సోషల్ మీడియా ప్రభావం…

నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సులభం అయింది. చాలా స్వల్ప కాలంలో, అనేక సామాజిక మీడియా సైట్లు ఉద్భవించి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సామాన్యంగా, సోషల్ మీడియా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి, వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి, వారితో పరస్పర చర్చలు, సంబంధాలు కొనసాగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యమాలు మొదలుకొని.. ఊసుపోని సరదా కబుర్లు వరకు సోషల్ మీడియా అనేది చక్కని ఫ్లాట్‌ఫాం. అదే సమయంలో చక్కగా ఉపయోగించుకుంటే ఒక […] The post సోషల్ మీడియా ప్రభావం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సులభం అయింది. చాలా స్వల్ప కాలంలో, అనేక సామాజిక మీడియా సైట్లు ఉద్భవించి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సామాన్యంగా, సోషల్ మీడియా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి, వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి, వారితో పరస్పర చర్చలు, సంబంధాలు కొనసాగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యమాలు మొదలుకొని.. ఊసుపోని సరదా కబుర్లు వరకు సోషల్ మీడియా అనేది చక్కని ఫ్లాట్‌ఫాం. అదే సమయంలో చక్కగా ఉపయోగించుకుంటే ఒక చక్కని గురువువలే తోడూనీడగా ఉండి జ్ఞానబోధ కూడా చేస్తుంది. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతలా ఉపయోగించుకోవాలి అనేది యువతకు తెలియకపోవడమే అసలు సమస్య.
ఇది ఒక సాలెగూడు అంతకు మించి విష వలయం ఒక్కసారి అందులోకి వెళ్ళామా తిరిగి బయటకు రాలేము. ఇందులో దొరికే అశ్లీలతకు కొందరు యువతీ యువకులు చిక్కుకొని తమ విలువైన భావి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వినియోగం 2006 నుంచి 2016 వరకు రోజుకు గంట లేదా రెండు గంటలు ఉండేది. 4 జి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు సోషల్ మీడియా యువత జీవితంలో ఒక భాగమైంది. యువత చదువులపై ఇది తీవ్ర ప్రభావం చూపడమే కాదు… పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు కూడా అర్థం చేసుకోలేనంతగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. పుస్తకాలపై దృష్టి సారించడం కూడా కష్టతరమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పెద్దలు, యువత మేల్కోలేదంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో తేలింది. సిగరెట్, ఆల్కహాల్‌తో పోలిస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిసింది. అందుకే సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే యువత తమను తాము ఓసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఎక్కువవుతున్నాయి. సమాజంలో హింసను పెంచుతున్నాయి. బంధాలు దెబ్బతింటున్నాయి.
ఇంటర్నెట్ వినియోగం సామాజిక, ఆర్థిక రంగాల్లో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన, లోతైన సమాచారాన్ని అందజేయడం ద్వారా అనేక రూపాల్లో ప్రభావం చూపనుంది. కళలు, వ్యాపారాలు, వాణిజ్య రంగాలను రూపుదిద్దడంలో, అణగారిన వర్గాలకు సాధికారత పరచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే మనలో ఉన్న శక్తి యుక్తులు మెరుగుపరచడంలో సామాజిక మాధ్యమాలు ఇతోధికంగా సహాయ పడుతున్నాయి. డిజైనర్ షోరూంలు సోషల్ మీడియాను ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తమ బిజినెస్‌ను రెట్టింపు చేసుకుంటున్నాయి. ప్రొడక్ట్ యాడ్స్‌తో పాటు సందేశాత్మక విడియోలు అప్‌లోడ్ చేస్తూ చూసేవారి మనసును గెలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో తమ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజూ చర్చలు జరిగేలా జాగ్రత్తపడుతూ తేలికగా కొనుగోలుదార్లకు చేరువ చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు, నేతలతో పాటు సోషల్ మీడియాను వినియోగించుకునేవారి సంఖ్య పెరిగింది కాబట్టి, ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి, అతి