‘సూపర్ ప్రధాని’గా అమిత్ షా

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి ఐదేళ్ల పాలనలో దాదాపు ఏ మంత్రికి కూడా విశేష అధికారాలు ఉండెడివి కావు. కనీసం తమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై సహితం సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే వారు కాదు. ప్రధానికి సన్నిహితుడుగా భావించే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలతో సహితం ప్రధాన మంత్రి కార్యాలయంలోని కొందరు అధికారులు 60 శాతానికి పైగా మార్చి వేస్తూ ఉండేవారు. మంత్రులు తాము పంపిన ప్రతిపాదనలు ప్రధాన […] The post ‘సూపర్ ప్రధాని’గా అమిత్ షా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి ఐదేళ్ల పాలనలో దాదాపు ఏ మంత్రికి కూడా విశేష అధికారాలు ఉండెడివి కావు. కనీసం తమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై సహితం సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే వారు కాదు. ప్రధానికి సన్నిహితుడుగా భావించే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలతో సహితం ప్రధాన మంత్రి కార్యాలయంలోని కొందరు అధికారులు 60 శాతానికి పైగా మార్చి వేస్తూ ఉండేవారు. మంత్రులు తాము పంపిన ప్రతిపాదనలు ప్రధాన మంత్రి కార్యాలయంలో మారిపోతూ ఉంటె వాటిని ప్రధాని స్వయంగా మార్చారా లేదా అక్కడున్న కొందరు అధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం మార్చారా అని అడిగే ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదు. అయితే కేవలం నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాశ్వాన్ మాత్రమే ప్రధాని కార్యాలయంలోని వత్తిడులకు లొంగేవారు కాదు. కొంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించేవారు.

మంత్రివర్గంలో రెండో స్థానంలో ఉన్నారన్న హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ శాఖలో కార్యదర్శి వంటి కీలక పదవులకు ఆయనకు తెలుపకుండానే నియామకాలు జరుపుతూ ఉండేవారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో, ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూడా కనీసం ఆయనను సంప్రదించిన దాఖలాలు లేవు. కానీ బిజెపి అధ్యక్షుడుగా ప్రధాన మంత్రి మోడీ అభీష్ఠం మేరకు నడచుకొనే నేతగా పేరొందిన అమిత్ షా మాత్రం హోమ్ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో చేరడం విశేష ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. హోమ్ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టగానే జమ్మూ కశ్మీర్‌పై దృష్టి సారించారు. వరుస సమావేశాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ ఎన్నికలు జరపడం వంటి అంశాలపై కసరత్తు చేపట్టారు.

మరోవంక రాజకీయంగా మరో ఏడాదిలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టే విధంగా ఆమె ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడుగా రాజకీయ వ్యూహాలతో, పార్టీ నిర్మాణంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న అమిత్ షా పరిపాలన సామర్థ్యంలో సహితం తాను ఎవ్వరికీ తీసిపోనని నిరూపించుకోవడం కోసమే కేంద్ర మంత్రివర్గంలో చేరిన్నట్లు కనబడుతున్నది.

వాస్తవానికి అమిత్ షా మంత్రివర్గంలో చేరితే పార్టీ బలహీనం అవుతుందనే భయం ప్రధాన మంత్రిలో ఉంది. అందుకనే మరో మూడేళ్లు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగమని కోరారు కూడా. ముఖ్యంగా రాబోయే సంవత్సర కాలంలో మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీ వంటి అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే సంవత్సరం నవంబర్ నాటికి రాజ్యసభలో మెజారిటీ సాధించవలసి ఉంది. దక్షిణాదిన, తూర్పు ప్రాంతాలలో బిజెపిని పటిష్ట పరచి దేశం అంతా బిజెపి తప్ప మరో బలమైన పార్టీ లేకుండా చేయాలనీ భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అమిత్ షా మంత్రివర్గంలో చేరడం మోడీకి ఇష్టం లేదు. అయితే మంత్రివర్గంలో చేరినా పార్టీ బాధ్యతలను విస్మరించననే హామీతో ఆయన మంత్రి పదవి చేపట్టారు. బిజెపి అధ్యక్షుడుగా ఎవరున్నా అసలు అధికారం అమిత్ షా చేతులలోనే కొనసాగుతుంది. అసలు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్లడం పట్ల అమిత్ షా ఉత్సాహం చూపారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీ బాధ్యతలు చూడవలసిందే అని ప్రధాని స్పష్టం చేశారు. దానితో పార్టీలో పెద్దగా పలుకుబడి లేకపోయినా అమిత్ షా అనుచరుడిగా పేరొందిన విజయ్ రూపాని ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగారు.

