అనాథ చిన్నారులకు సోనూసూద్ అండ

Sonu Sood adopts three orphans from Telangana
చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు

మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు చిన్నారులు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారారు. పిల్లల దీనగాధను పలు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. వాటికి సోనూసూద్ స్పందించారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం అందించి ఆదుకున్న సోనూసూద్ చిన్నారులను ఆదుకుంటానని పేర్కొన్నారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య, అనూరాధ మృతి చెందడంతో వారి పిల్లలు మనోమర్, లాస్య, యశ్వంత్ అనాథలుగా మారారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ. 50వేలు అందించి చిన్నారుల ఆలనా పాలన చూస్తానని చిన్నారుల మేనమామకు ఫోన్‌లో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య చిన్నారులకు తక్షణ సాయంగా రూ. 10వేలు అందించారు.

చిన్నారి లాస్య పేరున రూ. లక్ష ఫిక్స్‌డ్ చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్యారం విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు చిన్నారులను పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ ఆశ్రమంలో అవకాశం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌కు చెందిన బగ్లీ మహేష్ పాటిల్ చిన్నారులకు తన మిత్రుల ద్వారా ఒక క్వింటా బియ్యం, రూ. 5వేలను అందించారు. ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ ఇద్రీస్ అలీ, పోలీసులు చిన్నారులకు అండగా నిలిచారు. ఎస్‌ఐ రూ. 5వేలు, పోలీసు సిబ్బంది రూ. 6వేలు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి శనివారం అనాథ చిన్నారులను కలవనున్నారు. మన తెలంగాణ దిన పత్రిక అనాథ చిన్నారుల దీనగాథను ‘అమ్మా ఆకలి.. పాపం పసివాళ్లు’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అనాథ చిన్నారులకు సోనూసూద్ అండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.