శివకేశవుల జీవాయుధ పోరాటం

 Sivakeshavus biological weapon fight

కం॥ చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను ముక్తి కలుగును
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. ఇందులోని దశమ స్కందం ఉత్తర భాగంలో బాణాసుర ఘట్టం అత్యంత మనోహరంగా, ఆహ్లాదకరంగా రచించారు పోతన. ఈశ్వర వరప్రసాది అయిన బాణాసురుడి కథ అత్యంత కమనీయంగా ఉంటుంది భాగవతంలో. ఇందులో శ్రీకృష్ణుడు (విష్ణువు, శ్రీహరి, కేశవుడు), శివుడు ఒకానొక సందర్భంలో ‘శివజ్వరం’, ‘వైష్ణవజ్వరం’ అనే రెండు జీవాయుథాలను ఒకరి మీద మరొకరు ప్రయోగించుకుంటారు. చివరకు కథ సుఖాంతం అవుతుంది.
బలి చక్రవర్తి నూర్గురు కుమారులలో మొదటివాడు బాణుడు. అతడు అఖండ శివ భక్తుడు. అతడు శివుడిని ప్రార్థించి, ఆయన వరం కోరుకొమ్మంటే, తన పురం కోట వాకిటి ముందు కావలిగా ఉంది, తనను అహర్నిశలు రక్షించాలని అడిగాడు. బాణుడి కోరిక మన్నించిన శివుడు, పారవటీ దేవితో సహా, విఘ్నేశ్వరుడు, కుమారా స్వామి వెంటరాగా. పరమత గణాలను తీసుకుని బాణుడి నివాస స్థలమైన శోణపురం కోటవాకిటిలో రక్షకుడిగా పరమ శివుడు నివాసం ఏర్పరుచుకున్నాడు. తనతో పోరాదగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవారెవరైనా వున్నారా అని శివుడుని అడిగాడు బాణుడు ఒకనాడు అహంకారంతో. బాణుడి జెండా ఎప్పుడైతే అకారణంగా నేలకూలుతుందో అప్పుడు జరగబోయే యుద్ధంలో అతడి వేయి చేతులు నరకబడుతాయని, ఆయన గర్వం కూడా అణగారుతుందని చెప్పాడు శివుడు. అప్పటి నుంచీ ఆ సమయం కోసం ఎదురు చూడసాగాడు బాణుడు.
బాణుడికి ఉషాకన్య అనే కూతురు ఉన్నది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెకు ఒకనాడు నిద్రలో ఒక మంచి కల వచ్చింది. ఆ కలలో అసమాన సౌందర్య వంతుడైన రుక్మిణీ-శ్రీకృష్ణుడి మనుమడు, ప్రద్యుమ్నుడి కుమారుడు, అనిరుద్ధుడు ఆమెను కలిసి సుఖించినట్లు ఆమె భావించింది. అతడి కోసం తపిమ్చ సాగింది. ఆమె స్నేహితురాలు, బాణుడి మహామంత్రి కూతురు చిత్రరేఖ తన నేర్పరితనంతో ఎందరివో రూపురేఖా చిత్రాలను గీచి ఆమెకు చూపించింది. అందులో అనిరుద్ధుడి చిత్రాన్ని గుర్తుపట్టింది ఉషాకన్య. అతడే తన మానధనాన్ని దోచుకున్న దొంగ అని చెప్పింది. చిత్రరేఖ తనకు తెలసిన విద్యతో అతడి గురించిన వివరాలన్నే చెప్పింది స్నేహితురాలికి. తను త్వరగా వెల్లి అనిరుద్ధకుమారుడిని ఉషాకన్య దగ్గరికి తీసుకువస్తానని హామీ ఇచ్చింది.
ఇలా చెప్పిన చిత్రరేఖ ఆకాశగమనంలో శ్రీకృష్ణుడి పట్టణానికి వెళ్లింది. మారువేషంలో రాత్రివేళ ద్వారకా నగరంలో ప్రవేశించింది. అనిరుద్ధుడు తన గదిలో హంసతూలికా తల్పం మీద అలసిపోయి నిద్రపోవడం చూసి అతడిని సమీపించింది. తన యోగమహిమతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో ఉషాకన్య నివసించే మందిరానికి చేరుకొని ఆమె పాన్పుమీద అనిరుద్ధుడిని పడుకోబెట్టి వెళ్లిపోయింది. కొంతసేపటికి అంతఃపురంలో, ఉషాకన్య మందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడు నిద్ర మేల్కొని ఉషాకన్యను చూశా డు. విషయం అర్థమైంది. ఆమెను కౌగలించుకుని, సరసమైన మాటలతో వినోదపర్చి, మదన క్రీడలో ఆమెతో సుఖించాడు. రాత్రి-పగలు అనేది తెలియకుండా వారిద్దరూ భోగాలాలసులై కొంతకాలం సుఖించారు. వారి సంతోషానికి చిహ్నంగా ఉషాకన్య గర్భం దాల్చింది. పరిచారికలకు విషయం అర్థం కాలేదు కాని, ఆమె గర్భందాల్చిన సంగతి అర్థమైంది. బాణాసురుడికి ఈ విషయం చెప్పాడు. కోపోద్రిక్తుడైన బాణాసురుడు అనిరుద్ధుడిని నాగాపాశంతో బంధించాడు. కారాగారంలో పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద సుడిగాలి వీచి బాణుడి విశాలమైన ధ్వజం కూలి నేలమీద పడింది. తనకు సరైన జోడీతో యుద్ధం జరగ బోతున్నాడని బాణుడు సంతోషించాడు.
