తెలంగాణ అస్తిత్వ వాద గొంతుక ‘కుట్ర’

Conspiracy Book

 

వేల అడుగుల ఒక ప్రయాణం సరళ మార్గం నుండి దూరంగా విసిరేయబడి సంక్లిష్ట మార్గాన్ని ఎన్నుకుంది. కొన్ని అడుగుల్లో గుండెను చీల్చడానికి సిద్దంగా ఉన్న పదునైన కంకర రాళ్ళు, మరి కొన్ని అడుగుల్లో దారి పొడవునా దాహంతో తపిస్తున్న గాజు పెంకులు, జీవితాన్ని శూన్యంలోకి విసిరేసే అనుకోని మలుపులు, ఆ ప్రయాణంలోని మొదటి అడుగు నుండే పలుకరిస్తూ సవాల్ విసురుతున్నా, నిబద్ధతను నింపుకున్న ఆ అడుగులు ఇష్టంగా అటు వైపే పడుతాయి. తెలంగాణ స్థానికత, యాస, ధిక్కార స్వరం, ప్రాంతీయ వాదంతో కూడిన నీతి నిజాయితీ ఆ సంక్లిష్ట ప్రయాణానికి కారణాలైతే, ఆ అడుగులను వలస వాద ఆధిపత్య వ్యవస్థ అంగీకరించదన్న వాస్తవ దృక్కోణం అడుగగడుగునా అనధికారికంగా అప్రజాస్వామికంగా రుజువు అవుతుంది.

ఈ ప్రయాణం భిన్న పార్శ్వాలుగా సాగి విభిన్న అనుభవాలను, పోరాటాలను, త్యాగాలను, జీవితాలను, అణచివేత ధోరణులపై ఎగిసిన ధిక్కార గొంతుకను, నిబద్ధతను, దృఢ సంకల్పాన్ని ప్రతీ కదలికలో నింపుకుంటూ, వ్యవస్థతో నిరంతరం సంఘర్షిస్తుంది, పోరాడుతుంది. ప్రతీ మైలు రాయి దగ్గర తారసపడి పలుకరించేది ఒక తెలంగాణ అస్తిత్వ గొంతుక. ఇది ఒక వ్యక్తి జీవితం భిన్న మార్గాల్లో సమాంతరంగా చేసే సుదూర ప్రయాణం. ఈ పాత్రలోని వ్యక్తి యువతకి, విద్యార్థికి, ఉద్యమకారుడికి, నిబద్దత కలిగిన అధికారికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ వ్యక్తి ప్రతీ దశలో సమూహానికి ప్రతినిధిగా ప్రతీకగా నిలబడతాడు. కాబట్టి ఈ పాత్రను ఒక వ్యక్తిగా చూడలేం, వ్యవస్థతో పోరాడే సమూహ శక్తికి, వలస వాద ఆధిపత్యాన్ని నిరసించే గొంతుకకు ప్రతీకగా చూడగలం.

