తోడేల్లన్నీకలిసి…దుందుభిని తోడేస్తున్నాయి…

Dundubhi River

 

మహబూబ్ నగర్ : విడి విడిగా దోపిడి చేస్తున్న దోపిడి దొంగలు అంతా ఒక్కటయ్యారు. ఒక్కొక్కరు కలిసి దోపిడి చేస్తే దొరుకుతామని భావించిన వారంతా ఒక్క జట్టుగా మారారు. ఇంకేముంది ఉమ్మడిగా దోచుకోవడం మొదలు పెట్టారు. ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. వారిని ప్రశ్నించి, నిలదీసి, చర్యలు తీసుకోవాల్సిన పోలీస్, రెవెన్యూ కళ్లుండి చూడలేని దృత రాష్ర్టుని వలె చూస్తు ఉంటున్నారు తప్ప చర్యలు తీసుకునే సాహసం చేయలేక పోతున్నారు. అంతగా ఆ అక్రమార్కులు బరి తెగించి నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. వీరంతా నిజంగా దోపిడి దొంగలు కాదు. ఇసుక మాఫియా. పొట్టకూటి కోసమో కొందరు దొంగతనాలు చేస్తారేమో కాని, ఈ దొంగల ముఠా మాత్రం పకృతి సహజ వనరులను దోచుకొని లక్షలు వెనుకేసుకుంటున్నారు.

ఇదంతా ఎక్కడో నల్లమల్ల అడువులో జరుగుతున్న తంతు కాదు. మిడ్జిల్ మండలంలోని సాక్షాత్తు దుందుభి నదిలో జరుగుతున్న ఇసుకు దోపిడి. వీరి దోపిడికి దుందుభి నదీమ తల్లి ఎడారిగా మారింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ నుంచి మిడ్జిల్ మండలంలోని సింగం దొడ్డి, కంచెన పల్లి, మొన్ననూరు. వాడాల, మిడ్జిల్, కొత్తూరు, వెలుగోముల, మల్లాపూర్ ఈ గ్రామాల మీదుగా దుందుభి నది ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న రైతులు తమ పొలాల్లో బోర్లు వేసుకొని వ్యవసాయ పంటలు పండించుకుంటున్నారు. ఎన్నో జంతు పక్షులకు ఈ నది జీవనం కల్పిస్తోంది. అలాంటి దుంధుభి నది ఇసుకను అక్రమార్కులు పెద్ద ఎత్తున తరలించుకు పోతున్నారు.

దుందిభి నది షాద్ నగర్ మీదుగా ప్రవహించి సింగం దొడ్డి, కంచెన పల్లి, దోనూరు, వసుపుల, వాడ్యాల, మున్ననూరు, మిడ్జిల్ ,కొత్తూరు. వెలుగోముల, మల్లాల ఈ గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. ప్రతి ఏడాది నిండుగా ప్రవహించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ నది పరివాహక ప్రాంతంకు ఆనుకొని ఉన్న రైతులు తమ వ్యవసాయ పొలాల్లో బోర్లు వేసుకొని పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే అక్కమార్కులు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా దుందుభి నదిపై కన్నేసి ఇసుకను తరలించుకుంటున్నారు. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన దాదాపు 20 మంది ఇతరులు కొంతమంది కలిసి జట్టుగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. రోజు పగలనకా, రాత్రనకా దుందుభి నదిని తోడేసుకుంటున్నారు.

రోజుకు 200 ట్రాక్టర్ల దాకా తవ్వుకొని పోతున్నారు. ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్‌ను లోకల్ లో రూ. 2000 విక్రయించుకోగా, ఇతర ప్రాంతాలకు తరలించుకుంటే ఒక ట్రాక్టర్ ఇసుక రూ. 5000 వేల వరకు విక్రయించుకుంటున్నారు. నిత్యం వీరిది ఇదే పనిగా పెట్టుకొని ఇసుకను తరలించుకుంటున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచేందుకు వాటర్ షెడ్స్, మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడిక తీత పనులు, చెరువులు, కుంటల మరమత్తులు చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ లక్ష్యానికి ఇసుక ముఠా తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతోంది. వాస్తవానికి దుంధుభి నదిలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ ఇసుక అక్రమార్కులకు ఆదాయ వనరు కావడంతో ఇష్టారాజ్యంగా తవ్వకుంటున్నారు. ఇసుకను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడంతో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున తరలించుకుపోతోంది.

ఇందుకు రెవెన్యూ శాఖలోని ఒక అధికారి పాత్ర కూడా పరోక్షంగా ఉందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 2017లో కెఎల్‌ఐ ప్రాజెక్టుకు కాల్వలకు ఇసుక అవసరం అయితే ఇప్పటి జాయింట్ కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతుల గడువు ముగిసి పోయి చాలా రోజులు అవుతున్నా, దాని ఆధారంగా తరలించుకుపోతున్నారు. ఇది ఎవరో చెప్పడం కాదు . ఏకంగా రెవెన్యూ అధికారి చ్పెపడం కొసమెరుపు. పాత అనుమతులు ఉన్నాయని అందుకే తీసుకెళ్తున్నారని ఆ అధికారి చెప్పడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఇసుకను అరికట్టాల్సింది పోయి ఇసుక మాఫీయాకే అనుకూలంగా మాట్లాడం వెనుక అంతర్యం ఏమిటని రైతులు నిలదీస్తున్నారు.

ఇదిలా ఉండగా అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీస్ శాఖ అధికారులు కూడా ఇది తమ పని కాదంటూ దాట వేస్తున్నారు. గతంలో ఒక సిఐ ఇసుక మాఫియాకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. కొన్ని రోజులు ఇసుక తరలింపు ఆపి వేసిన మాఫియా, తర్వాత తిరిగి యధావిధిగా ఇసుకను తరలించుపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పోలీసు శాఖలోని కొందరి అండదండల తోనే రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇసుక తరలించుపోతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అనుకుంటే ఎంతటి వారినైనా అణిచి వేసే శక్తి సామర్థాలు ఉంటాయి. కాని ఇక్కడ మాత్రం పోలీస్ శాఖ అధికారులు మౌన యాగం పాటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మిడ్జిల్ పబ్లిక్‌గా ఫంక్షన్ హాల్లో ఇసుక డంప్‌లు
దుందుభి నది నుంచి తరలించుకుపోతున్న ఇసుక మాఫియా పబ్లిక్‌గా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేసుకున్నా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. ఏకంగా మిడ్జిల్ కేంద్రంగా అనేక ఇసుక డంపులు ఉన్నట్లు సమాచారం. ఒక ఫంక్షన్ హాల్లో ఇప్పటికీ దాదాపు 40 ట్రాక్టర్ల ఇసుక డంప్ నిల్వలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. నది నుంచి అక్రమంగా తరిలించుకొని డంపుల ద్వారా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించుకొని సొమ్ము చేసుకుంట్నునారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాకు ముకుతాడు వేసి భూగర్భ జలాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

 

Sand loot became Dundubhi River Desert

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తోడేల్లన్నీకలిసి… దుందుభిని తోడేస్తున్నాయి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.