అన్నార్తులకు అమృతహస్తం

  నాలుగు మెతుకులే కదా అని తినగా మిగిలిన పదార్థాల్ని బయట పడేస్తుంటాం. ఆ నాలుగు మెతుకులు దొరక్క ఆకలితో అలమటించేవారు దేశంలో చాలామందే ఉన్నారు. పెళ్లిళ్లు, రెస్టారెంట్లు వివిధ వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథాగా పడేస్తుంటారు. ఆ ఆహారాన్ని సేకరించి పేదల కడుపునింపుతోంది రాబిన్ హుడ్ ఆర్మీ. ఈ సంస్థ వాలంటీర్లంతా వివిధ రంగాల్లో పగలు ఉద్యోగాలు చేసుకుంటూ రాత్రివేళల్లో సమాజానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. రాత్రుళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటూ చలికి వణుకుతూ, వానకు […] The post అన్నార్తులకు అమృతహస్తం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాలుగు మెతుకులే కదా అని తినగా మిగిలిన పదార్థాల్ని బయట పడేస్తుంటాం. ఆ నాలుగు మెతుకులు దొరక్క ఆకలితో అలమటించేవారు దేశంలో చాలామందే ఉన్నారు. పెళ్లిళ్లు, రెస్టారెంట్లు వివిధ వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథాగా పడేస్తుంటారు. ఆ ఆహారాన్ని సేకరించి పేదల కడుపునింపుతోంది రాబిన్ హుడ్ ఆర్మీ. ఈ సంస్థ వాలంటీర్లంతా వివిధ రంగాల్లో పగలు ఉద్యోగాలు చేసుకుంటూ రాత్రివేళల్లో సమాజానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

రాత్రుళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటూ చలికి వణుకుతూ, వానకు తడుస్తూ బతుకీడుస్తున్న అభాగ్యులు ఎంతో మంది నగరంలో ఉన్నారు. ఖాళీ కడుపుతో పట్టెడు అన్నం దొరక్క పస్తులుండేవారికి కొదవలేదు. అలాంటివారిపై జాలిచూపుతాం. మహా అయితే ఓ పదిరూపాయలిచ్చి, అయ్యో పాపం అంటాం. అంతటితో వాళ్ల ఆకలి తీరిపోదు కదా! వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అనుకుంది రాబిన్‌హుడ్ ఆర్మీ.

అభాగ్యులకు, అనామకులకు, కనిపించిన వారందరికీ కప్పుకోవడానికి మంచి దుప్పటి, కడుపునిండా శుభ్రమైన తిండి అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది ఈ ఆర్మీ. లింగంపల్లి నుంచి హయత్‌నగర్ వరకూ… ఫుట్‌పాత్‌పై జీవితాన్ని వెళ్లదీస్తోన్న వారి కడుపు నింపేందు కోసం పనిచేస్తోంది. అలా ఒక రోజుతో ఆగిపోకుండా, వారానికి ఐదు రోజులపాటు ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నగరంలోని పలు హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరిస్తోంది.

శుచిగా ఉంటేనే…
నగరంలో రాబిన్ హుడ్ ఆర్మీ కార్యకర్తలు సుమారు 175 మందికి పైగా ఉన్నారు. వీరంతా సాఫ్ట్‌వేర్ వంటి పలు ఉద్యోగాల్లో ఉన్నవారే. పగలు ఆఫీసు పనితో బిజీబిజీగా గడిపే వారంతా రాత్రి 8గంటలకల్లా కలుస్తారు. తమకు అందిన సమాచారం మేరకు ఆయా హోటళ్లలోని ఆహారాన్ని సేకరిస్తారు. అంతకుముందే ఆ పదార్థాలు తినగలిగేలా ఉన్నాయా లేదా పరీక్షిస్తారు. శుచి, శుభ్రతగా ఉన్నాయంటేనే తీసుకుంటారు. వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో పంచుతారు. మాదాపూర్ చాప్టర్ నుంచి గురు, శని, ఆదివారాలు, బంజారాహిల్స్ నుంచి బుధ, శనివారం, సికిందాబ్రాద్ నుంచి మంగళవారం రోజుల్లో రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆహారం పంచుతూ సామాజిక బాధ్యతలో భాగస్వాములవుతున్నారు. సోషల్‌మీడియా ఛాటింగ్, సినిమాలు చూసే సమయాన్ని పది మంది ఆకలి తీర్చడం కోసం కేటాయించడంతో పొందే ఆనందం వేరంటున్నారీ కార్యకర్తలు.