తెలంగాణా అస్తిత్వ పోరాటాన్ని, ఆ హక్కుల పోరాటంలో ఒక సాధారణ వ్యక్తిగా, మున్సిపల్, బ్యాంక్ ఉద్యోగిగా, కేవలం తెలంగాణ నేపథ్యం అవడం వల్ల, ఆ వ్యక్తి, అదే ప్రాంతంలో వలస వాదుల వల్ల ఎటువంటి వివక్షకు ఇబ్బందులకు గురి అవుతాడో, అత్యున్నత పోటీ పరీక్షలకు సాధన చేస్తున్న అభ్యర్థిగా కుటుంబ సభ్యుల త్యాగాల సహకారంతో కఠోర తపస్సు చేస్తూ, వలస వాద ఆధిపత్యం కారణంగా అత్యున్నత స్థానాన్ని పొందే స్థాయి నుండి అగాధంలోకి ఎలా నెట్టి వేయబడ్డాడో, ఒక ఎసిటిఓ అధికారిగా అవినీతిపరులను, దోపిడీ దారులను ఎదుర్కొంటూ, నిరంతరం కుళ్లిన వ్యవస్థతో సంఘర్షిస్తూ, ఒక వ్యక్తి సమూహ శక్తిగా సాగించిన అనితర సాధ్యమైన భిన్న పార్శ్వాల ప్రయాణం ఇది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఒక పేరు ఆపాదించవలసి వస్తే అది ‘కుట్ర‘. ఈ పదం చుట్టే ఆ ప్రయాణమంతా అడుగులు వేస్తుందా అంటే, నిబద్ధతను నింపుకున్న ఆ అడుగుల చుట్టూ కుట్ర ఉచ్చులా దారి పొడవునా అల్లుకుంటూ పోతుంది. ఆ కుట్ర, ప్రముఖ నవలా రచయిత డా॥ ప్రభాకర్ జైని కలం నుండి అస్తిత్వ స్వరాన్ని వినిపిస్తున్న ఒక తెలంగాణా గొంతుక.

వస్తువు, వస్తువులోని పాత్రల శైలి, ఆయా పాత్రల భావోద్వేగాల సరళిపై శిల్పం ఎంత బహిర్గతం అవుతుంది అన్నది సహజంగా ఆధారపడి ఉంటుంది. నవలంతా కుట్రను ఛేదించే అడుగుల జాడలలో సాగుతుంది కాబట్టి ఇక్కడ భావోద్వేగాలు కొన్ని సార్లు అంతర్లీనంగా, మరి కొన్ని సార్లు బాహ్యంగా ఇమిడి ఉండి, క్షీణిస్తున్న వ్యవస్థ యొక్క ఆధిపత్య అనైతిక ధోరణులు బహిర్గతమవుతాయి. కుటుంబ పరమైన ఉద్వేగాలు అంతర్లీనంగా ప్రవహిస్తూ పాఠకుడి హృద్యమైన గుండె తడి మీద ఆధారపడి కొనసాగుతాయి.

ఇక్కడ ఆ పాత్ర తెలంగాణ సమాజానికి ప్రతినిధి కావున, భాష, యాస పరంగా, ఉద్యోగ అవకాశాల, నిర్వహణ పరంగా వివక్షను ఎదుర్కుని భవిష్యత్తును, ఆత్మాభిమానాన్ని కోల్పోయిన సమూహాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, ఉద్యోగులను, ‘కుట్ర‘ తిరిగి ఆ కాలం నాటి ఉద్యమ భావోద్వేగ ప్రవాహాల్లోకి నెట్టివేస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి కాలం కళ్ల ముందు కదులుతూ చరిత్రలోని త్యాగాలను, కన్నీటి తడిని అద్ది చరిత్రకు జీవం పోస్తుంది. వస్తువుకు శిల్పం, శిల్పానికి వస్తువు వెన్నెముకై నవల ఆసాంతం పాఠకుడిని సంఘర్షణలలోంచి వేలు పట్టుకుని తీసుకెళ్తుంది. నవలలో ప్రధాన పాత్ర ప్రథమ పురుషలో అంటే ‘నేను‘ అని సాగుతుంది కాబట్టి వ్యాస సౌకర్యార్థం కోసం ‘నేను‘ అన్న దానిని ఇక్కడ ‘పాత్ర‘ గా తీసుకుందాం.

నవల ప్రారంభంలోనే రచయిత నవల ఆత్మను, ‘కుట్ర‘ శీర్షికను బలపరిచే ఎత్తుగడతో ‘మా ఆఫీసు వాండ్లు నాకు అలాట్ చేసిన టాటా సుమో మధ్య సీట్లకు నన్ను మొరటుగా నూకి, నాకు అటు ఇటు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూర్చున్నారు‘ అంటూ ఉత్కంఠకు తెర తీస్తూనే, నవలా అత్మలోని వాస్తవికతలోకి పాఠకుడిని ప్రవేశపెడతారు. నవలలోని చివరి అడుగులో పాఠకుడి మొదటి అడుగును వేయించడం వ్యూహాత్మకం. నవల మొదటి పార్శ్వంలో తెలంగాణ అస్తిత్వ గొంతుకను ప్రవేశపెట్టి, పాఠకుడిని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోకి తీసుకెళ్ళి, ఆ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ, యాభై రోజుల పాటు కారాగారంలో ఉన్న పాత్ర తండ్రి పోరాటాన్ని స్పృశింపజేస్తూ, ఆ ఉద్యమ ప్రభావం, పోరాట స్ఫూర్తి, విలువల పట్ల ఆదర్శాలు వారసత్వంగా ఎలా తండ్రి నుండి పాత్ర కు సంక్రమిస్తాయో తెలియజేస్తారు రచయిత.

ప్రయాణమంతా ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే దృఢ సంకల్పంతో ముందుకు సాగిన పాత్రకు పునాదిలోనే ఆత్మ స్థైర్యాన్ని నింపి, ఓ సుదీర్ఘ ప్రయాణానికి హేతువైన బలమైన అంశంగా ఈ పార్శ్వం కనిపిస్తూ పాత్రకు వెన్నుముకగా నిలుస్తుంది. నవల రెండవ పార్శ్వంలో మున్సిపల్ ఉద్యోగిగా, బ్యాంక్ ఉద్యోగిగా అడుగడుగునా వలస వాద ఆధిపత్య ప్రభావానికి, వివక్షకు గురై, ఆ ధోరణిని ధిక్కరించి, ఆటుపోట్లను ఎదుర్కుంటూనే, కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తూ, తన గమ్యమైన సివిల్ సర్వీసెస్ ని సాధించడం కోసం అహో రాత్రులు శ్రమిస్తూ చేసిన ప్రయాణంలో ఒక జీవన వికాస పోరాట దశ కనిపిస్తుంది. గమ్యం కోసం కష్టాలకు వెరవని దృఢ సంకల్పం తెర ముందు ప్రజ్వలితమై ప్రేరణను నింపుతుంది. ఇటువంటి ఉత్తేజితాపూరిత అనుభవాలను, మలుపులను అసంకల్పితంగానే కుట్ర ఆసాంతం పాఠకుడు అనుభూతి చెంది ప్రభావితమవుతాడు.

ఇదే సమయంలో పాఠకుడిని పలుకరించే మరొక పార్శ్వం పాత్ర యొక్క సాహిత్య ప్రయాణం. ‘మూడు నెలల్లో ఓ వంద ఆంగ్ల నవలలైనా చదివుంట‘ అనే వాక్యం ప్రతీ సాహిత్య ప్రేమికుడిని పులకింపజేయడమే కాదు, ఒక రకమైన ఆశ్చర్యకపూర్వక అనుభూతినీ కలిగించి, జిజ్ఞాసను రేకెత్తిస్తుంది. తన అనుభవాలను, సాహిత్య పిపాసను నవలలుగా కథలుగా అనుభావాక్షరీకరణ చేయడం ఒక ఎత్తైతే, నవలలోని పాత్ర నిర్మితమైన సంక్లిష్ట పరిస్థితుల్లో, ఒడిదొడుకుల ప్రయాణంలో రచనలు చేయడమనేది విశేషంగా కనబడుతూనే, సమయా భావలేమిని సాకుగా చూపి లక్ష్యాలను వదులుకునే వారికి ఒక గుణపాఠం లా మారి ఉత్తేజాన్ని కలిగిస్తూ, సంకల్ప ప్రాధాన్యాన్ని అంతర్లీనంగా ఎత్తి చూపుతుంది. ఈ క్రమంలోనే సివిల్స్ అనే తన ఆశల స్వప్నాన్ని కోల్పోయి, భార్యకు సమాధానం చెప్పలేని సమయంలో సాగిన మనోవేదనను నింపుకున్న సన్నివేశాలు మనసును కదిలిస్తాయి.

