ఆదర్శగ్రామం శని శింగణాపూర్

శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేక మైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శనిశింగణాపూర్. షిర్డికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. నేను షిర్డి వెళ్లి నపుడు శని శింగణాపూర్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. షిర్డి నుంచి శనిశింగణాపూర్‌కి టాక్సీలు అందుబాటులో ఉంటాయి. చాలా మంది టాక్సీలలోనే అక్కడకు చేరుకుంటారు. దాదాపు గంటన్నర ప్రయాణం చేసిన తరువాత శనిశింగణాపూర్ చేరుకున్నాను.

Shani shingnapur
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నెవాసా తాలుకాకు చెందిన ఓ సుందరగ్రామమే ఈ శనిశింగణాపూర్. చూసేందుకు ఓ చిన్న గ్రామంగా ఉన్నా శనిశింగణాపూర్‌కు ఎన్నో విశిష్టతలున్నాయి. ఓ ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం కేవలం శనీశ్వరుని ఆలయం వల్లే కాకుండా ఆచార వ్యవహారాలు, గ్రామ కట్టుబాట్ల విషయంలో ఆదర్శంగా నిలిచింది.
గ్రామంలోకి వెళ్లగానే అక్కడి ఇళ్లను చూసి ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయట. జనాభా సుమారుగా ఐదువేలు.. ఇంతకీ విచిత్రమేమంటే ఇక్కడ ఏ ఇంటికీ తలుపులు లేవు. ఈ గ్రామంలో కొలువైన శనీశ్వరుడు తమను నిత్యం వెన్నంటి కాపాడుతుంటాడని, అలాంటపుడు తలుపులెందుకని ఇక్కడి ప్రజలు విశ్వాసంగా చెప్పడం నాకు బలే ఆశ్చర్యంగా అనిపించింది.
శని శింగణాపూర్ క్షేత్రం ఒకప్పుడు ఓ చిన్ని గ్రామమే అయినప్పటికీ, అనంతరంతర కాలంలో శని దేవుని లీలా విశేషాల ఫలితంగా నేడు దేశంలోనే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
ప్రధానాలయ ప్రాంగణం నిత్యం భక్తులతో సందడిగా ఉంది. ఆలయ ప్రాంగణంలో ముందు భాగంలో ఓ త్రిశూలం దర్శనమిస్తుంది. స్వామి వారికి కొబ్బరికాయలు, నల్లవస్త్రాలు, తదితర పూజాద్రవ్యాలు సమర్పించుకునే భక్తులు ఈ త్రిశూలం చెంతనే ఆయా వస్తువులను సమర్పించుకుంటారు.
శనిశింగణాపూర్‌లో శనిదేవుడ్ని దర్శించుకునే పురుష భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించుకోవాలన్న నియమం ఉంది. ఆ కారణంగా ఆలయ ప్రవేశం చేసే ప్రతి భక్తుడు కాషాయ వస్త్రాలు ధరించి స్వామి వారి దర్శనానికి బయలుదేరుతారు.

