20లక్షల కోట్ల ప్యాకేజీ క్రూరమైన జోక్

Sonia to chair opposition meeting on migrants

 

అర్థం పర్థం లేని లాక్‌డౌన్లతో కష్టాలు తెచ్చారు
వలస కూలీలను వాళ్ల కష్టానికి వదిలి పెట్టారు
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు
22 విపక్ష పార్టీల సమావేశంలో ఎఐసిసి అధినేత్రి సోనియా ధ్వజం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్చిన 24న కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారని దుయ్యబట్టారు.

లాక్‌డౌన్‌లో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై చర్చించేందుకు శుక్రవారంనాడు 22విపక్ష పార్టీల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అందులో వివిధ పార్టీల నేతలనున ఉద్దేశించి సోని యా మాట్లాడారు. కరోనా ఆపత్కాలంలో ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేశారు. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేసినా, కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయన్నారు.

అదే సమయంలో సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఏ కోశానా ప్రజాస్వామ్య విలువలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. సుమారు 13కోట్ల మంది పేద వలస కూలీలను క్రూరంగా మరిచిపోయారని మండిపడ్డారు. వాళ్ల కష్టాలకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదన్నారు. వారితో రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ఈలోగా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌గా నిలిచిందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తీర్మానం
ప.బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అతలాకుతలం చేయడమే కాకుండా అన్ని వర్గాలను తీవ్రంగా నష్టపరిచిన ఎంఫాన్ తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 పార్టీలు ఈ సందర్భం గా తీర్మానం చేశాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభావిత రాష్ట్రాలకు భారీ ఎత్తున ఆర్థికసాయం ప్రకటించి కేం ద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలకు తాము అండగా నిలబడుతామని తెలిపారు. ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న ఆ రెండు రాష్ట్రాలు ఎంఫాన్‌తో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 20లక్షల కోట్ల ప్యాకేజీ క్రూరమైన జోక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.