అనుబంధానికి రక్ష

చిన్నప్పుడు ఎక్కువగా గారాలు పోయేది, గొడవలు పడేది, పోటీ పడేది సోదరీ సోదరులతోనే… తల్లిదండ్రుల కంటే అన్నదమ్ములతోనే ఎక్కువ అనుబంధం అమ్మాయిలకు… ఏ ఆపద వచ్చినా అన్న చూసుకుంటాడులే అనే ధైర్యం … పురాణకాలం నుంచి ఇప్పటికీ, ఎప్పటికీ రాఖీ ప్రాముఖ్యత ఎనలేనిది.. కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా భేదం లేదు. వయసుతో సంబంధం లేదు.. రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ […] The post అనుబంధానికి రక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చిన్నప్పుడు ఎక్కువగా గారాలు పోయేది, గొడవలు పడేది, పోటీ పడేది
సోదరీ సోదరులతోనే…
తల్లిదండ్రుల కంటే అన్నదమ్ములతోనే ఎక్కువ అనుబంధం అమ్మాయిలకు…
ఏ ఆపద వచ్చినా అన్న చూసుకుంటాడులే అనే ధైర్యం …
పురాణకాలం నుంచి ఇప్పటికీ, ఎప్పటికీ రాఖీ ప్రాముఖ్యత ఎనలేనిది..
కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా భేదం లేదు. వయసుతో సంబంధం లేదు.. రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అంటూ మగవారు ఆశీర్వదించడం ఆనవాయితీ..

ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండగ కాబట్టి ఈ పండగను శ్రావణ పౌర్ణమిగా, మరికొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో ‘ఆవని విట్టం’, బీహార్ , మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో “కంజరి పూర్ణిమ”గా రక్షా బంధన్‌ను నిర్వహిస్తారు. గోవా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతువు ప్రారంభమైనట్లు ప్రజలు భావిస్తారు.

ఆత్మీయ బంధనాలను గాలికొదిలేస్తున్న ప్రస్తుత కాలంలో బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లోనూ రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నారు. రాఖీ పండగ వచ్చిందంటే ఇల్లంతా సందడి, సందడిగా ఉంటుంది. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని మార్కెట్లో రకరకాల రాఖీలు మనకు దర్శనమిస్తాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి సృజనాత్మకతతో కూడిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో చాలా మంది స్వయంగా రాఖీలను తయారుచేస్తున్నారు. అలాంటివే ఉపయోగిస్తున్నారు. సాధారణ రాఖీలు రూ.5 నుంచి రూ. 60 వరకు లభిస్తుండగా, ముత్యాలు, రాళ్లు పొదిగిన రాఖీలు మాత్రం రూ.100 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి.. వారివారి స్థాయిని బట్టీ అన్నదమ్ములకు రాఖీలను కడుతునారు. అనుబం ధాన్ని ప్రేమతో కొలవ డమే ఈ పండుగ ఉద్దేశం.

పురాణకాలంలోనే రక్షాబంధన్ : పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది.

సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధన ఆచారమే నేడు రాఖీ పండుగగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం: ఇతిహాసాల ప్రకారం ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుని వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

మహావిష్ణువు – బలిచక్రవర్తి: శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.

పురుషోత్తముడి కథ: చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన.

అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్ధం విరమించుకుంటాడు.

హయగ్రీవావతారం: శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది.

చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు.అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు.

అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి జరపడం కనిపిస్తుంది.

జంధ్యాల పౌర్ణమి కూడా ఈరోజే….

శ్రావణపౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు ఇతరత్రా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు, ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు.
* విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించిందీ ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతినీ జరుపుకొంటారు.
* బెంగాల్ రాష్ట్రంలో ఝూలన్ పౌర్ణమి పేరుతో, ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు.
* కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ‘కజరి పౌర్ణమి’ పేరుతో గోధుమ నాట్లు వేస్తారు.
* సముద్రతీరంలో ఉండేవారు ‘నరాళీ పౌర్ణమి’ పేరుతో సముద్రదేవునికి
కొబ్బరికాయలను సమర్పిస్తారు.

శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా, రక్షాబంధనానికే తొలి ప్రాధాన్యత. రాష్ట్రం ఏదైనా, లోకంలో ఎక్కడున్నా ఆఖరికి భగవంతుని నమ్మినా నమ్మకున్నా, రాఖీ పండుగ చేసుకుంటే బాగుండు అనుకోని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! రాఖీ రోజు ఆడామగా అంతా ఉదయాన్నే లేచి తలార స్నానం చేస్తారు. ఆపై సోదరికి ఎదురుగా కూర్చుని రాఖీ కట్టించు కుంటారు. రాఖీ కట్టిన తర్వాత తన సోదరుని సకల విజయాలూ కలగాలని ఆశిస్తూ, అతనికి హారతి ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్ది, తీపిని తినిపిస్తారు. ఇందుకు బదులుగా సోదరులు మనస్ఫూర్తిగా బహుమతులను అందిస్తారు.

 మల్లీశ్వరి వారణాసి

Raksha Bandhan 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనుబంధానికి రక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.