వాట్సప్ వేదికగా…
వాలంటీర్లంతా కలిసి వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటారు. ఆ వేదిక ద్వారా నిత్యం తమ కార్యక్రమాల గురించి చర్చించుకుంటారు. తద్వారా ఎవరి నుంచైనా ఫలానా పెళ్లిలోనో, పుట్టిన రోజు ఫంక్షన్‌లోనో ఆహారం మిగిలిందనే సమాచారం తెలియగానే తక్షణం స్పందిస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి నగరంలోని వాలంటీర్లంతా కలిసి మెగా ఫుడ్ డ్రైవ్‌లూ చేపడుతున్నారు.

అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే…
ఢిల్లీకి చెందిన జొమాటో యాప్ కో – ఫౌండర్ నీల్‌ఘోష్ ఒకసారి బెల్జియం వెళ్లారు. ఆ దేశంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని వృథా కానివ్వకుండా ఆకలితో అలమటించే వారికి పంచుతున్న పలు సంస్థల సేవలను కళ్లారా చూశారట. ఆ స్ఫూర్తితో భారతదేశంలోనూ అలాంటి సేవలు ప్రారంభించారు. అలా దేశంలోని 14 ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీలోనూ రాబిన్ ఆర్మీ సేవలందిస్తోంది. నీల్‌ఘోష్ తలపెట్టిన కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి ఆదిత్యగుప్తా సెప్టెంబర్, 2014లో రాబిన్‌హుడ్ సేవలను నగరంలో ప్రారంభించారు.

మరింతమంది కలవాలని కోరుకుంటున్నాం…
“మేం చేస్తోన్న మంచి పని గురించి అందరికీ తెలియజేయడం కోసం నగరంలోని “స్టిక్కర్ డ్రైవ్‌”, “హెరిటేజ్ వాక్‌” వంటి పలు కార్యక్రమాలను నిర్వహించాం. పలు హోటళ్లలో మా నెంబర్‌తో కూడిన స్టికర్‌ను అంటించాం. తద్వారా మా సేవలు విస్తృతమయ్యాయి. కొన్ని హోటళ్లు క్రమంతప్పకుండా మాకు ఆహారాన్ని అందిస్తున్నారు. అంతేగాక మరికొందరు అన్నదానం చేయాలనుకునే వారూ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో పదిహేను ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా మేం పనిచేస్తున్నాం. ఏడాది పొడవునా ఫుడ్ డ్రైవ్‌లు నిర్వహించాలనేదే మా కోరిక. అందుకు హోటల్స్ సహకారం చాలా అవసరం. మా గ్రూప్‌లోకి మరింత మంది జాయిన్ అయ్యి మాతోపాటు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది. పది మందికి అన్నం పెట్టే అవకాశం ఇలాగైనా తీర్చుకోవచ్చు. కొన్ని వందల మంది మంది ఆకలి తీరుస్తోన్న మా రాబిన్ హుడ్ ఆర్మీ సేవల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలనుకొనే వారు ఫేస్‌బుక్‌లో “రాబిన్ హుడ్ ఆర్మీ, హైదరాబాద్‌” పేజీని చూడాలని” చెబుతున్నారు రాబిన్‌హుడ్ ఆర్మీ ప్రతినిధి ఉమాచిలక్.

Robin Hood Army collects from restaurants to feed poor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అన్నార్తులకు అమృతహస్తం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: