కాలుష్యం ఒడిలో స్వచ్ఛ భారత్

  గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పారిశుధ్య వసతులు కల్పించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలను అరికట్టవచ్చు. కాని, తీవ్రమైన వాయుకాలుష్యం వల్ల ఈ ప్రయోజనాలేవీ లభించవు. ప్రజారోగ్యం కోసం వాయు కాలుష్యానికి సంబంధించిన చట్టాలను మరింత కఠినం చేయాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, ఢిల్లీ సంస్థల అధ్యయనంలో వాయుకాలుష్యానికి గురైన పిల్లల్లో చోటు చేసుకుంటున్న రుగ్మతలు బయటపడ్డాయి. గర్భవతులు వాయు కాలుష్యానికి గురికావడం వల్ల పిండం పెరుగుదలలో […] The post కాలుష్యం ఒడిలో స్వచ్ఛ భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పారిశుధ్య వసతులు కల్పించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలను అరికట్టవచ్చు. కాని, తీవ్రమైన వాయుకాలుష్యం వల్ల ఈ ప్రయోజనాలేవీ లభించవు. ప్రజారోగ్యం కోసం వాయు కాలుష్యానికి సంబంధించిన చట్టాలను మరింత కఠినం చేయాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, ఢిల్లీ సంస్థల అధ్యయనంలో వాయుకాలుష్యానికి గురైన పిల్లల్లో చోటు చేసుకుంటున్న రుగ్మతలు బయటపడ్డాయి. గర్భవతులు వాయు కాలుష్యానికి గురికావడం వల్ల పిండం పెరుగుదలలో లోపాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పి.ఎం.2.5 కణాలు అధికంగా ఉన్న వాయుకాలుష్యం చాలా ప్రమాదకరంగా తయారవుతోంది. ఇలా పిల్లలు ఎదుగుదల లోపాలతో జన్మించడం వల్ల దేశప్రగతి వికాసాలపై కూడా దాని ప్రభావం పడుతుంది.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డాటాను పరిశోధకులు అధ్యయనం చేశారు. 640 జిల్లాల్లో అధ్యయనం చేసి భారత ప్రభుత్వం ప్రచురించిన డాటా ఇది. 2,25,000 మంది పిల్లలపై ఈ సర్వే జరిగింది. దీంతో పాటు నెలవారి వాయుకాలుష్యం పి.ఎం.2.5 స్థాయికి సంబంధించి శాటిలైట్ డాటాను కూడా విశ్లేషించారు. అంటే పిల్లలు పుట్టిన కాలంలో ఉన్న వాయుకాలుష్యం దాని ప్రభావాన్ని కనుగొనే ప్రయత్నాలు చేశారు. వాయుకాలుష్యం, పి.ఎం.2.5 కణాలు 100 మైక్రాగ్రాములు క్యూబిక్ మీటరు కన్నా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జన్మించిన ఆడపిల్ల 0.24 సెం.మీ ఎక్కువ పొడవు కలిగి ఉండే అవకాశాలున్నాయి.

స్వచ్ఛ భారత్ వల్ల పారిశుధ్య వసతులు లభిస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించవచ్చని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. కాని వాయుకాలుష్యం ఈ ప్రయోజనాలను మింగేస్తోందని ఐఐటి ఢిల్లీ పరిశోధకులు అంటున్నారు. పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండడం, ఎత్తుకు తగిన బరువు ఉండడం అనేది ఆరోగ్యానికి సూచికగా తీసుకుంటారు. ఈ సూచికలు తగినవిధంగా ఉంటేనే పెద్దయిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉండగలరు. కాబట్టి స్వచ్ఛ చమురు పథకాలను, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఆ విధంగా ఇండ్లలో కాలుష్యాన్ని నియంత్రించడం, బయటి వాతావరణంలోను వాయుకాలుష్యాన్ని తగ్గించడం సాధ్యపడుతుంది.

చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్ ఈ విషయానికి సంబంధించి ఒక సూచిక తయారు చేసింది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ దాని పేరు. భారతదేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గిస్తే సగటున ప్రజల ఆయుర్ధాయం 4.5 సంవత్సరాలు పెరుగుతుందని దానివల్ల తెలుస్తోంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వాయుకాలుష్య చట్టాలను సవరించాలని ఇటీవల ఎం.పి. వందనా చవాన్ ఈ సమస్యను ప్రస్తావించారు. భారతదేశం 1981లో వాయుకాలుష్య చట్టం చేసింది. కాని ఈ చట్టంలో ఎక్కడా ప్రజారోగ్య పరిరక్షణ అనే మాటే లేదని ఆమె తెలియజేశారు. వాయుకాలుష్యానికి కారకులవుతున్నవారి గురించి ఆలోచించినంతగా ప్రజారోగ్యం గురించి ఆలోచించడం లేదని ఆమె విమర్శించారు. వాయుకాలుష్యంపై చట్టాలు చేసే దేశాలన్నీ ప్రజారోగ్యానికి మొదటి ప్రాముఖ్యం ఇస్తాయని అన్నారు. కాబట్టి వాయుకాలుష్య చట్టాలను సవరించవలసిన అవసరం ఉందని చెప్పారు.

