జాతీయ పౌర రిజిస్టరు

Sampadakiyam         ఇప్పటి వరకు అసోం రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన జాతీయ పౌరసత్వ నమోదు రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)ని ఇక ముందు దేశమంతటికీ వర్తింప చేస్తామని, ఎక్కడ ఏ మూలనున్న చట్ట విరుద్ధ వలసదారులనైనా గుర్తించి వారివారి దేశాలకు పంపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం నాడు రాజ్యసభలో చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కొలువు దీరిన ఎన్‌డిఎ 2 పాలన దేనికి తక్షణ, విశేష ప్రాధాన్యాన్ని ఇస్తున్నదో చాటుతున్నది. ఎన్‌ఆర్‌సిని అమల్లోకి తెస్తామన్న హామీయే తమ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో తిరిగి దేశాధికారాన్ని కట్టబెట్టిందని కూడా ఆయన చెప్పుకున్నారు. ఒక దేశం తన వనరులను, సంపదను అనుభవించే అవకాశాన్ని తన పౌరులకు మాత్రమే పరిమితం చేయాలనుకోడాన్ని తప్పు పట్టవలసిన పని లేదు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చి ఆ దేశంలో సంపద వృద్ధికి పాటు పడుతున్న వారుంటే వారి ప్రాధాన్యాన్ని కూడా గుర్తించవలసి ఉంది.

వాస్తవానికి అమెరికా సంపద పెంపులో భాగస్వాములై, ఆ జాతికి విశిష్ట సేవలందిస్తున్న వారిలో అన్య దేశాలకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ఇప్పటి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడి దేశదేశాల వలసదార్లపై అనేక రకాల ఆంక్షలు విధించి భయోత్పాతానికి గురి చేస్తున్నది. ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్నది. అమెరికాతో పోల్చదగిన స్థితి భారత దేశానికి ప్రస్తుతానికి లేకపోయినా ఇరుగు పొరుగు దేశాల నుంచి, సుదూరాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వారిని ఉన్న పళం గా పెకలించి పంపించి వేయడం అనుకున్నంత సుళువైన పని కాదు. ఇప్పటికే అసోంలో ఈ వ్యవహారం అనేక అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తున్నది. పౌరసత్వ జాబితాలో తన పేరు లేదని 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ రిజిస్టర్ సృష్టిస్తున్న భీతావహ వాతావరణాన్ని చాటుతున్నది.

భారత సైన్యంలో 30 ఏళ్లు పని చేసి రిటైరయిన మాజీ సైనికుడొకరిని విదేశీయుడుగా ముద్ర వేసి అరెస్టు చేసిన ఉదంతం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియను ఆదరాబాదరాగా చేపట్టవద్దని అత్యున్నత న్యాయస్థానం సూచించిన సంగతి విదితమే. పొరుగునున్న బెంగాల్ నుంచి వెళ్లి స్థిరపడిన వారిని కూడా విదేశీయులుగా ముద్రవేసి వేధిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే. సరిహద్దు రాష్ట్రమైన అసోంలోకి పొరుగు దేశాల వారు చొచ్చుకు రావడం వల్ల తమ అవకాశాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆందోళన చెందడంతో 1951 జనాభా లెక్కలలో నమోదయిన వారిని మాత్రమే ఆ రాష్ట్ర పౌరులుగా గుర్తించి అప్పటి నుంచి వారి వారసులైన వారందరినీ జాబితాకు ఎక్కిస్తూ వస్తున్నారు.

2013 తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1971 మార్చి 24 కటాఫ్ డేట్‌గా తాజా పరచి విడుదల చేసిన మొదటి ఎన్‌ఆర్‌సి ప్రకారం 40 లక్షల మంది అసోమీయులు భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. అందుచేత ఇది వివాదాస్పదమైంది. అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన వారికి శరణార్థుల హోదా ఇవ్వవచ్చునేమో ఆలోచించాలని కూడా సుప్రీంకోర్టు ఒక దశలో ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. ‘విదేశీయుల’ ను ఏరి వేయాలన్న డిమాండ్‌తో అసోంలో అఖిల అస్సాం విద్యార్థి సంఘం, అఖిల అస్సాం గణ సంగ్రామ పరిషత్ సంయుక్తాధ్వర్యంలో 1979 నుంచి ఆరేళ్లపాటు సాగిన సుదీర్ఘ ఉద్యమం తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారినే విదేశీయులుగా భావించి వారిని వెనుకకు పంపించాలన్న డిమాండ్‌తో ఈ సుదీర్ఘ ఉద్యమం ఉధృతంగా సాగి చరిత్ర కెక్కింది.

అయితే అసోంలో విదేశీయులను గుర్తించి వారివారి స్వదేశాలకు పంపివేత సునాయాసం గా జరగడం లేదు. అయిన వారిని విదేశీయులుగా, కాని వారిని స్వదేశీయులుగా గుర్తించడమూ జరుగుతున్నదనే ఆరోపణ ఉన్నది. ఈ మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు విశేషాధికారాలు కట్టబెట్టిన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని మతాలకు చెందిన ఉగ్రవాదులనూ ఒకే దృష్టితో చూస్తామని అమిత్ షా చేసిన ప్రకటనకు అభ్యంతరం చెబుతూ మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడుల వంటి కేసుల్లో నిందితులను విడుదల చేస్తూ వచ్చిన తీర్పులపై ప్రభుత్వం ఎందుకు పై కోర్టుల్లో అప్పీలు చేసుకోలేదన్న ప్రశ్న దూసుకు వచ్చింది. ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం ఒక మత వర్గం వారిని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఆర్‌సిపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నదనే విమర్శ ఉన్నది. అందుచేత ఈ విషయంలో నిష్పాక్షికతకు, నిష్కళంకతకు చేటు కలగకుండా చూడవలసి ఉంది.

SC yet to hear govt plea to extend NRC deadline

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జాతీయ పౌర రిజిస్టరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.