ట్రంప్ టూర్‌కు సొగసులు.. గాంధీనగర్ స్లమ్స్‌కు ఎసర్లు

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షులు ట్రంప్ వస్తున్నారని పేర్కొంటూ స్ధానిక మురికివాడల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రత్యేకించి ట్రంప్ మోడీలు అట్టహాసంగా పాల్గొనే నమస్తే ట్రంప్ కార్యక్రమం వేదిక మోతేరా స్టేడియం ఇప్పుడు కంచుకోటగా మారింది. దీనికి పరిసరాలలోని స్లమ్ ప్రజలను, అహ్మదాబాద్‌ను గాంధీనగర్‌కు కలిపే దారికి ఇరువైపులా ఉండే మురికివాడల వారిని అధికారులు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నారు. కిలో మీటరున్నర వరకూ ఈ తరలింపు చేపట్టారు. దీనితో పేదలు, ప్రత్యేకించి రోజువారి కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇక్కడి పేదరికం, ప్రత్యేకించి ప్రధాని మోడీ స్వరాష్ట్రం రాజధానిలో దయనీయ స్థితి తెలియకూడదనే మురికివాడలకు అడ్డుగోడలను పెట్టడం, వారిని ఖాళీ చేయించడం జరిగిందని వెల్లడైంది. పలు ప్రాంతాలలో వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు.

Slums Covered a wall in Gujarat

దీంతో మురికివాడల్లోని వారు ఏమీ చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. అయితే నోటీసుల జారీకి, ట్రంప్ రాకకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు వివరణలు ఇచ్చుకుంటున్నారు. అయితే ట్రంప్ వెళ్లే దారిలో మురికివాడలు కన్పించకుండా గోడల నిర్మాణం రాత్రింబవళ్లు జరగడంతో స్థానికులు కంగారు పడుతున్నారు. అయితే ఆక్రమణలకు సంబంధించిన వాటికే తాము నోటీసులు వెలువరిస్తున్నట్లు, వారిని మూటాముల్లెలతో వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఉన్నట్లుండి తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తే ఎటు వెళ్లాలని, అమెరికా అధ్యక్షుడి రెండు గంటల రాక కోసం జీవితాంతం ఇక్కడే ఉంటామనే వారిని వెళ్లగొడుతారా? అని స్థానికులు నిలదీస్తున్నారు. నోటీసులు ఇచ్చామని తెలిపిన అధికారులు బుధవారం సాయంత్రం లోగా వారు వెళ్లిపోవల్సిందేనని లేకపోతే రాత్రిఅయినా ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు.

Slums Covered a wall for Trump arrives to Gujarat

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రంప్ టూర్‌కు సొగసులు.. గాంధీనగర్ స్లమ్స్‌కు ఎసర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.