ప్రధాన కోచ్‌గా శాస్త్రికే మళ్లీ అవకాశం…?

Ravi Shastri

 

ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే మళ్లీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రవిశాస్త్రి, అతడి సహాయక బృందం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో టీమ్‌ఇండియా కోచింగ్ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ ప్రకటన వెలువరించింది. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.

జులై 30 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ‘కోచ్‌గా నియామకమైన నాటి నుంచి రవిశాస్త్రి జట్టు కోసం తీవ్రంగా శ్రమించాడు. జట్టులోని ఆటగాళ్లందరితో మంచి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా టీమిండియా టెస్టుల్లో మొదటిస్థానంలో, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోచ్‌గా అతని సామర్థ్యం ఏమిటో చెప్పటానికి ఇవి చాలు. ప్రపంచకప్‌లో కేవలం ఒక్క ఓటమిని కారణంగా చూపిస్తూ అతనిని కాదనుకోవడం సరైన నిర్ణయం కాదు.

ఒకవేళ అతను కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే దాదాపు అతనికే ప్రాధాన్యత ఉంటుంది.’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. జట్టులో ఆటగాళ్లు కూడా కోచ్‌గా అతని నేతృత్వంలోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచకప్ సమయంలో రవిశాస్త్రి, అతని సహాయక బృందం పదవీ కాలం ముగియడంతో మరో 45 రోజులు పొడిగించారు. అంటే వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకూ ఈ బృందం కొనసాగుతుంది.

Ravi Shastri is the head coach of Team India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రధాన కోచ్‌గా శాస్త్రికే మళ్లీ అవకాశం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.