పరుశురాముడు ప్రతిష్టించిన పరమశివుడు

విజయవాడలోని యనమలకుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉంది. శివుని భక్తుడు, ప్రియ శిష్యుడూ అయిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించిన లింగమిదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమశివుడిని పూజిస్తే కష్టాలు గొడ్డలితో కూల్చినట్లు సమూలంగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కృష్ణాతీరంలో వాయులింగంగా శివుడిక్కడ పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా వెలుగొందింది. ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని విశ్వసించేవారు. ఎక్కడెక్కడి సాధకులో వచ్చి ఘోరతపస్సు చేసేవారు. వేయిమంది మునులు తపస్సును ఆచరించిన […] The post పరుశురాముడు ప్రతిష్టించిన పరమశివుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విజయవాడలోని యనమలకుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉంది. శివుని భక్తుడు, ప్రియ శిష్యుడూ అయిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించిన లింగమిదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమశివుడిని పూజిస్తే కష్టాలు గొడ్డలితో కూల్చినట్లు సమూలంగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కృష్ణాతీరంలో వాయులింగంగా శివుడిక్కడ పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా వెలుగొందింది.

ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని విశ్వసించేవారు. ఎక్కడెక్కడి సాధకులో వచ్చి ఘోరతపస్సు చేసేవారు. వేయిమంది మునులు తపస్సును ఆచరించిన చోటు కాబట్టి, ‘వేయి మునుల కుదురు’ అన్న పేరొచ్చింది. అదే కాలక్రమంలో యనమలకుదురుగా స్థిరపడింది. మునిగిరి అనీ పిలుస్తారు. ఇప్పటికీ ఈ గాలిలో ఓంకార నాదం వినిపిస్తుందని ప్రచారం ఉంది.
స్థల పురాణం: దశావతారాల్లో పరశురామ అవతారం ఆరవది. త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడంటారు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన గొడ్డలిని కానుకగా పొంది… పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు. ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. అదీ పరశురాముడి శక్తి!

ఒకానొక సందర్భంలో…అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రిమాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు. కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు… ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆ తర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు. సీతాస్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.

తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యానికి కూడా వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలసిన పార్వతీరామలింగేశ్వరస్వామిని దర్శించుకుని వేదోక్తంగా పునఃప్రతిష్ఠంచినట్టు స్థానికుల కథనం. అదే సమయంలో కొండపై నుంచి నదీప్రవాహం వరకూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించాడంటారు. కాలక్రమంలో అవి భూగర్భంలో కలసిపోయాయి. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది. వనవాస సమయంలో… సీతారాములు రామలింగేశ్వరస్వామిని పూజించారని కూడా ఓ కథనం.

ఎంతోమంది పాలకులు, ఆదిదంపతుల్ని అర్చించి తరించారు. చాళుక్యులూ, కాకతీయులూ రెడ్డిరాజులూ, విజయనగర ప్రభువులూ మునిగిరి మహాదేవుడిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యాల్నీ, అనావృష్టినీ చోరభయాల్నీ పరశురాముడు పరశువు (గొడ్డలి)తో రూపుమాపుతాడని భక్తుల నమ్మకం. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయకుడు, దాసాంజనేయస్వామి కొలువుతీరారు.
ఎలా వెళ్లాలంటే: విజయవాడ బస్, రైల్వేస్టేషన్లకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. కనకదుర్గమ్మ దేవాలయం నుంచి అయితే ఏడు కిలోమీటర్లు.

Ramalingeswara Swamy Temple in Yanamalakuduru

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పరుశురాముడు ప్రతిష్టించిన పరమశివుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.