స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పురాణగాధ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం శనిశింగణాపూర్‌లోకి ప్రవేశించే పణస్వాణాకు విపరీతంగా వరదలొచ్చాయట. ఆ వరదల్లో ఓ దివ్యమైన విగ్రహం కొట్టుకుని వచ్చిందట. కొట్టుకొచ్చిన ఆ విగ్రహం గ్రామంలోని ఓ పరిమి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన యువకులు పరిమిచెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని కదపడానికి కదిపే ప్రయత్నం చేశారట. అయితే ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన యువకులు వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారట. గ్రామపెద్దలు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమ య్యారట. ఆ రాత్రికి శనిదేవుడు ఓ భక్తుని కలలో కనిపించి, తాను ఆ గ్రామంలో ఉన్నానని తనను వెలికితీసి ప్రతిష్టించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు ఓ ఎడ్ల బండిని అక్కడకు తీసుకుని పోయి విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేయగా అది కదల్లేదట. దాంతో ఆ భక్తుడు తిరిగి వెళ్లిపోయాడట. ఆ రాత్రికి తిరిగి శనిదేవుడు కలలో కనిపించి మేనమామ, మేనల్లుడు వరసయ్యే వారు వెళ్లి విగ్రహాన్ని వెలికితీస్తే అది బయటకు వస్తుందని చెప్పాడట.
ఆ భక్తుడు తిరిగి స్వామి చెప్పినట్టుగానే చేసి విగ్రహాన్ని వెలికి తీయించి ప్రతిష్టించాడట. శనిశింగణాపూర్‌లో కొలువైన శనీశ్వరుడు ఆరుబయటే కొలువై ఉంటాడు. నల్లని రాతితో దాదాపు శివలింగం ఆకారంలో ఉండే శింగణాపూర్ శనీశ్వరుడు 16 అడుగుల 16 అంగుళాల పొడవు, 3 అడుగుల వెడల్పు గల సమ చతుర్భుజ ఆకారంలో నిర్మితమైన ఓ ప్లాట్‌ఫారంపై కొలువైఉన్నాడు. దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉండే శనీశ్వరుని విగ్రహం ఎప్పుడూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది.
ఇక్కడ ఈ ఆలయంలో శనీశ్వరుని దర్శించి తైలాభిషేకం జరిపిస్తే స్వామివారి అనుగ్రహం కల్గుతుందని అక్కడి చాలా మంది నాకు స్వయంగా చెప్పారు. ఈ ఆలయంలో మహిళలకు కూడా ప్రవేశం ఉన్నా స్వామివారిని ప్రతిష్టించిన వేదికను వారు తాకరాదనే నిబంధన ఉంది.
శనిదేవుని ప్రతిమకు ఎదురుగా పురాతనమైన ఓ రావి చెట్టు ఉంది. అత్యంత మహిమాన్వితమైన వృక్ష రాజంగా పేర్గాంచిన ఈ చెట్టు నీడ శనిదేవుని ప్రతిమపై పడకపోవడం శనిదేవుని లీలా విశేషంగా చెబుతారు. సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద ఓ వివాహం జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగి చెట్టు తగలబడి పోయిందట.
అయినప్పటికీ ఆనాటి నుంచి ఈ చెట్టు తన పచ్చదనాన్ని కోల్పోలేదని, ఇది శనిదేవుని లీలా విశేషమని అక్కడి వారు చెప్పారు. ఆ కారణంగానే ఈ చెట్టుకి భక్తులు పూజాదికాలు నిర్వహించడం నేను స్వయంగా చూశాను.
ఈ చెట్టు చెంతనే వెండి పాదాలు ఉన్నాయి. ఇవి శనిదేవుని పాదాలుగా భక్తులు చెబుతారు. శనిదేవుని ప్రతిమకు సమీపంలో ఆంజనేయస్వామి వారి ప్రతిమ ఉంది. శని అంటని దేవుడు ఆంజనేయ స్వామి కావడం వల్ల ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని కూడా భక్తితో దర్శించుకుంటారు.
ఇదే ఆలయ ప్రాంగణంలో ఉదాశీమహరాజ్ ఆలయ సముదాయం ఉంది. ఉదాశీ మహరాజ్ శనిదేవుని భక్తుడు. ఇక్కడే మరోపక్క విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, పాండురంగడు, పరమేశ్వరుడు, దుర్గామాత తదితర దేవీదేవతల చిన్ని మందిరాలను దర్శించుకోవచ్చు.
పర్వదినాలు, ఉత్సవాలు : శనిశింగణాపూర్‌లోని శనీశ్వరునికి జరిగే పూజా విధానం కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య మరుసటి రోజు చంద్రోదయం రోజున ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తారు.
అలాగే శని త్రయోదశి, శని జయంతి రోజుల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడులాడుతుంది. ఆయా రోజుల్లో శనీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి?

ఈ దివ్య క్షేత్రం మహారాష్ట్రలోని షిర్డి పుణ్య క్షేత్రానికి సుమారు 75 కిలోమీటర్ల్ల దూరంలో ఉంది. ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి మన్మాడ్ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే షిర్డి నుంచి కూడా నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఆయా ప్రదేశాల నుంచి అనేక ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

– దాసరి దుర్గాప్రసాద్
77940 96169

shani shingnapur history in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆదర్శగ్రామం శని శింగణాపూర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.