ఆర్ధిక శాఖ నిర్వహించడానికి బిజెపిలో సమర్థులైన వారే కనిపించ లేదు. గతంలో ఈ శాఖ చేపట్టిన అరుణ్ జైట్లీ పనితీరు సహితం పార్టీలో ఎవ్వరికీ సంతృప్తికరంగా లేదు. అందుకనే అమిత్ షా ఆర్ధిక శాఖ చేపట్టగలరని అందరూ భావించారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విషయంలో సిబిఐ వ్యవహరించిన తీరు పట్ల మమతా బెనర్జీ స్పందించిన విధానం, అక్కడ పోలీస్ యంత్రాంగంపై ఆమెకు గల పట్టు చూసిన తర్వాత హోమ్ మంత్రిగానే జాతీయ రాజకీయాలపై పట్టు సంపాదించగలనని అమిత్ షా నిర్ణయానికి వచ్చిన్నట్లు కనబడుతున్నది.

హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే అమిత్ షా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులను తన కార్యాలయానికి పిలిపించి ఒక అత్యున్నత సమావేశం జరపడం మోడీ ప్రభుత్వంలో ఆయన స్థానం ఏమిటో వెల్లడి చేస్తున్నది. సాధారణంగా ఇటువంటి సమావేశాలను ప్రధాన మంత్రి జరుపుతారు. కానీ తన శాఖకు సంబంధం లేని అంశాలపై అమిత్ షా సమావేశం జరపడం గమనిస్తే ప్రధాని నిర్వహించ వలసిన పలు వ్యవహారాలను ఇక అమిత్ షా చేపట్టనున్నారని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అయింది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు ఆగిపోవడం, అమెరికా ఆర్ధిక ఆంక్షల నేపథ్యంలో అనుసరించ వలసిన వ్యూహంపై అత్యున్నత సమావేశం జరిపారు. హోమ్ శాఖకు సంబంధం లేకపోయినా ఆర్ధిక, విదేశీ వ్యవహారాలు, రైల్వే, పెట్రోలియం శాఖల మంత్రులను తన కార్యాలయానికి పిలిపించుకొని సమావేశం జరిపారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా హాజరయ్యారు. భారత్ పెట్రోలియం రూ 16,646 కోట్ల పెట్టుబడులతో మొజాంబిక్యులో చేపట్టవలసిన వ్యాపార అంశాలను సహితం ఈ సమావేశంలో చర్చించారు.

వాస్తవానికి అమిత్ షా జరిపిన ఈ సమావేశంలో నిర్దిష్టంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం ప్రస్తుత ప్రభుత్వంలో అమిత్ షాకు రాజకీయంగా గల విశేష ప్రాధాన్యతను వెల్లడించడం కోసమే ఈ సమావేశం జరిపినట్లు భావించవలసి వస్తున్నది. స్వాతంత్ర భారత దేశ చరిత్రలో హోమ్ మంత్రి ఆర్థిక, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత సమావేశం జరిపిన దాఖలాలే లేవు. కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, రైల్వే వంటి శాఖలకు రాజకీయంగా చెప్పుకోదగిన భూమిక, బలం లేని వారిని మంత్రులుగా నియమించడం గమనిస్తే కేంద్ర మంత్రివర్గంలో మోడీ, అమిత్ షాలు మాత్రమే అసలు అధికారం చెలాయిస్తారని, మిగిలిన మంత్రులు దాదాపు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉంటారని భావించవలసి వస్తుంది. గత ప్రభుత్వంలో సమర్ధవంతంగా పని చేసిన పలువురు ప్రస్తుతం మంత్రి పదవులు పొందలేక పోవడం గమనార్హం. సురేష్ ప్రభు, జయంత్ సిన్హా వంటి వారిని ఈ సందర్భంగా పేర్కొనవచ్చు.

జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370, 35 ఎ అధికరణలను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని ఎన్నికల ప్రచార సభలలో అందరికన్నా ఎక్కువగా అమిత్ షా చెప్పుకొంటూ వచ్చారు. అంటే అప్పటి నుండే హోమ్ మంత్రిత్వ శాఖపై ఆయన దృష్టి ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే కనీసం మరో సంవత్సరం వరకు ఈ అంశంపై ఆయన ఎటువంటి చొరవ తీసుకొనే అవకాశం లేదు. రాజ్యసభలో మెజారిటీ సాధించుకున్న తర్వాతనే ఈ అంశంపై ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈలోగా జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా జమ్మూ ప్రాంతంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచడం, బిజెపి వీలయినన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకొనే పరిస్థితులు కల్పించడం పట్ల దృష్టి సారిస్తున్నారు.

అమరనాథ్ యాత్ర పూర్తయిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొన్నా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యే వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కనిపించడం లేదు. ఒక సారి ఎన్నికలు జరిగితే మరో ఆరేళ్ళ వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచే అవకాశం ఉండకపోవచ్చు. ఇదే సమయంలో ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు రాష్ట్ర అసెంబ్లీలో, పార్లమెంట్ లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం పట్ల దృష్టి సారించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగ ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అసెంబ్లీలో 14 మందిని నామినేట్ చేయవచ్చు. అదే విధంగా లోక్ సభలో నలుగురిని నామినేట్ చేయవచ్చు. కానీ 1950 నుండి ఇప్పటి వరకు ఎవ్వరినీ నామినేట్ చేయలేదు. ఆక్రమిత కశ్మీర్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర శాసన సభలో ఆ విధంగా ప్రాతినిధ్యం కల్పిస్తే జమ్మూ కశ్మీర్ రాజకీయాలపై నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి పార్టీలు వహిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడం వల్ల వ్యూహాత్మకంగా జమ్మూ కశ్మీర్ రాజకీయ పరిస్థితులనే పూర్తిగా మార్చివేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో అమిత్ షా ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో 18 లోక్ సభ సీట్లను గెల్చుకోవడంతో పాటు 40 శాతానికి పైగా ఓట్లు పొందినప్పటికీ అక్కడ మమతా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి రావడం బిజెపికి అంత సులభం కాబోదు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలను మమతకు వ్యతిరేకంగా సమీకరించడం ద్వారా ఒక విధంగా బెంగాలీ ప్రజలకు దూరం అయ్యే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలలో బిజెపికి ఓటు వేసిన వారు అసెంబ్లీ ఎన్నికలలో అదే విధంగా ఉండనవసరం లేదని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల అనుభవాలు వెల్లడి చేస్తున్నాయి. జన సామాన్యంలో మమతా బెనర్జీకి దీటుగా ప్రజాదరణ గల నేత ఎవ్వరూ బిజెపికి లేకవడం గమనార్హం.

అయితే శారదా చిట్, మరి కొన్ని అవినీతి కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని తృణమూల్ కాంగ్రెస్ నేతలను అప్రతిష్టపాలు చేయడం, మమతకు ఆర్ధిక వనరులు సమకూర్చే వారిపై ఐటి, ఇడి వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా ఒక విధంగా అమిత్ షా ఆమెపై యుద్ధం ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు. వీధి పోరాటాలలో దేశంలో మమతను మించిన వారెవ్వరూ లేరు. దానితో ఒక వంక అధికార బలం, మరోవంక ప్రజాబలం మధ్య అమిత్ షా – మమతల మధ్య జరుగనున్న పోరు ఏవిధంగా మలుపులు తిరుగుతుందో ఆసక్తి కలిగిస్తుంది. తెలంగాణలో నాలుగు లోక్ సభ సీట్లను గెల్చుకున్న బిజెపి జిల్లా పరిషత్ ఎన్నికలలో ఉనికి కాపాడుకోలేక పోవడం గమనార్హం. దానితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో బిజెపి ఉనికి కాపాడడం కూడా అమిత్ షాకు సవాల్‌గా మారనున్నది.

Rumours of J&K Assembly delimitation loom

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘సూపర్ ప్రధాని’గా అమిత్ షా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: