ఆక్టోపస్…ఓ బస్టాప్ కథ!

mana-telangana-cartoon

బి.యస్.ఎన్.ఎల్. బస్టాప్….గాంధీనగర్ రోడ్…
ఆ రోజు : భుజానున్న కాలేజ్ బేగ్ సర్దుకుంటూ దించుతూ, ఎక్కించుకుంటూ, పోతున్న బస్సులను పరికిస్తూ..
ఆ..యస్..దిగాడు….వస్తున్నాడు చిరునవ్వుల దీపాలతో… వెలుగుతున్న కనుల పలకరింపు’
‘హాయ్’
‘ఏంటే సంగతులూ?’
‘నిన్న కాలేజ్లో గురజాడ వారిపై డిబేట్లో నేనే ఫస్ట్ తెలుసా !’
‘మొదలెట్టావా నీ గొప్పలూ??! నీ అవతారం సంగతి చెప్పవే ముందు..ఏంటీ డ్రస్సూ…మీ పిసినారి బాబు పైసలివ్వడని ఐరన్ కూడా చేయించలేదా ఏంటే? బొత్తిగా డ్రెస్‌సెన్స్ లేదేంటే నీకూ. ఖర్మ !’
పెదాల్లో దీపాలు కొండెక్కాయి.
ప్చ్..
మరోరోజు :
‘హాయ్రా’.?..
‘ఏంటా జిడ్డు ముఖం ?? నీ కోసం ఓ మెంటలోడు రెండు బస్సులు మారి ఇక్కడ వెయిటింగ్‌లో ఛస్తుంటాడనీ తెలీదా ఏంటీ, కాస్త శ్రద్ధగా తయారై రాలేవూ.. ఫోనెత్తి చావ్వేంటే…నాలా బ్లూ డ్రెస్‌లో రమ్మని చెబుదామనుకుంటే. డిసప్పాయింట్ చేసేసావు’..
‘పొద్దున్నే అన్నీ కుదరవ్.’
‘హు..ప్రేముంటే అన్నీ కుదురుతాయి డార్లింగ్, నాకున్నంత ప్రేమ నీకుంటేగా …ఛ..’
దీపాలు కొడిగట్టిన కవురు వాసన.
అవమానపు కవురు వాసన. ప్చ్…ప్చ్…
***
ఇంకో రోజు:
‘ఆ రౌతేష్ గాడేంటే నీ చుట్టూ తిరుగుతున్నాడూ??’
‘నన్నడిగితే ? వాడినే పోయి అడుగు?’
‘ఆ అడుగుతా గానీ..ఆ చున్నీ కాస్త పైకేసుకోమ్మా…ఇక్కడో పిచ్చాడున్నాడని తెలీదా?
కాస్త ఎంజాయ్ మెంటీయవే…
వంకరచూపు !…,
ప్చ్…చూపులతో కూడా ఎంగిలౌతారా…ఏంటీ షేమ్ ఫీలింగ్…
‘కాస్త ఆపుతావా?? టూ మచ్ అయింది’
‘అబ్బో ..ఏంటే…ఆపేదీ! !..ఇంకొంచెం రంగుంటే అసలు పట్టుకోలేక పోదుము నాయనోయ్..నేనేం తప్పన్నానే..నేనే కదా?
ఆ మాత్రం చేయలేవానే !!
..ప్చ్….ప్చ్..ప్చ్..
***
ఓ మంచిరోజు :
వామ్మో.. చాలా లేటైంది. ఆల్రెడీ వెయిటింగ్ కదా! .నస తట్టుకోగలనా??! చిన్నగా పరుగు……ఎలా పడితే అలా ఆగే ఆటోలనీ…..అడ్డంగా ఉన్న తోపుడు బళ్ళనీ తప్పించుకుంటూ… చిన్నగా వగురుస్తూ…..
‘సారీరా..చాలా సేపైందా వచ్చీ??! పరుగుపరుగున వచ్చా తెలుసా వెయిట్ చేస్తుంటావ్గా అనీ ’.
‘అదే నేనూ చూస్తున్నా ! గుండెలెగిరెగిరి పడేలా ఆ పరుగు అవసరమాని??!
అంతా తినేసేలా చూస్తుంటే షేమై చచ్చానిక్కడ తెలుసా? చున్నీ కవర్ చేసుకుతగలడు తల్లీ.. ఐనా అందరికీ చూపించేయటం.. మళ్ళీ ఏం ఎరగనట్టు తిరగటం బాగా అలవాటైపోయింది మీ అమ్మాయిలకి కదా!’
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్… చిన్న సంశయం..
ఇంకేమైనా మిగులంటూ ఉందా ??! ఇద్దరిమధ్యా…
ఆబ్వియస్లీ ‘న్నో!’ …జీరో…
‘నోర్మూయరా ఇంక ’!
‘ఏంటే ఏమైందీ??!!’
‘ఫో…ఇక్కడి నుండి ముందు’.
‘ఓ..సారీ స్వీట్ హార్ట్.. నే చెప్పేది విన్రా!….లవ్యూ రా. ఇంకెప్పుడూ జనరలైజ్ చేయనులే మీ అమ్మాయిలని. ఓకే…
‘షటప్..జస్ట్. గెట్లాస్ట్…’
కళ్ళల్లో మంటలూ, మాటల్లో పొగలూ…
‘ఇంకెప్పుడూ నా కంట పడక ’..
‘అరె..అరే….అరే….ప్లీజ్ రా.’
‘నోర్మూసుకు పో..ఓకే…’
‘ఏంటే..అంతా చూస్తున్నారని రెచ్చిపోతున్నావూ? బస్టాప్‌లో అందరిముందూ అవమానిస్తావా…రేపొచ్చి నీ అంతు చూస్తా’ ..వొగురుస్తున్నాడు.
‘రేపటి వరకూ ఎందుకురా..యాసిడ్ కొనాలా ఏంటీ? నేనిస్తారా…నాకొస్తున్న ఇరిటేషన్కి నిన్నటి నుంచే బ్యాగ్లో పెట్టుకున్నా. రా…తీసుకో…’
బ్యాగ్ నుండి పెట్ బాటిల్ తీసి చేతిలో ఆడిస్తుంటే బెదిరిపోయాడు. వెనక్కి అడుగేసి జారిపోయాడు. ప్రయాణికుల చీదరింపులకు కుచించుకు పోయాడు. ఆమె క్లారిటీకి, గర్జనకీ అదిరి లుంగ చుట్టుకుపోయాడు. దన్నులేక దుమ్ములో కూరుకుపోయాడు…మొత్తానికి’
ప్రేమికుడిగా ఎవరూ గుర్తించలేనంతగా మాసిపోయి, ముడుచుకుపోయి పారిపోయాడు.
ఎవరూ గర్తుపట్టకూడదని ఈజిప్టు మమ్మీకి కట్టినంత శ్రద్ధగా ముళ్ళేసి కట్టిన స్కార్ఫ్ విప్పేసుకోగానే చల్లని గాలిసోకి స్వేచ్ఛను ప్రసాదించినట్టయింది.
‘భలే చేసావమ్మాయ్…నేనూ రోజూ గమనిస్తూనే ఉన్నాను ప్రేమ టార్చర్’… అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఓ ఆంటీ.
థ్యాంక్స్ అనలేని ఏదో చిరాకు ఫీల్…
ఛ..తల విదిలించి చేతిలోని పెట్ బాటిల్ ఎత్తి గటగటా దాదాపుగా తాగేసేసరికి అంబులెన్స్ పిలవాలేమోనని అంతా టెన్షన్ అయారు..
“నేనెన్నటికీ ఓ ఆక్టోపస్‌కి ఆహారం కానే కాను!” గొణుక్కుంటుండగా ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయ్. చదువు..కలలు.. అమ్మ.. తమ్ముడు, నాన్న..నేను.. ఔను నేనే ! నా నేను !! నాకే నేను.. నాకై నేను…బాటిల్ పట్టిన చేయి వణుకుతుండటం వల్ల… తుళ్ళుతున్న స్వచ్ఛమైన మిగిలిన నీళ్ళను చూస్తే తట్టింది.
‘ఆ…యస్! నాకు నేను మిగిలా !
థేంక్ గాడ్ !’..

romantic love stories in telugu

మనోజ నంబూరి 94917 33100

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆక్టోపస్… ఓ బస్టాప్ కథ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.