రూ.32,000 కోట్ల మోసం

Public Banks

 

18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాల విలువ
తొలి త్రైమాసికంలో 2,480 కేసులు నమోదు
సమాచార హక్కు చట్టం కింద వెల్లడి

ముంబై : ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ నుండి జూన్ వరకు) 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.32 వేల కోట్ల మేరకు మోసాలు జరిగాయి. సమాచార హక్కు (ఆర్‌టిఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్‌టిఐ కింద వెల్లడైన సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 2,480 మోసం కేసులు నమోదయ్యాయి. వీటి విలువ రూ. 31,898.63 కోట్లు. ఈ కాలంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో ఎక్కువ మోసాలు చోటుచేసుకున్నాయి. డబ్బు సంబంధిత కేసులు 38 శాతం ఈ ఎస్‌బిఐకి చెందినవే ఉన్నాయి.

ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అధికారి తనకు ఈ సమాచారం ఇచ్చారని మధ్యప్రదేశ్‌లోని నీముచ్ నివాసి ఆర్‌టిఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ తెలిపారు. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఎస్‌బిఐలో 1,197 మోసాలు నమోదయ్యాయని, వీటి మొత్తం రూ.12,012.77 కోట్లు ఉందని తెలిపారు. ఈ కాలంలో అత్యధిక బ్యాంకింగ్ మోసాల విషయంలో అలహాబాద్ బ్యాంక్ రెండవ స్థానంలో ఉంది. అలహాబాద్ బ్యాంకులో మొత్తం రూ.2,855.46 కోట్ల విలువచేసే 381 మోసం కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడవ స్థానంలో ఉంది. ఈ బ్యాంక్‌లో మొత్తం 99 మోసం కేసులు నమోదవగా, వీటి విలువ రూ.2,526.55 కోట్లు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 75 కేసులు రూ.2,297 కోట్లు, అలాగే 45 కేసులతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.2,133 కోట్ల మేరకు మోసాలు జరిగాయి. కెనరా బ్యాంక్‌లో 69 కేసులు(రూ.2,035 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 194 కేసులు(1,982 కోట్లు), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 31 కేసులు (రూ.1,196 కోట్లు) నమోదయ్యాయి. ఇక కార్పొరేషన్ బ్యాంక్‌లో 16 కేసులు (రూ.960 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 46 కేసులు(రూ.934 కోట్లు), సిండికేట్ బ్యాంక్ 54 కేసులు(రూ.795 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 51 కేసులు(రూ.753 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 42 కేసులు(రూ.517 కోట్లు), యుకో బ్యాంక్‌లో 34 కేసులు(470 కోట్లు) నమోదయ్యాయని ఆర్‌టిఐ ద్వారా వెల్లడైంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లు కూడా మోసాల బారిన పడ్డాయి.

Rs 32,000 crore Frauds in 18 Public Banks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.32,000 కోట్ల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.