సుష్మా స్వరాజ్

భారతీయ జనతా పార్టీ నిర్వచించి నమ్మే హైందవ భారతీయతకు నిలువెత్తు నిదర్శనం, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో దేశ రాజకీయాలు ఒక అరుదైన నేతను కోల్పోయాయి. అనర్గళంగా మాట్లాడగలిగిన పార్లమెంటేరియన్ శాశ్వతంగా కనుమరుగయ్యారు. సోనియా గాంధీని ప్రధానిని చేస్తే శిరో ముండనం చేసుకుంటానని శపథం చేయడం, భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కోరడం ఆమెకే చెల్లింది. హిందూత్వ బ్రాండ్ రాజకీయాలను ఆ విధంగా అనితరంగా ఆమె రక్తి కట్టించారు. హర్యానా బిడ్డగా 25 సంవత్సరాల […] The post సుష్మా స్వరాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారతీయ జనతా పార్టీ నిర్వచించి నమ్మే హైందవ భారతీయతకు నిలువెత్తు నిదర్శనం, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో దేశ రాజకీయాలు ఒక అరుదైన నేతను కోల్పోయాయి. అనర్గళంగా మాట్లాడగలిగిన పార్లమెంటేరియన్ శాశ్వతంగా కనుమరుగయ్యారు. సోనియా గాంధీని ప్రధానిని చేస్తే శిరో ముండనం చేసుకుంటానని శపథం చేయడం, భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కోరడం ఆమెకే చెల్లింది. హిందూత్వ బ్రాండ్ రాజకీయాలను ఆ విధంగా అనితరంగా ఆమె రక్తి కట్టించారు. హర్యానా బిడ్డగా 25 సంవత్సరాల వయస్సులోనే దేవీలాల్ కేబినెట్‌లో మంత్రి కాగలిగారు. నాలుగు రాష్ట్రాల నుంచి 11 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా స్వరాజ్ 1999లో జరిగిన 13వ లోక్‌సభ బ్యాలట్ యుద్ధంలో కర్నాటకలోని బళ్లారి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పోటీ చేసి ఓడిపోయినా స్వల్పకాల ప్రచారంతోనే 3,58,000 ఓట్లు సాధించుకొని తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

పార్లమెంటు సభ్యురాలుగా 7 సార్లు, శాసన సభకు 3 సార్లు ఎన్నికయిన చరిత్ర ఆమెది. 1998లో వాజ్‌పేయీ ప్రభుత్వంలో రెండో సారి సమాచార ప్రచార శాఖ మంత్రిగా పని చేసినప్పుడు చలన చిత్ర నిర్మాణానికి పరిశ్రమ గుర్తింపునిచ్చి దానికి బ్యాంకు రుణాల అర్హత కల్పించారు. 200304లో ఆరోగ్యశాఖ మంత్రిగా దేశంలో కొత్తగా 6 ఆలిండియా మెడికల్ సైన్సెస్ సంస్థల (ఎయిమ్స్) ను నెలకొల్పించారు. రాజ్యసభ సభ్యురాలుగా ఆ సభలో ప్రతిపక్ష ఉప నాయకురాలుగా చేసిన సుష్మా అద్వానీ తర్వాత లోక్‌సభలోనూ విపక్ష నేతగా పని చేశారు. 2014 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని విదిశా నియోజకవర్గం నుంచి 4 లక్షల అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొంది విదేశాంగ మంత్రిత్వ శాఖను చేపట్టి పూర్తి కాలం పని చేశారు.

ఇందిరా గాంధీ తర్వాత ఆ శాఖను నిర్వహించిన రెండో మహిళగా చరిత్రకెక్కారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విదేశాంగ వ్యవహారాలు చూసుకుంటూ ఆ రంగంలో దేశ దిశను అంతవరకు కొనసాగిన మార్గం నుంచి పూర్తిగా మళ్లించి విరివిగా విదేశీ యానాలు చేస్తున్న దశలో ఆ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ దేశ దేశాల్లోని బాధిత భారతీయులను పట్టించుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దారి తప్పి 15 సంవత్సరాల పాటు పాకిస్థాన్‌లో గడిపిన 23 ఏళ్ల గీత అనే మాటా వినికిడి లేని భారతీయ బాలికను స్వదేశానికి రప్పించి ఔరా! అనిపించారు. 1998లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు స్వల్ప కాలం అందులో కొనసాగారు.

1970లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యురాలుగా రాజకీయాలలో ప్రవేశించిన సుష్మ అనంతర కాలంలో సోషలిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. జార్జ్ ఫెర్నాండెజ్‌తో తన భర్తకు గల పరిచయం అందుకు దోహదపడింది. జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఆందోళనలోనూ చురుకైన పాత్ర పోషించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో సాటి అడ్వకేట్ స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఉన్నత విద్యావంతురాలై సమున్నత పదవులు చేపట్టిన సుష్మా స్వరాజ్ అనారోగ్యం కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇంత గొప్ప స్థాయిని అందుకున్న ఆమె విదేశాంగ మంత్రిగా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇరుకునపడ్డారు. దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తల దాచుకుంటున్న లలిత్ మోడీ తన భార్య ఆపరేషన్ కోసం పోర్చుగల్ వెళ్లడానికి నిరభ్యంతర అంగీకార పత్రంపై సంతకం చేసి బ్రిటన్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల పార్లమెంటులో ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. అత్యంత ఆదరాభిమానాలు గడించిన రాజకీయ నేతగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆమెను ప్రశంసించింది. పురుషాధిక్య సమాజంలో ఒక మహిళా నేత ఇన్ని శిఖరాలను అందుకోడం సాధారణ విషయం కాదు. రాహుల్ గాంధీ అన్నట్టు సైద్ధాంతిక విభేదాలతో నిమిత్తం లేకుండా పార్టీలకు అతీతంగా అందరితోనూ సంబంధాలను ఆమె కాపాడుకున్నారు. సిద్ధాంతాలు, ఆదర్శాలు వేరువేరు అయినా ఆమెతో పార్లమెంటులో గడిపిన సుహృద్భావ క్షణాలు అనేకం ఉన్నాయి అని మమతా బెనర్జీ కీర్తించడం గమనార్హం. రాజకీయాల్లో ఎదగ దలచుకొన్న వారికి ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయురాలుగా ఆమె చిరస్థాయిని పొందుతారు. అటువంటి విశేష విలక్షణ నాయకురాలిని కోల్పోడం బాధాకరం.

Special Story of Sushma Swaraj Political life

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సుష్మా స్వరాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: