63 ఏళ్ల నాగార్జున లైబ్రరీ

Nagarjuna Library

 

ప్రజాకవి బండి యాదగిరి చెప్పినట్లు చుట్టు ముట్టు సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ, నల్లగొండ ఖిల్లా కింద నీ గోరీ కడతం కొడుకో నైజాం సర్కరోడా అని పాడినట్లు గానే నల్లగొండ గడ్డలో చైతన్యం ఉంటది, ఉద్యమతత్వం ఉంటది, స్వాతంత్య్ర పోరాటంలో గాని, నిజాం వ్యతిరేక పోరాటం లోగాని, రైతాంగ సాయుధ పోరాటంలో గాని, సాహిత్యోద్యమంలో గాని, గ్రంథాలయోద్యమంలో గాని ఈ జిల్లా ముందంజలో ఉన్నది. పత్రికలు సమాజ పుత్రికలు అన్నట్లు ఈ నీలగిరి గడ్డలో గ్రంథాలయోద్యమానికి ఊతమిచ్చిన నీలగిరి పత్రిక పుట్టిన నేల ఇది. ఈ పత్రిక నిజాం నిరంకుశత్వం పై ధిక్కార స్వరాన్ని వినిపించింది. నిత్యం ఉద్యమాలు ఉదయించిన నేలలో అక్షర ఉద్యమంకై వికసించిన సరస్వతి పీఠమే నల్గొండ జిల్లా నడి గడ్డన ఉన్న నాగార్జున ప్రభుత్వ కళాశాల.

ప్రభుత్వ కళాశాలలు నైపుణ్యానికి, సమర్థతకు, సృజనాత్మకతకు, విద్యా ప్రమాణాలకు మచ్చుతునకలు. ఈ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటికే అడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం విద్యార్ధులు జిల్లా వ్యాప్తంగా ఎగబడతారు. తరాలు మారిన తరగని నైపుణ్యాల గని ఈ కళాశాల. 1956 సంవత్సరంలో నాగార్జున సమితి ఏర్పడిన తరువాత కంచర్ల రామకృష్ణా రెడ్డి, పులిజాల రంగారావు, రామానుజా చారి, దేవరకొండ కొండల్ రావు, మేడారం రంగారావు, సి వి వెంకటనారాయణ ప్రభుతుల అధ్వర్యంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు, రెవిన్యూ మంత్రి కొండా వెంకట్రామిరెడ్డి 1956లో జులై 22వ తేదిన నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. తెలంగాణలో నాకు తెలిసి అప్పటికి వరకు కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్‌లో నిజాం కళాశాలలు మాత్రమే ఉన్నాయి. 1989 వరకు బి.ఎ., బి.కాం., బి.ఎస్‌సి. సంప్రదాయ కోర్సులతో ఈవినింగ్ కాలేజీ, డే కాలేజీలు నడిచాయి. ఈ కళాశాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు, వారిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తారు.

30 మంది విద్యార్థులతో ప్రారంభించబడిన ఈ కళాశాలలో నేడు దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కళాశాలలో దాదాపు 25 కోర్సుల వరకు ఉన్నాయి. 2007 వ సంవత్సరం లో నిజాం కాలేజి తరువాత స్వయం ప్రతి పత్తి హోదా దీనికి దక్కింది. కళాశాల సామర్థ్యం, నైపుణ్యం, ఉన్నతిని గుర్తించి ఎన్‌ఎఎసి (జాతీయ సంస్థ) వారు ఎ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణకు తలమానికం ఈ కళాశాల. తెలంగాణ రాష్ట్ర అవిర్భావానికి రాజకీయ పార్టీలు ఎంతగా ఉద్యమించాయో లేదో కాని ఈ కళాశాల ప్రతి విద్యార్థి, ఉద్యోగి, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గొంతెత్తి చాటారు.

నిరంతర విశ్వవిద్యాలయం ఈ కళాశాల గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో సుమారు లక్ష వరకు అపురూపమైన పుస్తకాలు న్నాయి. దాదాపు 30 కోర్సుల సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో తెలుగు, హింది, ఉర్దూ, ఇంగ్లీషు మాధ్యమంలో కుడా ఉన్నాయి. లాంగ్వేజస్, సామాజిక శాస్త్ర, రసాయన శాస్త్ర, జీవ శాస్త్ర, జియాలజీ, జాగ్రఫీ, ఫిజిక్స్, మాథమేటిక్స్, క౦ప్యూటర్ సైన్స్, కామర్స్, ఆరట్స్ & సోషల్ సైన్సెస్ పుస్తకాలు ఉన్నాయి.

ఈ కళాశాలకు ఆయువు పట్టు గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో చక్కటి రీడింగ్ హాల్ సదుపాయమున్నాయి. దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని చదువు కోవచ్చు. కెరియర్ గైడెన్స్ విభాగం కలదు. దాదాపు 10 వేల పుస్తకాలు, 100 మాస, దిన పత్రికలూ (హిందీ, ఆంగ్లము, తెలుగు భాషలలో) అgదుబాటులో ఉన్నాయి. దేవాలయాలు, మసీదులు, చర్చీలు కనబడని దైవాలైతే ఇక్కడ ఉన్న గ్రంథాలయం కనబడే దేవాలయమే . సమయం దొరికితే చాలు గ్రంథాలయంలో చొరబడి అక్కడ ఉన్న పుస్తాకాలను తమ మస్తిష్కం లో బంధించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ విద్యార్థులు. ఒక్క ఉద్యోగాల కోసం ప్రిపేరు అయ్యే వారు అనే కాకుండా, సెమిస్టర్, ప్రాజెక్టులు, ఇంటర్వ్యూల, రచనల, కవితలు, పరిశోధన కోసం రోజు అలా ఒక సారి గ్రంథాలయంకు వెళ్ళాలనిపించటం సహజం.

