మహేష్ వల్లే ఘన విజయం సాధించింది

Sarileru Neekevvaru

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటించారు. ఈ చిత్రం తాజాగా విడుదలై రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన థ్యాంక్స్‌మీట్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ“దూకుడు తర్వాత నేను చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి… ఇలా మంచి సినిమాలు చేశాను. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ కథ చెప్పినప్పుడు నాకు ఎంతగానో నచ్చింది. అయితే ఒక సంవత్సరం తర్వాత ఈ సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ ‘ఎఫ్2’ చూసిన తర్వాత వెంటనే ఈ సినిమా చేద్దామనిపించింది.

దీంతో అనిల్ రెండు నెలల్లో మొత్తం స్క్రిప్ట్ రాసి తెచ్చేశారు. ఆవిధంగా ఈ సినిమా ప్రారంభమైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించాడు. నిర్మాత అనిల్ రావిపూడి మా ఇంట్లో వ్యక్తి. ఆయనకు నాన్నగారంటే చాలా ఇష్టం. ఇక దిల్‌రాజుతో నాది హ్యాట్రిక్ కాంబినేషన్. ఆయనతో డబుల్ హ్యాట్రిక్ కొడతాం. ఈ సినిమాతో మంచి హిట్ ఇచ్చినందుకు నాన్నగారి అభిమానులు, నా అభిమానులు, దర్శకుడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు చెబుతున్నాను”అని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఈ చిత్రంలో మహేష్‌బాబు అద్భుతంగా నటించారు. ఆయన వల్లే ఈ సినిమా ఘన విజయం సాధించింది. మన కోసం కాపలా కాసే సైనికులు… మనం బాధ్యతగా ఉండాలని కోరుకుంటారని ఈ సినిమాలో హీరోతో చెప్పించాం. ఈ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్‌రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, అజయ్, తమ్మిరాజు, యుగంధర్, చిట్టి, కౌముది తదితరులు పాల్గొన్నారు.

Sarileru Neekevvaru thanks meet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహేష్ వల్లే ఘన విజయం సాధించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.