ఈ పాత్ర ప్రయాణంలో ప్రతీ మలుపులో, తన కుటుంబం చేసే త్యాగం మౌనంగా నిలబడి, ఆ పాత్ర గమనానికి గమ్యానికి అండగా నిలుస్తూ, ఒక వ్యక్తి గెలుపు లో కుటుంబ పాత్ర ఎంత ముఖ్యమైనదో నేరుగానో అంతర్లీనంగానో స్పష్టీకరణ చేస్తూ సాగుతుంది. ఆ తరువాత అధికార స్థాయి అయిన గ్రూప్ వన్ పరీక్షల మెయిన్స్ ఫలితాల్లో అత్యున్నత మార్కులు వచ్చినా, వలస వాదుల కుట్రల వల్ల తన అందమైన భవిష్యత్తు ఏ విధంగా నేలమట్టం అయిందో చిత్రించే సన్నివేశాలు సగటు తెలంగాణ బిడ్డను ఉద్యమ కాలంలోకి నెట్టివేసి భావోద్వేగ పూరిత వాతావరణాన్ని సృష్టిస్తాయి. తెలంగాణ ను పాలించడానికి, దోచుకోవడానికి అధికారిక హోదా ఉన్న ఉద్యోగాలలో ఎలాంటి కుట్రలు జరిగాయో చెప్తూ, నష్టపోయిన కొన్ని వేల మంది అభ్యర్థుల జీవితాలకు ప్రతినిధిగా ఈ పాత్ర నిలుస్తూ, ఉద్యమం వెనక ఉన్న కారణాలను బలంగా ఎత్తి చూపుతూనే, ఆరిపోయిన భవిష్యత్తు దీపాలను పాఠకుడి మనసులోకి సున్నితంగా ప్రవేశపెడుతుంది.

స్థూలంగా వ్యవస్థ స్థాయిలో కాక సూక్ష్మంగా ఒక వ్యక్తి, ఉద్యోగి, అధికారి స్థాయిలో సమైక్యాంధ్రుల వలస వాద ప్రభావం, కొందరు రాజకీయ నాయకుల, అధికారుల కుట్రల వల్ల తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగ అభ్యర్థులు ఏ విధంగా అణిచివేతకు, దోపిడీకి గురి అయ్యారో, ఆధిపత్య భావజాలం కింద ఎలా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో అడుగడుగునా ఎత్తి చూపుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన గొంతు వెనుక వున్న ఆక్రందనలకు, అభద్రతా భావాలకు, జీవం కోల్పోయిన జీవితాలకు సాక్ష్యంగా ఈ పాత్ర నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పోరాటమైనా, ఈ నవలా వస్తువు అయినా కేవలం వలస వాదం వల్ల అస్తిత్వాన్ని కోల్పోతున్న ఒక ప్రాంత గొంతుకను వినిపించడానికే పరిమితమైంది తప్ప, మరో ప్రాంతం వారిని విమర్శించడానికి, విద్వేషాలను సృష్టించడానికి బాధ్యత వహించలేదు.

కుట్ర నవల ముందు మాటలోనే ఒక చోట రచయిత ‘ఇది ఆంధ్రా తెలంగాణా ప్రాంతాల ప్రజలకు సంబంధించిన నవల కాదు, తెలుగు వాళ్ళం అని చెప్పి ఒక ప్రాంతాన్ని దోచుకున్న దుర్మార్గుల చిట్టా‘, ‘దోపిడీకి గురైన ఒక ప్రాంతపు, వంచనకు గురైన ఒక కుటుంబానికి సంబంధించిన సంఘటనల సమాహారమే‘ ఈ కుట్ర అని ఈ వస్తు ఎంపికకు గల చారిత్రక కారణాలను, ప్రాధాన్యతను వివరించిన రచయిత మాటల్లో, ఈ నిరసన కేవలం తెలంగాణ సంస్కృతిని, యాసను, ప్రాంతాన్ని అణగదొక్కుతున్న వలస వాద దోపిడీ వ్యవస్థ మీద తప్ప, సాధారణ ఆంధ్రా సోదరుల పై కాదన్న ఆంతర్యం బోధ పడి నవల వస్తు ఉనికిని క్రమబద్ధీకరిస్తుంది. కొన్ని వేల అడుగుల్లో అత్యంత జాగురూకతతో నిబద్దతతో సాగించిన ప్రయాణం చివరి మజిలీని చేరుకుంటున్న సమయంలో, కుట్ర దారులు పన్నిన ఉచ్చులో, ఆ నిజాయితీ చిక్కుకుని నిస్సహాయంగా తనకు కేటాయించిన వాహనంలోనే బందీగా హైదరాబాదుకు తరలడం అన్న భారమైన ముగింపుతో ఈ నవల ముగుస్తుంది. కేవలం ఈ నవల మాత్రమే ముగుస్తుంది. ఈ నవల రేకెత్తించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు, నైతికత, వ్యక్తి స్థాయిలో సాగిన ఉద్యమం సర్వకాలీనతను సంతరించుకుంటుంది.

ఆసాంతం సరళ పదాలతో సాగుతూ, తెలంగాణ ప్రాంత యాసను అక్షరాల్లో జీర్ణించుకుని, జీవిత మలుపులలోని ఉత్కంఠభరితమైన ప్రయాణాన్ని దృశ్యమానం చేస్తూ, ప్రాంత అస్తిత్వ గొంతుకను, కర్తవ్య నిర్వహణను అడుగడుగులో స్వరించిన విప్లవించిన నవల కుట్ర. పద ప్రయోగంలోను, వాక్య నిర్మాణంలోనూ రచయిత ఎక్కడా అతిశయోక్తికి తావివ్వలేదు. అనవసర పాత్రల సృష్టీకరణ, వాక్య నిర్మాణాలు లేవు. వస్తువూ ఎక్కడా అదుపు తప్పకుండా, శిల్పంతో సమాంతరంగా సాగుతూ, పాఠకుడి ఉత్సుకతను చివరి అడుగు వరకూ తమ వెంట పెట్టుకుని ప్రయాణిస్తూ, ఆంధ్రా మిత్రులకు సైతం తెలంగాణ సోదరుల వేదనను, వారు ఎదుర్కున్న వివక్షను, నష్టపోయిన జీవితాలను హృద్యంగా గుండె తడితో, కన్నీటి చెమ్మలతో, తడారిన గొంతుతో నివేదించిన నవల కుట్ర.

ఇది ఒక వ్యక్తి ఉద్యోగి అధికారి పోరాట గొంతుక. ఒక అసాధారణమైన ప్రస్థానం. ఒక పదవీ విరమణ చేసిన అధికారిగా, స్వాతంత్య్రాన్ని తెలంగాణ గుండెలపై లిఖించిన ఒక ఉద్యమ కారుడిగా ఆయా పాత్రల నుం డి విరామం తీసుకున్నా, సాహిత్యం లో ఈ పాత్ర నవలా కారుడిగా, కథకుడిగా ఉన్నతంగా అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తూనే ఉంది. కుట్ర నవలలో కథానాయకుడి స్థానాన్ని పో షించిన ఆ పాత్ర, ఆ పాత్రకు అక్షర రూపంలో సర్వకాలీనతను అద్దిన కు ట్ర నవలా రచయిత ఇద్దరూ ఒక్కరే. ఆ ఒక్కరే డా॥ ప్రభాకర్ జైని.

Special Story about Conspiracy Book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ అస్తిత్వ వాద గొంతుక ‘కుట్ర’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.