దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడికి..

Road Accident

 

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కరీంనగర్‌వాసులు దుర్మరణం, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

కరీంనగర్ : వరుస సెలవులు రావడంతో ఆ కుటుంబమంతా కలిసి కారులో దైవ దర్శనానికి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆగి ఉన్న లారీ రూపంలో వారిని మృత్యువు కబలించింది. దైవ దర్శనం కోసం వెళుతున్న ఆ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు చేరుకుంది. సంతోషంగా వెళుతున్న ఆ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మృతుందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులు, కుటుంబసభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల్లో ఇరువురు మహిళలు, ఇరువురు చిన్నారులు ఉన్నారు.

న్యాయశాఖలో అకౌంట్స్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన మల్హర్‌రావు తన కుమార్తె అర్చనను కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన వంశీకృష్ణకు ఇచ్చి వివాహం జరిపిచారు. వంశీకృష్ణ దంపతులకు ఇరువురు సంతానం. కాగా వరుస సెలవులు రావడంతో అందరూ కలిసి తిరుపతికి వెళ్ళాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. తిరుపతికి వెళ్ళేందుకు హైద్రాబాద్ నుండి రైలు టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే మలహల్‌రావు అతని భార్య లీలావతితో కలిసి గురువారం రోజే హైద్రాబాద్‌కు వెళ్ళారు. అనుకున్న ప్రకారం శుక్రవారం రోజు తిరుపతికి వెళ్ళేందుకు రైలు ప్రయాణానికి సిద్దపడుతుండగా చివరి నిమిషంలో ట్రైన్ ప్రయాణాన్ని విరమించుకుని కారులో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

అయితే మలహల్‌రావు సహా అతని భార్య లీలావతి, కుమార్తె అర్చన, అల్లుడు వంగపల్లి వంశీకృష్ణ, మనవళ్ళు క్రిశాంత్, అద్వైత్‌లతో కలిసి టి.ఎస్.02. ఇ.డబ్లు.1112 అనే నంబర్ గల కారులో తిరుపతికి బయలుదేరారు. మార్గమధ్యంలో విజయవాడ వద్ద కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న ఆనంతరం అక్కడి నుండి తిరుపతికి బయలుదేరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు వద్ద ఎదురుగా ఆగిఉన్న లారీని అతివేగంగా వెళుతున్న వారి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా కారులో ప్రయాణీస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

అద్వైత్‌ను కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని భావించిన కుటుంబసభ్యులకు వారి మరణవార్తను వినాల్సి వచ్చింది. మంకమ్మతోట సుపరిచితుడైన మల్హర్‌రావు సహా అతని భార్య లీల మిగితా కుటుంబసభ్యులందరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త దావానంలా వ్యాపించడంతో బంధువులు, స్నేహితులందరూ ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వారి రాకతో బంధువుల రోధనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Six Karimnagar Residents died in Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడికి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.