వారం తర్వాతే వర్షాలు

Southwest monsoon

24 లేదా 25న తెలుగు రాష్ట్రాలకు తొలకరి,  21న మహారాష్ట్రను తాకనున్న రుతుపవనాలు, మరింత బలహీనపడిన వాయు, నేడు రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం, ఉత్తర తెలంగాణలో తీవ్ర వడగాడ్పులు…..

నైరుతి రుతుపవనాలు ఈ నెల 21వ తేదీన మహారాష్ట్రకు రానున్నాయని, జూన్ 24 లేదా 25లోపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 4.5 కి.మీల నుంచి 5.8 కి.మీల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 3 -నుంచి 4 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మంగళవారం రాత్రి, బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, మంగళవారం రాత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుతుఫాన్ మరింత బలహీనపడింది. గత గురువారం అది తీరం దాటుతుందని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. మంగళవారం ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయు ప్రభావంతో గుజరాత్‌లో విస్తారమైన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఐదు జాతీయ విపత్తు సహాయ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) సిద్ధమయ్యాయి. వాయు తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చని, ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమురంభీం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం 42.9 డిగ్రీలు, ఆదిలాబాద్ 42.9, భద్రాద్రి కొత్తగూడెం 42.8, భద్రాచలం 42.4, హన్మకొండ 41.5, హైదరాబాద్ 38.4, జగిత్యాల 42.4, జయశంకర్ భూపాలపల్లి 42.6, జోగలాంభ గద్వాల్ 42.5, కామారెడ్డి 37.3, కరీంనగర్ 42.2, మహబూబ్‌నగర్ 38, మెదక్ 40.2, నల్లగొండ 42.5, నిజామాబాద్ 41.1, రామగుండం 42.2, కొమురం భీం ఆసిఫాబాద్ 42.5, మహబూబాబాద్ 42.7, మేడ్చల్ 35.4, ములుగు 42.4, నాగర్‌కర్నూల్ 34.7,రంగారెడ్డి 37.3, సంగారెడ్డి 41.6, సిద్ధిపేట 42.3, సూర్యాపేట 42.3, పెద్దపల్లి 40.8, నారాయణపేట 35.3, నిర్మల్ 42.9, రాజన్న సిరిసిల్ల 39.5,వికారాబాద్ 35.4, వనపర్తి 36.1, వరంగల్ రూరల్ 42.5, వరంగల్ అర్భన్ 44, జనగాం 42.7, మంచిర్యాల 42.5, యాదాద్రిభువనగిరి 38.2 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి 40 కి.మీల) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మంగళవారం రాత్రి కొన్నిచోట్ల, బుధవారం చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి, బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మంగళవారం రాత్రి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, బుధ, గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి 40 కి.మీల) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Southwest monsoon to hit Maharashtra by June 21

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వారం తర్వాతే వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.