుకల’ సంబరానికి కాదని; బడికి ‘ తోలుకు’ రాబడ్డామని. కాసేపు నేను, మా అన్నయ్య, మరి కాసే పు ఇద్దరం ఏడ్పుల ‘ జుగల్ బందీ’ చేసాం. పంతులు గారు తన నిజస్వరూపం చూపించి, చింత బరిగతో ఝాడిస్తూ ( కొట్టలేదు) గద్దించి, బెదిరించి, ఏడుపులు ఆపించి, మాతాత ఇచ్చిన పలక మీద “ ఓం నమః” రాసి దిద్దమన్నాడు.

ఆనాడు ఆయన దిద్దించిన ఓనమాలే, తర్వాతి కాలంలో వెలుగై విస్తరించి, ఈనాడు నన్నింత ఉన్నత స్థితికి తెచ్చాయి. గురుపూర్ణిమ సందర్భంగా వారిని తలుచుకుంటూ వారికి వేయి వందనాలు మనః పూర్వకంగా సమర్పించుకుంటున్నాను. ‘నూరు అబద్ధాలు ఆడి అయినా, ఓ పెళ్లిచేయమన్న’ సామెతను తిరగ రాసి ‘ ఓ అబద్ధం ఆడి అయినా అక్షరాభ్యాసం చేయించాల’ ని చెప్పాలనిపిస్తోంది నాకు.

                                                                                               – కూర చిదంబరం

Special story on the occasion of Guru Purnima

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గురు వందనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.