అనేక అధ్యయనాల్లో వాయు కాలుష్యం వల్ల గర్భవతుల్లో గర్భస్రావాలు, పరోక్ష ధూమపానం ప్రభావం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పిల్లల ఆరోగ్యంలో ఇతర సమస్యల గురించి తెలియవచ్చింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో, మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఐఐటి ఢిల్లీ చేసిన అధ్యయనం వాతావరణంలో పి.ఎం.2.5 కణజాలం ప్రభావాన్ని విశ్లేషంచిన మొదటి అధ్యయనం అని చెప్పాలి. పిల్లల వయసు, వారి ఎత్తు, వారిపై వాయు కాలుష్యం ఈ మూడింటిని విశ్లేషించిన అధ్యయనమిది.

ఈ సంవత్సరం ప్రారంభంలో భారత ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ప్రకటించింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో పి.ఎం. కణజాల కాలుష్యాన్ని 20 నుంచి 30 శాతం తగ్గించే లక్ష్యం పెట్టుకున్నారు. దేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గించి, శుభ్రమైన గాలి ప్రజలకు లభించేలా చర్యలు తీసుకోడానికి ఉద్దేశించిన కార్యక్రమమిది. ప్రపంచంలో అత్యధిక వాయుకాలుష్యం ఉన్న నగరాలు భారతదేశంలో ఉన్నాయి. విభిన్న నగరాలకు సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసి 102 నగరాలు, పట్టణాలు గుర్తించారు.

సాధారణంగా దేశరాజధాని ఢిల్లీ నగరం కాలుష్యం గురించి మాట్లాడుతుంటారు, మహా అయితే మరికొన్ని ప్రధాన నగరాల గురించి మాత్రమే సాధారణంగా మాట్లాడుతుంటారు కాని వాస్తవానికి వాయుకాలుష్యం సమస్య దేశమంతటా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటా పిల్లలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాబట్టి దేశమంతటా వర్తించే విధానాలు రూపొందించడం అవసరమని పరిశోధకుల అభిప్రాయం.

పట్టణ ప్రాంతాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోను వాయుకాలుష్యానికి సంబంధించి, పారిశుద్య వసతులకు సంబంధించి, కాలుష్యాన్ని తొలగించే చర్యలకు సంబంధించి తేడాలను కూడా ఈ అధ్యయనం వివరించింది. నిజానికి పట్టణ ప్రాంతాల్లో పిల్లల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఎత్తు సగటున తక్కువగా ఉంటోంది. దీనికి కారణం పారిశుధ్యం, పోషకాషారం లేకపోవడం. కాలుష్యం పెరిగినప్పుడు పిల్లల ఎదుగుదల లోపం, ఎత్తు తక్కువ ఉండడం జరుగుతుంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ముఖ్యంగా నవంబర్ జనవరి నెలల మధ్య భారతదేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉంటుంది. ఈ నెలల్లో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. నిరుపేద ఆఫ్రికా దేశాల్లో గ్రామీణ పిల్లల కన్నా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఎత్తు తక్కువగా ఉండడానికి కారణాలను టెక్సాస్ యూనివర్శిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పాప్యులేషన్ స్టడీస్ రిసెర్చర్ డీన్ స్పియర్స్ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కూడా వాయుకాలుష్యమే కారణంగా తెలిసింది.

వాయుకాలుష్యం ప్రజలపై వేసే ప్రభావం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, కొందరు చనిపోవడం మాత్రమే కాదు, భవిష్యతరాలను, పిల్లలను వారి శారీరక వికాసాన్ని కూడా దెబ్బతీస్తోంది. వారి మేధోవికాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. భారతదేశంలో గర్భంలో ఉన్నప్పుడు పోషకాహార లోపం, బహిరంగ మలవిసర్జన తదితర సమస్యలతో పోల్చితే వాయుకాలుష్యం సమస్య పెద్ద సమస్యగా కనబడకపోవచ్చు. కాని ఈ సమస్య నానాటికి తీవ్రంగా మారుతుందన్నది మరిచిపోరాదని పరిశోధకులు అంటున్నారు.

దేశంలో 2017లో కోటీ 24 లక్షల మంది మరణించారు. ఈ మరణాల్లో 12.5 శాతం వాయుకాలుష్యం వల్లనే అంటున్నారు. ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ రిపోర్టు, ది లాంసెట్ లో డిసెంబరులో ప్రచురితమైంది. అందులో ఈ వివరాలు రాశారు. వాయుకాలుష్యాన్ని తగ్గించాలంటే కఠినమైన చట్టాలతో ప్రయత్నించడం తక్షణ అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాలుష్యం ఒడిలో స్వచ్ఛ భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: