శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం!

Shreyas-Iyer

వెస్టిండీస్‌భారత్ రెండో వన్‌డే నేడే
ఈసారయినా వరుణుడు కరుణిస్తాడా?

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో మూడు వన్‌డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరగనున్న రెండో వన్‌డే కోసం భారత్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. తొలి వన్‌డే వర్షార్పణమైన నేపథ్యంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యత సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. కాగా వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో జట్టు తరఫున ఆడేందుకు అవకాశం దక్కని ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించడం ఖాయంగా భావిస్తున్నారు. నాలుగో స్థానంలో అతడ్ని ఆడించాలని జట్టు మేనేజిమెంట్ కూడా భావిస్తోందని అంటున్నారు. టి 20 సిరీస్‌లో ఆడేందుకు అవకాశం లభించని అయ్యర్ తొలి వన్‌డే మ్యాచ్‌కోసం తుది జట్టులో స్థానం సంపాదించినప్పటికీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. దీంతో రెండో వన్‌డేలో అతనికి తప్పకుండా అవకాశం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. రెండో వన్‌డేకు టీమిండియాలో పెదగా మార్పులు ఉండవని కూడా భావిస్తున్నారు. అదే నిజమైతే కెఎల్ రాహుల్ పెవిలియన్‌కే పరిమితమయ్యే అవకాశముంది.

శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్‌లో నిలకడైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను తన టాలెంట్ ఏమిటో నిరూపించుకుని జట్టులో స్థానాన్ని పదిలపర్చుకోవాలంటే వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లు చాలవనే విషయం అందరూ అంగీకరిస్తారు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలో అతను గనుక తన సత్తా నిరూపించుకుంటే ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుందనేది ఖాయం. వెస్టిండీస్‌లో పర్యటించిన ఇండియా ఎ జట్టు సభ్యుడిగా అయ్యర్ బాగానే రాణించాడు కూడా. కాగా ఈ సిరీస్ జట్టులో తన స్థానాన్ని పదిలపర్చుకోవాలనుకుంటున్న ఆల్‌రౌండర్ కేదార్ .జాదవ్‌కు కూడా చాలా ముఖ్యమే. దినేశ్ కార్తిక్ తర్వాత జాతీయ జట్టులో శాశ్వత స్థానం దక్కించుకోవాలని అనుకుంటున్న జాదవ్ అందుకు తగ్గ విధంగా రాణించ లేక పోవడం గమనార్హం. జట్టులో స్థానంకోసం శుఖ్‌మన్ గిల్ లాంటి యువ బ్యాట్స్‌మెన్ ఎదురు చూస్తున్న తరుణంలో జాదవ్ తన టాలెంట్‌ను నిరూపించుకోలేక పోతే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆఫ్ స్పిన్నర్‌గా ఫరవాలేదనిపించినప్పటికీ జట్టులో ఇప్పటికే రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌ల ఉన్న నేపథ్యలో మూడో స్పిన్నర్‌కు ఎంతమేరకు అవకాశం ఉంటుందో వేచి చేడాలి. ఒక వేళ భువనేశ్వర్ ప్రసాద్‌కు విశ్రాంతి ఇచ్చే పక్షంలో నవ్‌దీప్ సైనీకి అవకాశం దక్కవచ్చు. ఇక వెస్టిండీస్ సెలెక్టర్లు టెస్టు మ్యాచ్‌లకోసం క్రిస్ గేల్‌ను ఎంపిక చేయని నేపథ్యంలో భారత్‌తో జరగనున్న రెండు వన్‌డేలే గేల్ చివరి మ్యాచ్‌లు కానున్నాయి. అన్నిటికి మించి వాతావరణం అనుకూలించి పూర్తి మ్యాచ్ జరిగితేనే రెండు జట్లు పూర్తి సామర్థాన్ని ప్రదర్శించే అవకాశం ఇప్పుడైనా దక్కుతుంది. అయితే ఆదివారం వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని నిర్వహకులు తెలిపారు.

Shreyas Iyer Opportunity in West Indies Second ODI match

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.