బిజెపికి ఎన్.ఆర్.సి. షాక్!

  కొంత కాలంగా బిజెపి పట్టిందల్లా బంగారం అవుతున్నది. ఎన్నికల నుండి, ఆర్టికల్ 370 రద్దు వరకు ఎటువంటి తీవ్ర చర్యకు పాల్పడినా అడ్డే ఉండటం లేదు. ప్రశ్నించే వారే లేరా అన్నంతగా పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన అసోం ‘జాతీయ పౌర జాబితా’ (ఎన్‌ఆర్‌సి) తుది జాబితా ప్రకటించేసరికి ఆ పార్టీకి అనూహ్యంగా పరిస్థితులు ఒకేసారి ప్రతికూలంగా మారాయి. అసోంలోనే కాదు దేశ వ్యాప్తంగా అటువంటి జాబితాలు ప్రకటిస్తామని చెప్పుకొంటూ […] The post బిజెపికి ఎన్.ఆర్.సి. షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొంత కాలంగా బిజెపి పట్టిందల్లా బంగారం అవుతున్నది. ఎన్నికల నుండి, ఆర్టికల్ 370 రద్దు వరకు ఎటువంటి తీవ్ర చర్యకు పాల్పడినా అడ్డే ఉండటం లేదు. ప్రశ్నించే వారే లేరా అన్నంతగా పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన అసోం ‘జాతీయ పౌర జాబితా’ (ఎన్‌ఆర్‌సి) తుది జాబితా ప్రకటించేసరికి ఆ పార్టీకి అనూహ్యంగా పరిస్థితులు ఒకేసారి ప్రతికూలంగా మారాయి.

అసోంలోనే కాదు దేశ వ్యాప్తంగా అటువంటి జాబితాలు ప్రకటిస్తామని చెప్పుకొంటూ వచ్చిన బిజెపి నేతలకు ఇప్పుడు మాటలు కరువయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి చోట్ల ఆ పార్టీ నేతలు అటువంటి మాటలు అంటున్నా ఎన్నికల ముందు ప్రధానంగా ఈ నినాదం చేపట్టిన హోం మంత్రి అమిత్ షాకు ఇప్పుడు నోటమాట రావడం లేదు. ఏ నినాదం ఆధారంగా అసోంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చామో ఇప్పుడు అదే నినాదం తమకు ఎక్కడ ప్రతికూలంగా మారుతుందో అనే ఆందోళనలు ఆ పార్టీ నేతలలో వ్యక్తం అవుతున్నాయి.

అసోంలో మొత్తం 3.30 కోట్ల మంది దరఖాస్తు చేయగా 3.11 కోట్ల మందిని భారతీయులుగా గుర్తించారు. మిగతా 19 లక్షల మందికి పౌరసత్వ గుర్తింపు దక్కలేదు. అయితే వీరిలో అత్యధికులు హిందువులుగా ఉండటం ఆ పార్టీ ఊహించని పరిణామం. ఎన్నికల ప్రచార సభలలో, అంతకు ముందు, చివరకు పార్లమెంట్ లో సహితం 40 నుండి 60 లక్షల మంది వరకు విదేశీయులు అసోంలో సాధికారికంగా పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారని బిజెపి నేతలు వాదిస్తూ వచ్చారు. వారే కాదు గతంలో కాంగ్రెస్ నేతలు సహితం అటువంటి ప్రకటనలు చేశారు.

వీరందరి దృష్టిలో ‘విదేశీయులు’ అంటే ముస్లింలు. వారంతా అక్రమంగా బంగ్లాదేశ్ నుండి అసోంలోకి ప్రవేశించి, పలు ప్రాంతాల జనాభాలో, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని, వారు భారత దేశ పౌరులుగా వ్యవహరిస్తూ మన రాజకీయ వ్యవస్థపై కూడా ఆధిపత్యం వహిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. కేంద్రం లో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ పౌరసత్వ జాబితా తయారీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడు అసోం మంత్రి హిమం తా బిస్వాల్ శర్మ ఆరోపిస్తున్నారు. హనుమాన్, కృష్ణ, రామ, విష్ణువు వంటి దేవతలను ఆరాధించే వారి పేర్లను ఒక పద్ధతి ప్రకారం పౌరసత్వ జాబితాలో లేకుండా చేశారని మండిపడుతున్నారు.