తక్కువ ఖర్చుతో చేరవేయాలంటే సోషల్ మీడియాను మించింది లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవినీతిని వ్యతిరేకించే యువతరాన్ని, అభివృద్ధిని ఆశించే మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు అంతర్జాలం అనువైన వేదిక అని అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఎంతో శ్రమ కోర్చి సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్న నిపుణుల సేవలను రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఈ నిపుణులు సంబంధిత రాజకీయ పార్టీల వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం పెడుతుంటారు. నేతల అవినీతిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం ఎక్కువగా సాగుతుంది. అదే సమయంలో సామాజిక మాధ్యమాలు పెట్టుబడిదారీ విధానాలను ప్రచారం చేస్తున్నాయి.
గాలి వార్తలు, మూఢ నమ్మకాలు, అసత్యాలు కూడా అంతే వేగంగా ప్రవహించి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజం నాలుక దాటేలోపు ఈ కల్పనలు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాయి. అటువంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరు కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పలువురు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు లైక్స్, కామెంట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ లైక్స్ పిచ్చి ప్రాణాలు కూడా తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా సింగపూర్‌కు చెందిన ఒక 17 సంవత్సరాల కుర్రాడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి, లైక్స్ కొట్టించుకోవాలనుకున్నాడు. అయితే పొరపాటు జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. 17 సంవత్సరాల వయస్సులోనే వైరల్ వీడియో అంటూ ప్రాణాలు కోల్పోయిన ఆ కుర్రాడు ఇతరులకు గుణపాఠంగా నిలిచాడు.
సోషల్ మీడియా అనేది మనం ఎదగడానికే కాని, దిగజారడానికి కాదు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల కంటే, మానవ సంబంధాలు అనేవి ఎప్పటికీ గొప్పవి. సామాజిక మాధ్యమాల వల్ల సమాజ సంబంధాలు బలపడేలా చేయాల్సిన బాధ్యత మనందరిది. పెరిగే పిల్లలను సోషల్ మీడియాను అధిక స్థాయిలో వాడి సమయాన్ని వృథా చేయకుండా సామాజిక, నైతిక విలువలను పెంచుకునేలా ప్రోత్సహించాలి . అప్పుడే సమాజం పరిపూర్ణంగా తయారు అవుతుంది. సమాచార మాధ్యమాలు ప్రజల పురోగతికి తోడ్పడే సాధనాలుగా ఉండా లి. శాస్త్రీయమైన, సత్య నిబద్ధతలతో కూడిన, నిర్మాణాత్మక ప్రజాభిప్రాయాన్ని నిర్మించే విధంగా పెంపొందించాలి. సమాజంలోని అనేక అంశాల్లో పాటిస్తున్న అనైతిక విలువ ప్రభావం మాధ్యమాలపై కూడా పడుతున్నదని గమనించాలి. సోషల్ మీడియా మన జీవిత ప్రమాణాలు, ఆలోచనలు, సంస్కృతి, సాహిత్యాలపై తీవ్రమైన ప్రభావాలను కలిగించి.. మన రాజకీయ, సామాజిక దిశ, దశలను మార్చి వేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల మానవులు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోయింది. ప్రజాచైతన్యమే సోషల్ మీడియా అక్రమాలకు విరుగుడు. మంచిని ప్రోత్సహించాలి.
ప్రజా సమస్యలను సమర్థవంతంగా వివరించి, విశ్లేషించి, పరిష్కరించడానికి ప్రయత్నించే ఇతర మాధ్యమాలను ఆదరించాలి. ప్రజలకు ఉపయోగపడని వార్తలను, విషయాలను, ప్రసారం చేస్తున్న మాధ్యమ సంస్థలను తిరస్కరించాలి. ప్రజల జీవన విధానం, జీవన చర్యల ప్రతిబింబమే సంస్కృతి. వస్త్రధారణ, భాష, ఆలోచనా విధానం, ఆచారాలు, పండుగలు, వేడుకలు, వినోదాలు, జాతరలు, కుటుంబ విధానం, విలువల సమ్మేళనమే మన భారతదేశ సంస్కృతి. వ్యసనాలకు దూరంగా ఉంటూ మన సంస్కృతిని ఇలాగే పది కాలాల పాటు కాపాడుకుంటేనే సాంకేతికకు సార్ధకత. దానికి మనం అందరం కృషి చెయ్యాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అపుడే మెరుగైన సమాజం సాధించగలుగుతాము.

Social media effect

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సోషల్ మీడియా ప్రభావం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: