అంతర్గత ‘తీర్పు’!

  న్యాయం చేయడమేకాదు, న్యాయం జరిగిందనే అభిప్రాయం దృఢంగా నెలకొనేలా చూడవలసిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీద ఉంటుం ది. ఆరోపణ ఎటువంటిది, ఎవరు చేసినది అయినా సత్య శోధన కూలంకషంగా జరిగినప్పుడే అనుమాన శకలం మిగలడానికి కూడా ఆస్కారం కలగదు. ఆరోపించిన వారు కూడా ఔనని తల ఊపేలా న్యాయ పరిష్కారం ఉండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణను విచారించిన జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే అంతర్గత కమిటీ […] The post అంతర్గత ‘తీర్పు’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యాయం చేయడమేకాదు, న్యాయం జరిగిందనే అభిప్రాయం దృఢంగా నెలకొనేలా చూడవలసిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీద ఉంటుం ది. ఆరోపణ ఎటువంటిది, ఎవరు చేసినది అయినా సత్య శోధన కూలంకషంగా జరిగినప్పుడే అనుమాన శకలం మిగలడానికి కూడా ఆస్కారం కలగదు. ఆరోపించిన వారు కూడా ఔనని తల ఊపేలా న్యాయ పరిష్కారం ఉండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణను విచారించిన జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే అంతర్గత కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం హర్షించవలసిన విషయమే. దీనివల్ల దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తికి కళంకం అంటలేదనే సంతృప్తి కలుగుతుంది. అయితే ఈ కేసులో తల ఎత్తిన అనేక అనుమానాలు మాత్రం ఈ నిర్ధారణతో నివృత్తి కాలేదనే అభిప్రాయానికి తావు కలగడమే ఆందోళనకరం. ఇది ఎంత మాత్రం సంతోషించివలసిన విషయం కాదు. సమగ్ర విచారణ తర్వాత కమిటీ ఎటువంటి అభిప్రాయానికి వచ్చినప్పటికీ అది దర్యాప్తు జరిపిన తీరు నిరాక్షేపణీయంగా ఉండాలి. అలా లేనప్పుడు దాని నిర్ధారణ మీద సైతం నీలి నీడలు పరుచుకుంటాయి. అంతర్గత కమిటీ నివేదిక బహిర్గత పర్చడానికి వీల్లేదని అంటున్నారు. అటువంటప్పుడు నివేదికలోని హేతుబద్ధత ప్రజల, నిపుణుల పరిశీలనకు అందదు. అంతర్గత కమిటీ ఏమి చెప్పిందో అదే వాస్తవంగా భావించక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. సిజెఐ అధికార నివాసంలో ఉద్యోగినిగా ఉన్న తనను గొగోయ్ కౌగిలించుకున్నారని తాను సహకరించకపోడంతో కొలువు నుంచి తొలగించారని, ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఉండిన తన భర్తను, పోలీసుగా విధులు నిర్వహిస్తూ ఉండిన అతడి సోదరుడిని ఉద్యోగాల నుంచి తప్పించారని, సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంటుగా పని చేస్తూ వచ్చిన తన బావమరిదికి తప్పుడు ఆరోపణతో ఉద్వాసన చెప్పారని ఫిర్యాదుదారైన మహిళ ఆరోపించారు. ఈ ఆరోపణల లోతులు పరిశీలించిగాని గొగోయ్‌ని దోషిగాగాని, నిర్దోషిగాగాని ప్రకటించడం సబబుకాదు. అలాగే ఢిల్లీ తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ తనను గొగోయ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన భార్య పాదాల మీద పడవేశాడని కూడా ఆమె ఆరోపించారు. ఈ విషయాలన్నింటిలోని సత్యాసత్యాలు తేల్చాలంటే ఆమెను సమగ్రంగా విచారించి ఉండవలసింది. కాని విచారణ ప్రక్రియ మధ్యలోనే ఆమె దానికి దూరమైనట్టు స్పష్టపడుతున్నది. జరిగినట్టు తాను ఆరోపించిన ఘటన గురించి తన వివరణను ఇచ్చుకోడానికి తగిన వాతావరణాన్ని అంతర్గత కమిటీ కల్పించలేదని, తన తరపున న్యాయవాదిని నియమించుకొనే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అందులోని నిజానిజాలేమైనప్పటికీ ఆమె హాజరు కావడం మానుకున్న తర్వాత ఆమె పరోక్షంలోనే విచారణను పూర్తి చేసి అంతర్గత కమిటీ తన నివేదిక సమర్పించినట్టు తెలుస్తున్నది. తనను గొగోయ్ భార్య పాదాల మీద పడేసినట్టు తాను చెబుతున్న పోలీసు అధికారినైనా విచారించారో లేదో తెలియదని ఆమె అంటున్నారు. ఒకవేళ ఆమె దురుద్దేశంతోనే సహకరించి ఉండకపోతే ఆ విషయం నలుగురికీ ఎరుక అయ్యేలా చేయడానికి విచారణను మరి కొంత కాలం సాగదీసి ఉండినా బాగుండేది. అలా జరగనందున కమిటీ ఆదరాబాదరాగా రంజన్ గొగోయ్‌కి క్లీన్‌చిట్ ఇచ్చిందా అనే అనుమానం తల ఎత్తుతుంది. కమిటీ ముందు హాజరైన గొగోయ్ భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని కళంకిత పరచడం కోసం, తద్వారా దానిని నిర్వీర్యం చేయడం కోసమే తనపై ఈ ఆరోపణను కుట్రపూరితంగా చేశారని చెప్పినట్టు వార్తలు తెలియజేస్తున్నాయి. ఆయన ఇంతకు ముందు మాదిరిగానే తనపై ఆరోపణ చేసిన మహిళ క్రిమినల్ రికార్డు కలిగిన వ్యక్తి అని మళ్లీ అన్నట్టు సమాచారం. గొగోయ్ ఏ తప్పూ చేయలేదని, ఆమెవన్నీ నిరాధార ఆరోపణలేనని కమిటీ పేర్కొన్నది. కమిటీ ఏమి చెబితే దానినే అందరూ నమ్మవలసిన పని లేదు, ఆ మేరకు కూలంకష విచారణ జరిగిందనే అభిప్రాయం కలిగినప్పుడు తప్ప. అటువంటి అభిప్రాయం కలిగించారని అనుకోడానికి తగిన ఆధారాలు కనిపించడం లేదు. ఆమె పరోక్షంలో విచారణ నడిపించడం సుప్రీంకోర్టుకు అప్రతిష్ఠ తెస్తుందని హెచ్చరిస్తూ మరో న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ నెల 2వ తేదీన అంతర్గత కమిటీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన, మరో న్యాయమూర్తి నారిమన్ ఈ సందర్భంగా కమిటీలోని జస్టిస్ బోబ్డేను కలుసుకున్నారన్న వార్తను సుప్రీంకోర్టు ఖండించింది కాని ఇటువంటి లేఖ రాశారన్న సమాచారాన్ని మాత్రం త్రోసిపుచ్చలేదు. ఇన్ని అపసవ్యాల పుట్టగా విచారణ జరిగిందనే అభిప్రాయం తొలగనంతవరకూ గొగోయ్‌కి ఈ కమిటీ ఇచ్చిన క్లీన్ చిట్ మీద మబ్బులు చెదిరిపోవు.

Sexual Harassment against Chief Justice Ranjan Gogoi

The post అంతర్గత ‘తీర్పు’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.