అనేక మంది ‘విదేశీయులు’ నకిలీ గుర్తింపు పత్రాలు పొంది పౌరసత్వ జాబితాలో తమ పేర్లను చేర్చుకో గలిగారని వాదిస్తున్నారు. మరోవంక పౌరసత్వానికి అన్ని రకాల అర్హతలు గల హిందువులను అధిక సంఖ్యలో పక్కన పెట్టి వేసిన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ‘శరణార్ధుల’ పత్రాలను సహితం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంత తక్కువ సంఖ్యలో – 20 లక్షల కన్నా తక్కువగా పౌరులు కాని వారు తేలడం, వారిలో అత్యధికులు హిందువులు ఉండటం చూసి ఇప్పుడు ఏదో పెద్ద కుట్ర పూరిత వ్యవహారం జరిగిన్నట్లు అనుమానిస్తున్నారు. అధికారికంగా ఈ జాబితాలో మతాల వారీ వివరాలు ప్రకటించక పోయినప్పటికీ అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో తగు మార్పులు చేయలేని పక్షంలో అసోంలో తమ పునాదులు కదిలిపోగలవని భయపడుతున్నారు.

బంగ్లాదేశ్ నుండి వచ్చిన ‘చొరబాటుదారుల’ కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం 2016లో అసోంలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించింది. 2014, 2019 లోక్ సభ ఎన్నికలలో సహితం ఆ రాష్ట్రం నుండి బిజెపి అత్యధిక స్థానాలను గెలుపొందడానికి దారి తీసింది. కానీ ఈ జాబితా ఆయా ప్రచారాన్ని తలకిందులు చేస్తున్నది. సుప్రీంకోర్ట్‌కు విన్నవించుకున్నా చెప్పుకోదగిన ప్రయోజనం కలిగే అవకాశం కనిపించడం లేదు. అందుకనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి తమను ఆదుకోవాలని అసోం బిజెపి నేతలు కోరుతున్నారు. ఈ జాబితాపై ఇప్పటి వరకు ప్రధాని గాని, హోం మంత్రి గాని పెదవి విప్పక పోవడం గమనార్హం.

అసోంలో బిజెపి ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించడానికి ముందు రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యం వహించిన కాంగ్రెస్, అసోం గణ పరిషద్ సహితం ఈ అంశం పైననే ప్రజా మద్దతు పొందగలిగాయి. విశిష్టమైన సాంస్కృతిక నేప థ్యం, సహజమైన వనరులతో గల అసోంలో వలసలు బ్రిటిష్ కాలంలోనే ప్రారంభం అయ్యాయి. బ్రిటిష్ పాలకులకు ఈ ప్రాంతం మంచి ఆదాయం సమకూరుస్తూ ఉండెడిది. అందుకనే అక్కడ పని చేయడం కోసం బయట ప్రాంతాల నుండి కూలీలుగా, ఉద్యోగులుగా తీసుకు వస్తూ ఉండేవారు.

ఇంగ్లీష్ బాగా మాట్లాడే బెంగాలీ యువత బ్రిటిష్ కాలంలో ఇక్కడకు పెద్ద ఎత్తున రావడం ప్రారంభమైనది. పాలనా యంత్రంగంలో వారిదే ఆధిపత్యంగా ఉండెడిది. స్థానికుల నుండి ప్రతిఘటనలు ఎదురైనా, అస్సామీ- బెంగాలీ ప్రజల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నా బ్రిటిష్ వారు తమ విధానాన్ని మార్చుకో లేదు. 1971లో బంగ్లాదేశ్ అవతరించడానికి కొద్ది కాలం ముందు అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రజలు అసోంకు వలస రావడం ప్రారంభమైనది. వచ్చి భారీ సంఖ్యలో వలసలు ఏర్పాటు చేసుకొంటూ వచ్చారు. 1960, 1970 దశకంలలో సుమారు కోటి మంది ప్రజలు ఆ విధంగా వచ్చారని ఒక అంచనా.

బెంగాలీ మాట్లాడే ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ రాజకీయ, సామాజిక జీవనాలపై తమ ప్రభావం పెంచుకొంటూ వచ్చారు. అయితే ఈ వలసలకు వ్యతిరేకంగా అల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) ఆధ్వర్యంలో 70వ దశకం చివరి నుండి పెద్ద ఆందోళన చెలరేగింది. దానితో నూతన విద్యార్థి, యువ నాయకత్వం అసోం రాజకీయాలపై ప్రభావం చూపు తూ వచ్చింది. అక్రమంగా వచ్చిన వలసదారులు ఓటర్లుగా నమోదవుతూ, అసలు స్థానికులను పక్కకు నెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రధానంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఉద్యమం కారణంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం వలసలపై దృష్టి పెట్టవలసి వచ్చింది. ఈ విధంగా వలస వచ్చిన వారిని రెండు విధాలుగా పరిగణిస్తూ వచ్చారు.