నారదుడి ద్వారా ఈ విషయమంతా తెలుసుకున్న కృష్ణుడు ఒక శుభ ముహూర్తాన బాణాసురుడి మీదికి దండయాత్రకు బయల్దేరాడు. వెళ్లీ-వెళ్లగానే శోణపురామ్ నగరాన్ని ధ్వంసం చేశారు యాదవ సైన్యం. శ్రీకృష్ణుడి దండయాత్ర తెలుసుకున్న బాణాసురుడు ఆయనమీదకు యుద్ధానికి వెళ్లాడు. ఆయన నగరానికి రక్షకుడుగా కాపలా వున్నా పరమ శివుడు బాణుడు యుద్ధానికి వెళ్లడం చూశాడు. బాణుడికి సహాయంగా ఆయన కూడా రణరంగానికి తరలి వెళ్లాడు. శివుడు, కృష్ణుడు ఒఅకరితో మరొకరు తలపడ్డారు. అయితే కృష్ణుడి శౌర్య ప్రతాపాలను శివుడు సహించలేకపోయాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు శివుడు. దాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా ఉపశమింప చేశాడు. వెంటనే శివుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని పర్వతాస్త్రంతో తుంచి వేశాడు కృష్ణుడు. ఆ తరువాత వేసిన ఆగ్నేయాస్త్రాన్ని కూడా ఐంద్ర బాణంతో రూపుమాపాడు. మహేశ్వరుడు కోపం ఆపుకోలేక శ్రీకృష్ణుడి మీద పాశుపతాస్త్రాన్ని సంధించి ప్రయోగించాడు. నారాయణాస్త్రాన్ని వేసి పాశుపతాస్త్రాన్ని వెనుకకు మరలించాడు శ్రీకృష్ణుడు. తన అస్త్రాలన్నీ నిష్ఫలం కావడంతో ఉత్సాహాన్ని కోల్పోయిన శివుడి మీద సమ్మోహనాస్త్రాన్ని వదలడంతో ఆయన సోలిపోయాడు. నందీశ్వరుడి మూపురం మీద వాలిపోయాడు శివుడు.
తక్షణమే శ్రీకృష్ణుడు వీరవిహారం చేస్తూ బాణాసురుడి సమస్త సైన్యాన్ని పరిమార్చాడు. ఇలా జరగడంతో క్రోధావేశంతో బాణాసురుడు తన రథాన్ని కృష్ణుడి మీదకు తోలాడు. కృష్ణుడితో గర్వం కొద్దీ తలపడ్డాడు తన వేయి చేతులతో. అయితే అతడు బాణ ప్రయోగం చేసే లోపునే కృష్ణుడు బాణుడి రథసారథిని చంపి, రథాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. కృష్ణుడి అఖండ పరాక్రమానికి బాణాసురుడు భయపడిపోయాడు. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తనకు జరిగిన అవమానానికి రాచనగరులోకి పారిపోయాడు.
