లింగ నిష్పత్తి దుస్థితి…

Sex Ratio

 

భారత దేశ జనాభా ఏడెనిమిదేళ్లలో చైనాను మించిపోతుందని, అమెరికా జన సంఖ్యకంటే పదింతలవుతుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో దేశంలో జననాల రేటు తగ్గిందన్న తాజా సమాచారం ఊరట కలిగించకమానదు. అలాగే మరణాల రేటు కూడా తగ్గడం హర్షదాయకం. అదే సమయంలో మగ శిశువులతో పోల్చుకుంటే ఆడ శిశువుల జననం (లింగ నిష్పత్తి) దిగజారడం ఆందోళన కలిగించే అంశం. శాస్త్ర విజ్ఞాన స్పృహ, సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటు మానవాళి ప్రగతికే కాకుండా దుర్గతికి కూడా దోహదపడతాయని జననాల రేటు, లింగ నిష్పత్తి రెండూ తగ్గడంలో మనకు స్పష్టపడుతుంది.

పరిమిత కుటుంబ స్పృహ పెరగడంతో పాటు పుట్టేవారు ఆడో, మగో పిండ దశలోనే తెలుసుకోడానికి కలిగిన సదుపాయం స్త్రీ శిశువులను గర్భంలోనే కడతేర్చే దుర్మార్గానికి తెర లేపింది. పర్యవసానంగా మహిళల జననాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది సమాజానికి అత్యంత ప్రమాద హెచ్చరిక. 20152017 మధ్య ప్రతి వెయ్యి మంది మగ శిశు జననాలకు ఆడ శిశు జననాలు 896 గా నమోదయ్యాయి. ఇది ఇంత వరకు ఎన్నడూ లేనంత అధమ స్థాయి లింగ నిష్పత్తి. దేశంలో జననాల రేటు 2-013 నుంచి ఒకే విధంగా 2.3 గా కొనసాగింది. అది 2017లో 2.2 కి తగ్గింది. తరానికి తరానికి ఉండవలసిన 2.1 భర్తీ రేటుకు చేరువయింది.

స్త్రీ శిశు జననాన్ని నిరుత్సాహపర్చడమనే దారుణం ఎన్ని విధాలుగా అడ్డుకొన్నా ఆగడం లేదు. బేటీ బచావో (ఆడ శిశు రక్షణ) వంటి కార్యక్రమాలకు విశేష ప్రచారం ఇవ్వడమే తప్ప ఆచరణలో దానిని పాటిస్తున్న జాడ లేదని రుజువవుతున్నది. ఒక సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలోనే ఆడ శిశు జననాన్ని తప్పించడం కోసం 31 సంవత్సరాల ఒక మహిళకు ఆమె అత్తవారు 7 సార్లు గర్భస్రావం చేయించారు. ఎనిమిదవసారి మగ శిశువును కనబోతున్నట్టు రూఢి కావడంతో వరుస గర్భస్రావాల వేదన నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇలాగే కనబోయేది ఆడ శిశువునే అని నిర్ధారణ అయిన తర్వాత వరుసగా 3, 4, 5 అంతకంటే ఎక్కువ సార్లు గర్భ స్రావాలు చేయించబడ్డ మహిళల కథనాలు వార్తలకెక్కుతున్నాయి.

చట్ట ప్రకారం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు జరపడానికి వీల్లేదు. కాని ఈ చట్టం అమలు ఆనవాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇలా తరచూ గర్భస్రావాల వల్ల ఆ మహిళలు తీవ్రమైన వేదనకు, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. దేశంలో మహిళల దుస్థితికి ఇంతకంటే బలమైన నిదర్శనమక్కర లేదు. దేశంలో లింగ నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుష జననాలకు స్త్రీ జననాల రేటు) 2011 13 మధ్య 909గా నమోదు కాగా, 201517 నాటికి 896కి పడిపోయింది.

ముఖ్యంగా హర్యానా, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ పతనం దారుణంగా ఉంది. విచిత్రమేమంటే గతంలో లింగ నిష్పత్తి ఎక్కువగా, బాగా ఉన్న కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా తగ్గుదల నమోదయింది. కేరళలో 201214లో లింగ నిష్పత్తి 974గా నమోదు కాగా, 201517 నాటికి 948కి దిగజారింది. అలాగే 2011 13 మధ్య ఒడిశాలో 956గా ఉన్న లింగ నిష్పత్తి 201517 నాటికి 929కి తగ్గిపోయింది. ఒక సమాజంలో లేదా దేశంలో స్త్రీ శిశు జననాల రేటు దాని ప్రగతిని, మానవ వికాసాన్ని సూచిస్తుంది. ఎంత మంది ఎక్కువ ఆడ శిశువుల పుట్టుకను, పెరుగుదలను, అభివృద్ధిని ఆ సమాజం ప్రోత్సహిస్తుందో అది అంతగా ప్రవర్ధమానమవుతున్నదని అర్థం.

ఇప్పుడు మన దేశంలో లింగ నిర్ధారణ సాంకేతికతను చట్ట విరుద్ధంగా దొడ్డి దారిలో ఉపయోగించుకొని గర్భంలోనే ఆడ బిడ్డలను కడతేరుస్తున్న తీరు మనం రానురాను మధ్య యుగాల నాటి అమానుష పోకడలను అలవర్చుకుంటున్నామని చాటుతున్నది. ఆడ పిల్లను కనే తల్లులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఈ దుర్మార్గం ఆగడం లేదు. మగ శిశువును  వంశోద్ధారకుడుగా, సంపాదించి పోషించే వాడుగా చూసి ఆడ బిడ్డను పోషణ భారంగా భావించే ధోరణి సమాజంలో పాతుకుపోయింది.

పెంచి పోషించడమే కాకుండా కట్న కానుకలిచ్చి పెళ్లి చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులపై పడుతుండడంతో ఆమెను ద్వితీయ శ్రేణి వ్యక్తిగానే చూస్తున్నారు. మన సంస్కృతిలోని, సామాజిక జీవన విధానంలోని ఈ అమానుషం, అసమ అన్యాయ దృక్పథం తొలగనంత వరకు లింగ నిష్పత్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో మరింత దిగజారుతుందేగాని ఎగబాకదు. ఆడ పిల్లను చదివించి సంపాదనపరురాలుగా చేసినా ఆమెకు మగ వాడితో సమానమైన సామాజిక గుర్తింపు లభించకపోడమనే దారుణం అంతం కావాలి.

Sex Ratio Decreases

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లింగ నిష్పత్తి దుస్థితి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.