బంగ్లాదేశ్‌లో వేధింపులకు, దాడులకు గురయి ప్రాణ రక్షణ కోసం వచ్చిన హిందువులను శరణార్థులుగా పరిగణిస్తే; ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా వలస వచ్చిన వారిని ‘అక్రమ వలసలు’గా పేర్కొంటూ వస్తున్నారు. హిందువులకు పౌరసత్వం కల్పిస్తూ, అక్రమ వలసలుగా వచ్చిన వారిని వెనుకకు పంపించి వేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయమై నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ తీసుకొని, విద్యార్థి నేతలతో నేరుగా సమాలోచనలు జరిపి 1985లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అక్రమ వలస వచ్చిన వారందరిని పదేళ్లలో గుర్తించి, వెనుకకు పంపించి వేయాలి. కానీ అప్పటి నుండి ఆ దిశలో చెప్పుకోదగిన కృషి జరగనే లేదు. కనీసం అక్రమ వలస వచ్చిన వారిని గుర్తించడం కూడా సాధ్యం కాదు.

ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలస వచ్చిన వారికి అండగా ఉంటూ యునైటెడ్ మైనారిటీస్ ఫ్రంట్‌ను మాజీ కాంగ్రెస్ నేత కలిపాడా సేన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఈ అంశం రాజకీయ వివాదాలలో చిక్కుకు పోయింది. అక్రమ వలసల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తున్న ఒక బృందం 1985 ఎన్నికలలో 17 అసెంబ్లీ సీట్లు గెలుపొందడం మరింత ఆందోళన కలిగించింది. రాజకీయ ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు చెలరేగుతూ వచ్చాయి. ఆసు నేతలు అసోం గణ పరిషద్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఎన్నికలలో పోటీ చేయడం, రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడంతో అక్రమ వలసలు ఒక తీవ్రమైన రాజకీయ సమస్యగా మారింది. ఈ సమస్యను తిరిగి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ 2005 లో లేవనెత్తారు. ఆయన వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన విద్యార్థి నేత ప్రఫుల్ కుమార్ మహంతాను గద్దె దించి, గొగోయ్ అధికారంలోకి రావడం గమనార్హం.

దేశ స్వాతంత్య్రం తొలి రోజులలో 1951లో తయారు చేసిన పౌరసత్వ రిజిస్టర్ ను తాజా సమాచారంతో తిరిగి రూపొందించాలని కోరు తూ గొగోయ్ ఆనాటి ప్రధాని మన్ మోహన్ సింగ్ కు లేఖ వ్రాశారు. 2011లో పైలట్ ప్రాజెక్ట్ గా రెండు చోట్ల జాబితా తయారు చేపట్టగా ఘర్షణలు చెలరేగడం, బార్పేట్‌లో ఒక ముస్లిం మృతి చెందడంతో ఆగిపోయింది. జాతీయ పౌరసత్వ జాబితా తయారీకి అనుసరించవలసిన విధి విధానాలు రూపొందించడం కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం రెండు బృందాలను ఏర్పాటు చేసింది. అసోంలో రాజకీయంగా ఆధిపత్యం వహించడం కోసం ఈ నినాదాన్ని బిజెపి తాజాగా చేపట్టింది. ‘బయటవారిని’ గుర్తించి, వెనుకకు పంపించివేస్తాం అంటూ చెబుతూ వస్తున్నది. ఈ లోగా సుప్రీం కోర్ట్ లో సత్వరం ఈ జాబితాను తయారు చేయాలని కోరుతూ ఒక ప్రజా వ్యాజ్యం (పిల్) దాఖలు కావడంతో అప్పడి నుండి నేరుగా కోర్ట్ ఈ పక్రియను పర్యవేక్షిస్తూ వస్తున్నది.

కేంద్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 2005 నుండి 2013 వరకు 82,728 మందిని వెనుకకు పంపించి వేశామని కాంగ్రెస్ చెప్పుకొంటున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి 2017 వరకు కేవలం 1,822 మందిని మాత్రమే వెనుకకు పంపినట్లు కాంగ్రెస్ చెబుతున్నది. మరి రెండేళ్లలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ జాబితా బిజెపికి రాజకీయంగా సంకట పరిస్థితులనే సృష్టిస్తున్నది. బిజెపికి మద్దతుగా ఉంటూ వస్తున్న హిందువుల నుంచి ఎక్కడ ఆగ్రహావేశా లు ఎదుర్కోవలసి వస్తుందో అని ఆందోళన చెందుతున్నది.

Shocked to see genuine Indians left out of NRC list

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిజెపికి ఎన్.ఆర్.సి. షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: