మోడీ కూర్పులో నేర్పు

            ఎటు నుంచీ ఎటువంటి ఎదురూ బెదురూ లేని నేతకు తన బృందాన్ని తాను కోరుకున్న రీతిలో ఎంచి కూర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మంత్రివర్గాన్ని రూపొందించుకునే విషయంలోనూ, శాఖల కేటాయింపులోనూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడా స్వాతంత్య్రం పరిపూర్ణంగా లభించింది. మొన్నటి ఎన్నికల్లో 543 మంది సభ్యులు గల లోక్‌సభలో మొత్తం ఎన్‌డిఎ పక్షాలకు కలిసి 352 స్థానాలు లభించగా, అందులో ఒక్క బిజెపికే సొంతంగా 303 సీట్లు వచ్చాయి. […] The post మోడీ కూర్పులో నేర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

            ఎటు నుంచీ ఎటువంటి ఎదురూ బెదురూ లేని నేతకు తన బృందాన్ని తాను కోరుకున్న రీతిలో ఎంచి కూర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మంత్రివర్గాన్ని రూపొందించుకునే విషయంలోనూ, శాఖల కేటాయింపులోనూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడా స్వాతంత్య్రం పరిపూర్ణంగా లభించింది. మొన్నటి ఎన్నికల్లో 543 మంది సభ్యులు గల లోక్‌సభలో మొత్తం ఎన్‌డిఎ పక్షాలకు కలిసి 352 స్థానాలు లభించగా, అందులో ఒక్క బిజెపికే సొంతంగా 303 సీట్లు వచ్చాయి. ఎవ్వరి మద్దతూ అక్కర్లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే బలాన్ని ఆ పార్టీ సొంతం చేసుకున్నది. అందుకే తాము ఇవ్వజూపిన ఒక్క మంత్రి పదవితో సంతృప్తి చెందకుండా జెడి(యు) అలక పాన్పు ఎక్కినా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రధాని మోడీ తన మంత్రి వర్గ కూర్పును నిర్విఘ్నంగా జరిపించుకోగలిగారు.

గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి కేబినెట్‌లో చేరలేనని చెప్పి దూరంగా ఉండడం, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా మొన్నటి ఎన్నికల్లో అమోఘ విజయాన్ని సాధ్యం చేసిన ఘనతను పంచుకున్న అమిత్ షా మంత్రి వర్గంలో చేరడం, విదేశాంగ కార్యదర్శిగా చేసిన అనుభవం మాత్రమే గలిగిన ఎస్ జైశంకర్‌ను నేరుగా ఆ శాఖ మంత్రిని చేయడం మోడీ కేబినెట్ కూర్పులో ముందుగా చెప్పుకోవలసిన ముఖ్యాంశాలు. జై శంకర్ పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యుడు కాదు. అమెరికా, చైనాలలో భారత రాయబారిగా పని చేసిన విశిష్ట అనుభవం మాత్రం ఉన్నది. ఆ రెండు దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవలసిన ఆవశ్యకత రీత్యా జైశంకర్‌ను నేరుగా విదేశాంగ మంత్రిని చేశారని స్పష్టపడుతున్నది.

ఈ చర్య ద్వారా ప్రధాని మోడీ మంత్రివర్గ కూర్పులో ప్రత్యేక విజ్ఞతను చాటుకున్నారని భావించాలి. ప్రధాని ఈసారి ఆర్థిక, రక్షణ, హోం శాఖల కేటాయింపులో చాకచక్యంగా వ్యవహరించారు. తన కుడి భుజం అమిత్‌షాను హోం మంత్రిని చేయడం ద్వారా అత్యంత ప్రధానమైన ఆ శాఖను తనకు మరింత చేరువగా అనువుగా చేసుకున్నారు. తన గత మంత్రివర్గంలో హోం శాఖను నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌నాథ్ సింగ్‌ను రక్షణ మంత్రిని చేసి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించారు. గతంలో నిర్మలా సీతారామన్‌ను రక్షణ మంత్రి చేసి ఆశ్చర్యపరిచిన మోడీ ఈసారి ఆమెకు ఆర్థిక శాఖనే అప్పగించి మహిళలకు తామిస్తున్న ప్రాధాన్యతను చాటారు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిలో కొనసాగుతున్నది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు (జిడిపి) దారుణంగా పతనమైపోయింది.

గత కొన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా ఈ జనవరి మార్చి త్రైమాసికం జిడిపి వృద్ధి అతి తకువ స్థాయిలో 5.8 శాతంగా రికార్డయింది. 2018 ఏప్రిల్ జూన్‌లో జిడిపి వృద్ధి 8% కాగా ఆ ఏడాది జూలై సెప్టెంబర్‌లో అది 7%. ఆ తర్వాత అక్టోబర్ డిసెంబర్‌లో 6.6 శాతానికి, తాజాగా జనవరి మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి పడిపోయింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనిపించుకున్న ఇండియా పేరు దీనితో మసకబారిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రమంగా ఒక పద్ధతిలో పతనమవుతున్న ఈ వృద్ధి రేటును తిరిగి శిఖర బాట పట్టించడమనేది నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న అతిపెద్ద సవాలు. ఇప్పటికే బ్యాంకులను ముంచివేసిన నిరర్థక ఆస్తుల సమస్య వంటివెన్నో చిక్కులు ఆమె దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి.

దక్షిణాదికి చెందిన నిర్మలకు ఈ కీలక పదవి లభించడం ఎంతైనా హర్షించదగినది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి అమేథీ స్థానంలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి మహిళ, శిశు అభివృద్ధి, జౌళి శాఖలను అప్పగించి ఆమె ప్రాధాన్యాన్ని కాపాడారు. నితిన్ గడ్కరి, పీయూష్ గోయెల్, రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రాం విలాస్ పాశ్వాన్, హర్షవర్దన్ వంటివారికి తగిన కీలక పదవులను కట్టబెట్టారు. మన రాష్ట్రానికి సంబంధించి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం లభించడం ఆనందించవలసిన పరిణామం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోక్‌సభ ఎన్నికలలో లభించిన విజయం కిషన్ రెడ్డికి ఊహించని మంచి చేసింది. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖ దేశంలో అన్ని వర్గాల మధ్య సామరస్యానికి ముప్పు కలగకుండా చూడవలసి ఉంది. ఒడిశాకు చెందిన అతిపేద నేపథ్యం కలిగిన ప్రతాప్ చంద్ర సారంగిని మంత్రివర్గంలోకి తీసుకోడం ద్వారా మోడీ తన ప్రతేకతను చాటుకున్నారు. మోడీ సారథ్యంలో ఈ బృందం దేశ ప్రజల ఆశలను నేరవేర్చాలని కోరుకుందాం.

Ravi Shankar Prasad as Union Law Minister in Modi govt

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీ కూర్పులో నేర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: