రోహిత్ డబుల్ సెంచరీ

Rohit Sharma

రాంచీ: టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో డబుల్ సెంచరీ (255 బంతుల్లో 28ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 212)తో చెలరేగి పోయాడు.అతడికి తోడుగా అజిక్య రహానే (115) శతకంతో, రవీంద్ర జడేజా (51) అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 497 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను భారత పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ ఆరంభమైన తొలి రెండు ఓవర్లలోనే చెరో వికెట్ తీసి ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌కు పంపారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే వేళకు దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లు రెండు వికెట్ల నష్టానికి 9 పరుగులతో కష్టాల్లో పడింది. రెండో రోజు కూడా వెలుతురు లేని కారణంగా ముందుగా ఆటను ముగించారు.
హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్
ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 224 పరుగుల వద్ద రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రోహిత్, రహానేలు సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రహానే 169 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో రహానేకు ఇది 11వ సెంచరీ. లిండే బౌలింగ్‌లో రహానే షాట్‌కు యత్నించి క్లాసెస్ చేతికి చిక్కడంతో 268 పరుగులు రోహిత్హ్రానే భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం జడేజా తో కలిసి రోహిత్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. తొలి రోజు సిక్సర్‌తో శతకం అందుకున్న రోహిత్ రెండో రోజు మరో సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో డబుల్ సెంచరీ అందుకున్న మూడవ భారత బ్యాట్స్‌మన్ రోహిత్.

విశాఖలో జరిగిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్‌లో తొలి ద్విశతకం బాదిన కొద్ది సేపటికే రోహిత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. అయినా జడేజా, చివర్లో ఉమేశ్ యాదవ్(10 బంతుల్లో 5 సిక్స్‌లతో 31)తో రాణించడంతో భారత్ 9 విక్టెల నష్టానికి 497 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఉమేశ్ యాదవ్ అయిదు సిక్స్‌లతో చెలరేగడం విశేషం.
ఆదిలోనే సఫారీలకు షాక్
టీ విరామం తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు రెండో బంతికే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఎల్గర్‌ను షమీ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే డికాక్ (4)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించడంతో దక్షిణాఫ్రికా రెండు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెలుతురు తక్కువగా ఉండడంతో పేసర్లకు బదులు స్పిన్నర్లకు బంతి ఇవావలని అంపైర్లు విరాట్ కోహ్లీకి సూచించారు. స్పిన్నర్లను దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఎదుర్కోవడంతో రెండో రోజు నిర్ణీత సమయానికి ముందుగానే రెండో రోజు ఆట ముగిసే వేళకు 2 వికెట్ల నష్టానికి 9 పరుగుల స్కోరుతో నిలిచింది. హంజా(౦), డుప్లెసిస్(1) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌కంటే సఫారీ సేన ఇంకా 488 పరుగులు వెనుకబడి ఉంది.
సంక్షిప్త స్కోరు:
భారత్ తొలి ఇన్నింగ్స్:497/9 డిక్లేర్(రోహిత్ శర్మ 212, రహానే 115. లిండే 4/133,రబాడ3/85). దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్:2/9 (డికాక్ 4,డుప్లెసిస్ 1 నాటౌట్. షమీ 1/0,ఉమేశ్ యాదవ్ 1/4).

రికార్డుల రోహిత్
టీమిండియా టెస్టు ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో బ్యాట్‌తో చెలరేగిపోతున్న ‘హిట్‌మ్యాన్’ అనేక రికార్డులు తన పేర లిఖించుకున్నాడు.రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు సెంచరీతో చెలరేగిన రోహిత్ ..ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో కెక్కాడు. అలాగే ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు(19*)కొట్టిన ఆటగాడిగాను రోహిత్ మరో రికార్డు సృష్టించాడు. కాగా నిన్నటి జోరును కొనసాగించిన రోహిత్ రెండు రోజు(ఆదివారం) డబుల్ సెంచరీ (212)పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ. ఫలితంగా వన్‌డేలు, టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌కంటే ముందు సచిన్ తెండూల్కర్, వీరేంద్ర సెవాగ్, క్రిస్‌గేల్ ఈ ఘనత సాధించారు.

10 బంతులు..5 సిక్స్‌లు..
మూడు రికార్డులు

సిక్సర్లతో ఉమేశ్ యాదవ్ వీరవిహారం
దక్షిణాఫ్రికాతోజరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు సిక్సర్లతో విరుచుకుపడ్డ టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆ క్రమంలో మూడు రికార్డులు నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన ఉమేశ్.. ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత ఇన్నింగ్స్ 112వ ఓవర్‌లో జార్జి లిండే వేసిన చివరి రెండు బంతులను ఉమేశ్ స్టాండ్స్‌లోకి పంపాడు. ఫలితంగా అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరింది. 1948లో ఫాఫీ విలియమ్స్ ఇలా తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్పర్లుగా మలచగా, 2013లో సచిన్ తెండూల్కర్ కూడా తొలి రెండు బంతులను సికర్లు బాదాడు. మళ్లీ ఇప్పుడు ఉమేశ్ యాదవ్ ఆ ఘనత సాధించాడు. కాగా ఉమేశ్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది.

ఈ మ్యాచ్‌లో మొత్త పది బంతులు ఎదుర్కొన్న ఉమేశ్ అయిదు సిక్సర్ల సాయం తో 31 పరుగులు చేశాడు.ఫలితంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 30కి పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఉమేశ్‌కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.ఈ క్రమంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, నామ్‌మెక్‌లీన్, అబ్దుల్ రజాక్, హోవెల్ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాపై స్టీఫెన్ ఫ్లెమింగ్ 11 బంతుల్లో అజేయంగా 31పరుగులు చేశాడు.1998లో దక్షిణాఫ్రికాపై నామ్ మెక్‌లీన్ 12 ల్ల్లో 31 పరుగులు,2108లో జింబాబ్వేపై అబ్దుల్ రజాక్ 17 బంతుల్లో 43 పరుగులు, డబ్లుపి హోవెల్ 15 బంతుల్లో 35 పరుగులు చేశారు. అలాగే ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ స్ట్రైక్‌రేట్ 310. క్రికెట్‌లో 10కి పైగా బంతుల్లో నమోదైన అత్యధిక స్ట్ట్రైక్‌రేట్ కూడా ఇదే. ఉమేశ్ సిక్సర్ల జోరు చూసిన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆనందంతో చిందులు వేశాడు.

 

Rohit Sharma hits maiden double century in Test cricket

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోహిత్ డబుల్ సెంచరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.