వైద్య ఖర్చుల వైపరీత్యం

Sampadakiyam     దేశం ఏమవుతోందో, ఎటు పోతోందో చెప్పడానికి ఈ ఒక్క సమాచారమే చాలు. వైద్య ఖర్చులు అపరిమితంగా పెరిగిపోతున్నందున దేశంలో ఏటా 75 లక్షల కుటుంబాలు పేదరిక గీత దిగువకు జారిపోతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వమే స్వయంగా మంగళవారం నాడు పార్లమెంటుకు తెలియజేసింది. వైద్యం, మందుల ఖర్చు మితిమించుతున్నందున ఏటా అనేక కుటుంబాలు దారిద్య్ర రేఖ కిందికి పడిపోతున్నాయని, నిరు పేదరికంలోకి కూరుకుపోతున్నాయని, ఈ కారణంగా చేత చిల్లి గవ్వ మిగలని స్థితికి చేరుకొని కొన్ని సందర్భాలలో పిల్లలను బడి మాన్పించడమూ జరుగుతున్నదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

విద్య, వైద్యం ప్రధానంగా ప్రభుత్వ రంగంలో కొనసాగినప్పుడు లేని దారిద్య్రం అవి ప్రైవేటు రంగం పట్టులోకి పోయిన తర్వాత దేశంలోని సాధారణ ప్రజలను పట్టి పీడించడం ప్రారంభమైంది. ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ప్రాణాలు పోయడానికి బదులు వాటిని తోడేస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు, చికిత్స ఖర్చులు ఊహించనంతగా పెంచేసి కోట్లాది నిరుపేద భారతీయుల ఊపిరిని హరిస్తున్నాయి. 2017లో వైద్య ఖర్చులు దుర్భరం కావడంతో దేశంలోని 5 కోట్ల 50 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారని భారత ప్రజారోగ్య ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. 80 శాతం భారతీయులు వైద్య ఖర్చుల కోసం జేబులోంచే డబ్బు పెడుతున్నారని ఎటువంటి బయటి సహాయం అందడం లేదని నిగ్గు తేలింది. 201112లో ప్రజలు వైద్య ఖర్చుల కోసం పెట్టిన వ్యయంలో 67 శాతం మందుల కిందే అయిందని ఒక సమాచారం. ఆసుపత్రుల్లో, మందుల షాపుల్లో ఎక్కడికక్కడ పేద ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకొని సాగుతున్న దోపిడీ వల్లనే వారు ఇంతగా ఆరోగ్య వ్యయానికి బలైపోతున్నారు.

చవుక మందుల అందుబాటు బొత్తిగా దుర్లభమవుతున్నది. కేంద్ర మంత్రి మాండవీయ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధాని మంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద తమ ప్రభుత్వం జెనరిక్ మందులను అందుబాటులో ఉంచిందని చెప్పుకున్నారు. ఈ మందులు బజారులో దొరికేవాటి కంటే 50 90 శాతం చవుక అని కూడా ఆయన ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అవి ఎక్కడ దొరుకుతున్నాయో కూడా ఆయన వివరంగా తెలియజేసి ఉంటే బాగుండేది. సంకేతాత్మకంగా, అరకొరగా జెనరిక్ దుకాణాలను నెలకొల్పినంత మాత్రాన పేదలకు ప్రాణావసర మందులు అందవు. దేశంలో ప్రభుత్వ రంగంలో గల 60 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే ఒక్క డాక్టర్‌తో నడుస్తున్నాయి. 5 శాతం కేంద్రాలలో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం గమనించవలసిన అంశం. కేవలం 20 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే ప్రజారోగ్య ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నట్టు వెల్లడైంది. దీనిని బట్టి గ్రామీణ ప్రజల ఆరోగ్య సౌభాగ్యం ఎంతగా వర్థిల్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ వైద్యం అందక నిరుపేద గ్రామీణులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు కార్పొరేట్ వైద్య బలిపీఠం ఎక్కవలసి వస్తున్నది. బ్రిక్స్ (బ్రెజిల్, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి) దేశాలలో ప్రజారోగ్యం కింద అతి తక్కువగా ఖర్చు పెడుతున్నది భారత దేశమేనన్న చేదు వాస్తవం ఆందోళనకరమైనది. మొత్తం 184 దేశాల్లో ప్రజారోగ్య సంరక్షణ విషయంలో భారత్ 147వ ర్యాంకులో ఉన్నది. పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి సరైన ఆరోగ్య బీమా పథకాలు లేవు. ఉన్నా అవి పేద వర్గాలకు, మారుమూల గ్రామీణులకు బొత్తిగా అందుబాటులో లేవు. ప్రైవేటు బీమా పథకాలను భరించే శక్తి ప్రజలకు లేదు. ఈ నేపథ్యంలో ఖరీదైన వైద్య చికిత్స కోసం, అత్యవసర ఆరోగ్య వ్యయం కోసం మంగళ సూత్రాలు సహా ఉన్నదీ లేనిదీ అమ్ముకోక తప్పని దుస్థితిని సాధారణ భారతీయులు అనుభవిస్తున్నారు.

తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆరోగ్య బీమా పేదలకు చాలా వరకు అక్కరకు వస్తున్న సంగతి వాస్తవమే. అయినా ఆయా కాలాల్లో వారిని పీడిస్తున్న జ్వరాలు, జబ్బులు సహా సాధారణ వైద్యావసరాలకు కూడా వారి చేతిలోని డబ్బు చాలడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి మొన్నటి బడ్జెట్‌లో వైద్య రంగానికి కేవలం 62,398 కోట్ల రూపాయలు మాత్రమే విదిలించి పేదలతో క్రూర పరిహాస మాడారు. ఇది బడ్జెట్ మొత్తం వ్యయంలో 2.32 శాతం మాత్రమే. స్థూల దేశీయోత్పత్తిలో 0.34 శాతమే. దేశ ప్రజల ఆరోగ్యావసరాల పట్ల కేంద్ర ప్రభువుల వారి దయ ఈ మాదిరిగా కొనసాగినంత కాలం పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు బలి కాక తప్పదు. మరింతగా దారిద్య్ర రేఖ దిగువకు జారిపోడం తప్ప మార్గం లేదు.

Rising healthcare costs impoverished 75 lakh families

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వైద్య ఖర్చుల వైపరీత్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.