నిత్యం ఈ గ్రంథాలయానికి పరిశోధక విద్యార్థులు పదుల సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో ఏర్పడిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల కంటే కూడా ఈ గ్రంథాలయం ఉన్న పుస్తకాలు ఎక్కువ. తెలుగు పుస్తకాలకు ఈ గ్రంథాలయం పుట్టినిల్లు ఒకప్పుడు నిజా౦ రాష్ట్ర౦లో ఏర్పడిన ఆ౦ధ్రభాషానిలయాలకు (గ్ర౦థాలయాలకు)ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ విజ్ఞాన సర్వస్వాలు, డిక్షనరీలు, ఎన్ సైక్లో పీడియాలు, పాత బాల శిక్షలు, నల్లగొండ జిల్లా సర్వస్వం, జిల్లా కవుల చరిత్ర, జిల్లా భౌగోళిక స్వరూపం, మ్యాపులు, అఫీషియల్ రిపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ కళాశాలలో విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభ వెలికితీసేందుకు వారి రచనలు, కవితలు, వ్యాసాలూ క్రోడీకరించి ప్రతిభ అనే పుస్తకాన్ని అచ్చు వేస్తారు. అవి దాదాపు గ్రంథాలయంలో మూడు వెల వరకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ కళాశాల విద్యార్థులు జాతీయ విశ్వవిద్యాలయాలలో, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వందల సంఖ్యలో ఉంటారు. ప్రతీ విశ్వవిద్యాలయంలో మొదటి పది, ఐదు ర్యాంకులలో ఎన్జీ కాలేజీ పిల్లలే ఉంటారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపదనే.

మారుతున్న కాలంతో పాటు గ్రంథాలయం కూడా సాంకేతికంగా నూతన రూపురేఖలు దిద్దుకున్నది. రాష్ట్రంలో మెట్టమొదటి సోల్ సాప్ట్వేర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా కంప్యూటరీకరణ చేయబడిన గ్రంథాలయం ఇది. విద్యార్థులకు ఉచితంగా ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తుంది. దాదాపు ఈ గ్రంథాలయం లో దాదాపు 20 కంప్యూటర్ల్లు అందుబాటులో ఉన్నాయి. దాని నుండి వివిధ ఎలక్ట్రానిక్ పుస్తకాలు, జర్నల్స్, సమాచారం విద్యార్థులకు అందిస్తున్నారు. ఎన్ లిస్టు ఎలక్ట్రానిక్ దాదాపు పది వేల పుస్తకాలు, 50 వేల జర్నల్స్ అన్ లైన్ ద్వారా ఉచితంగా విద్యార్థులు పొందవచ్చు.

ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం లైబ్రేరియన్ ంకరయ్య, లక్ష్మారెడ్డి వారి పరంపరను, నాగరాజు, దుర్గాప్రసాద్ చేస్తున్న కృషి మర్చిపోలేనివి. కాలేజీలో ఉద్ధండులైన ఉపాధ్యాయులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య, ముదిగొండ వీరభద్రయ్య, కీ.శే. నోముల సత్యనారాయణ, ప్రొఫెసర్ చక్రధర్, వై.వి.రెడ్డి, అంపశయ్య నవీన్, మారుతీరావు, బెల్లి యాదయ్య లాంటి వారు నిత్యం ఈ గ్రంథాలయం నీడలో సేద తీరినవారే.

ఈ కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత రంగాల్లో ఉన్నవారు అనేక మంది వారిలో మచ్చుకు చోల్లేటి ప్రభాకర్ ఐఎఎస్, గంగాధర కిషన్ విద్యాశాఖ డైరక్టర్, జి సుదర్శన్ కేంద్ర మాజీ జలవనరుల శాఖ డైరక్టర్, బి. వెంకట రత్నం కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, కట్టా నరసింహారెడ్డి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, నేతి విద్యాసాగర్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నంద్యాల నర్సింహ రెడ్డి మాజీ శాసన సభ సభ్యులు నల్లగొండ, గాదరి కిషోర్ శాసనసభ సభ్యులు తుంగతుర్తి, కె నరేందర్ మాజీ రిజిస్ట్రార్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వంటి వారు ఈ గ్రంథాలయంలోని పుస్తకాలతో పట్టు పట్టిన వారే. ఇలా చాలా మంది దేశ విదేశాలలో విద్యా, కళా, ఉద్యమ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలల్ల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారిని ఉత్పత్తి చేయడంలో ఈ కళాశాల గ్రంథాలయం పాత్ర మరువలేనిది.

ఈ కళాశాలకు నిత్యం దాదాపు వందల సంఖ్యలో దాదాపు 60 కిలోమీటర్ల దూరం గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు కళాశాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం ( ఉదయం క్లాసులు & మధ్యాహ్నం గ్రంథాలయం) వరకు ఉంటారు. కావున అందరికి మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాల గ్రంథాలయానికి అధిక నిధులు కేటాయించి రాష్ట్రంలో ఉన్నత పరిశోధక గ్రంథాలయంగా తీర్చిదిద్డాల్సిన అవసరమున్నది. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగిస్తున్నారు. వారికి ఈ గ్రంథాలయం (పరిశోధక గ్రంథాలయంగా మార్చితే) ఉపయోగపడుతుంది. ఈ జిల్లాలో అనేక విద్యా సంస్థలు సాహిత్య సంస్థలు, రాజకీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అనేక పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ సంస్థల జ్ఞాన దాహార్తికి కూడా ఈ పరిశోధక గ్రంథాలయ అవసరమున్నది.

Special story about 63 year old Nagarjuna Library

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 63 ఏళ్ల నాగార్జున లైబ్రరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.