శ్రావణ శోభ

Sravana Masam

 

కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతోనో, కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములు వ్రతాలతో నెలంతా శ్రావణం సందడి చేయనుంది. తొలిరోజే అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, రాఖీపౌర్ణిమ తదితర ప్రధాన పండుగలకు నెలవీ శ్రావణం. ఈ మాసం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతన, శుభకార్యాలు నిర్వహిస్తే పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని వేదపండితులు అంటున్నారు. బలరామకృష్ణ్లుల జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి వంటివి భక్తిభావాలను మరింత పెంచనున్నాయి.

హరిహరబేధం లేని మాసం: అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు చేస్తే పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది.

శ్రావణ శుక్రవారాలు.. శుభకరాలు : శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. హిందువుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలూ, నోములతో… ప్రతి ముత్తయిదువా హడావుడి పడిపోతుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే…

1. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం… వంటివాటిని చిహ్నం. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలతా సిద్ధిస్తాయి.

2. శ్రీమహా విష్ణువు నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో… ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం.

3. సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉందికదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే… అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల ఎరుకనీ… వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతనీ ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు.

4. శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి, ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి…. ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునే వారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొంటారు. ఈ వ్రతవిధానాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

5. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో, ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుందేమో!

6. ఈ మాసంలో పసుపు రాసుకోవడం; పెసరపప్పుని తినడం; పూలు, పత్రితో పూజించడం; పండ్లను, శనగలను పంచిపెట్టడం… వంటి ఆచారాలన్నీ వర్ష రుతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే!

7. పూజలు, వ్రతాలు, పేరంటారు, వాయనాలు… వీటన్నింటి వల్లా సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రావణ శోభ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.