సరిగ్గా ఆ సమయంలోనే శివ-కేశవుల మధ్య ‘జీవాయుథ యుద్ధం’ చోటు చేసుకుంది. మూడు తలల, మూడు పాదాల, భయంకరాకారం కలిగి, కోపావేశంతో ‘శివజ్వరం’ (శివుడి జీవాయుథం) కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అలా వచ్చిన దాన్ని చూసిన కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. వెంటనే (తన జీవాయుథమైన) ‘వైష్ణవజ్వరాన్ని’ ‘శివజ్వరం’ మీదికి ప్రయోగించాడు. శివవైష్ణవ జ్వరాలు రెండూ తమ బలాన్ని, శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్నీ ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేశాయి. భయంకరమైన వైష్ణవజ్వరం ముందు శైవజ్వరం ఓడిపోయి పారిపోయింది. వైష్ణవజ్వరం అంతటితో ఆగకుండా శైవజ్వరం వెంట పడి మరీ తరిమి కొట్టింది. అలా తరుముతుంటే శివజ్వరానికి పారిపోవడానికి ఏ దిక్కూ కనబడలేదు. దాంతో దానికి ప్రాణభీతి పట్టుకుని, కృష్ణుడి పాదాలమీద పడి తన్ను కాపాడమని వేడుకుంది. కృష్ణుడిని అనేక విధాల స్తుతించింది. అవ్యయడివి అనీ, పాపరహితుడివి అనీ, ఈశ్వరుడివి అనీ, సృష్టి-స్థితి-లయ కారకుడివి అనీ, పరబ్రహ్మ స్వరూపిడివి అనీ, ఆదిమధ్యాంతరహితుడివి అనీ అనేక విధాల స్తుతించి ‘నీవే శరణు నాకు’ అని వేడుకుంది శివజ్వరం. ఆ స్తోత్రానికి కృష్ణుడు-విష్ణుమూర్తి-శ్రీహరి ప్రసన్నమైనాడు. తన శరణు జొచ్చింది కాబట్టి తన వైష్ణవజ్వరం దాన్ని బాధించదని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు: ఎవరైనా ఈ శైవ-వైష్ణవ జ్వర వివాదాన్ని, శివజ్వరం శరణు కోరిన విధానాన్ని, మనస్సులో తలిస్తే వారికి చలిజ్వరం కాని, ఉష్ణజ్వరం కాని రావు. ఇలా శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ శివజ్వరం అనే జీవాయుథం పరమానందంతో పరమాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయింది.
ఇక్కడ శివకేశవ భేదాలు చూపించారని అనుకోవడం పొరపాటు. ‘శివాయ విష్ణురూపాయ’ అనే మాట యజుర్వేదంలో కనిపిస్తుంది. ఇది శివకేశవుల అభేదాన్ని తెలియచేస్తుంది. ‘శివ’ శబ్దానికి త్రిగుణాతీతుడు, శుభస్వరూపుడు అనే అర్థాలున్నాయి. ‘విష్ణు’ అంటే వ్యాపించినవాడు. త్రిగుణాతీతమైన, మంగళకరమైన ఈశ్వర చైతన్యం ‘శివుడు’ కాగా, విశ్వమంతా వ్యాపించితే ‘విష్ణువు’ అవుతుంది. అదే ‘శివాయ విష్ణురూపాయ’. శివకేశవులకు, శివపురాణం అనీ, విష్ణుపురాణం అనీ ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వారిరువురి అర్థం తెలిస్తే భేదభావం ఉండదు. భగవంతుడు కలహించడు. కలహం మతవాదుల మధ్యనే. ‘చేతులారంగ శివుని పూజించడేని’, ‘నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని’ అని అంటారు. అంటే: చేతులారా శివుని పూజించి, నోటితో హరికీర్తన చేయమంటూ పోతన పద్యకవితలోని అంతరార్థం ఇదే. శివుడు శ్రీరామనామరసికుడు, విష్ణు వల్లభుడు. ఒకరినొకరు గౌరవించుకున్నారంటే అర్థం, ఒకరికంటే ఇంకొకరు తక్కువనీ, ఎక్కువనీ కాదు. ఇద్దరూ సమానమేననీ, లోక నిర్వహణ కోసం రెండుగా వ్యక్తమైన ఒకే తత్త్వమని అర్థం.
ఇదిలా వుండగా యుద్ధరంగం నుండి పారిపోయిన బాణాసురుడు మరింత బలం చేకూర్చుకుని దివ్యాయుదాలను ధరించి, మళ్లీ యుద్ధం చేయాలన్న ఆలోచనతో, పట్టుదలతో కదన రంగానికి వచ్చాడు రెండో సారి. వచ్చీరావడంతోనే కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు ఆలశ్యం చేయకుండా తన సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. అది పోయి బాణుడు వేయి చేతులలో నాలుగు మాత్రం మిగిల్చి మిగిలిన వాటన్నింటినీ నరికి వేసింది. సుదర్శన చక్రం అలా బాణుడి చేతులు నరికి వేయగానే అతడి మీద వాత్సల్యం వున్నా పరమేశ్వరుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఆయన్ను స్తోత్రం చేశాడు పలుపలు విధాలుగా. శ్రీహరి-శ్రీకృష్ణుడు శివుడిని అభినందించి, ఆయన కోరికేదో చెప్పమన్నాడు. ఆయన ప్రియ భక్తుడైన బాణుడిని చంపడం లేదన్నాడు. అదే తన కోరికగా శివుడు చెప్పాడు.
తదనంతరం బాణాసురుడు శోణపురానికి పోయి తన కుమార్తె అయిన ఉషాకన్యకు, అనిరుద్ధుడికి బంగారు ఆభరణాలు ఇచ్చి, తీసుకువచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించాడు.
{మహాకవి బమ్మెర పోత నామాత్య ప్రణీత (రామ కృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ) శ్రీ మహాభాగ వతము, దశమ స్కందం ఉత్తర భాగం}

The post శివకేశవుల జీవాయుధ పోరాటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.