రాహుల్ గాంధీ రాజీడ్రామా..

  ఇప్పుడు కాదు ఎప్పు డో చాలా కాలం క్రితం, ‘న్యూ యార్క్ టైమ్స్’ సౌత్ ఏషియా కరెస్పాండంట్, గార్దినేర్ హర్రిస్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి ఒక విశ్లేషణ చేశారు. రాహుల్ అసలు రాజకీయ నాయకుడే కాదంటూ మొదలుపెట్టి ఆయనలో నాయకత్వ లక్షణాలు లేనేలేవని తేల్చి చెప్పారు. రాహుల్ ను నాయకుడిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు రాహుల్ గాంధీనే నమ్ముకుంటే చివరకు […] The post రాహుల్ గాంధీ రాజీడ్రామా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పుడు కాదు ఎప్పు డో చాలా కాలం క్రితం, ‘న్యూ యార్క్ టైమ్స్’ సౌత్ ఏషియా కరెస్పాండంట్, గార్దినేర్ హర్రిస్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి ఒక విశ్లేషణ చేశారు. రాహుల్ అసలు రాజకీయ నాయకుడే కాదంటూ మొదలుపెట్టి ఆయనలో నాయకత్వ లక్షణాలు లేనేలేవని తేల్చి చెప్పారు. రాహుల్ ను నాయకుడిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు రాహుల్ గాంధీనే నమ్ముకుంటే చివరకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోతుందని భవిష్యవాణి వినిపించారు.

ఒక ప్రైవేటు టివి చర్చా కార్యక్రమంలో (కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రందీప్ సింగ్ సుర్జీవాలా సమక్షంలో) హర్రిస్ నాటకీయంగా, అభినయ యుక్తంగా చేసిన ఈ వ్యాఖ్య నవ్వులు పూయించింది. అంతే కాదు హర్రిస్ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఇప్పటికి కూడా అవుతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే హర్రిస్ జోస్యం ఇంచుమించుగా నిజం అవుతున్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. నిజమే ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ కనుమరుగైపోతుందని అనుకోవడం సరికాదు. రాజకీయాలలో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం కొత్త విషయం ఏమీకాదు.

నాలుగు వందల పైచిలుకు స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితికి చేరుకుంటే, బిజెపి రెండంటే రెండు స్థానాల నుంచి 300 మార్కును దాటేసింది. అయినా, ప్రస్తుతం కాంగ్రెస్ కథ ముగింపుకు చేరిందన్న అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. అయితే, ఇలాంటి అభిప్రాయం ఏర్పడడానికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఒక్క టి మాత్రమే కారణం కాదు. నిజానికి ఓటమి కంటే ఓటమి అనంతరం రాహుల్ గాంధీ తీసుకున్న రాజీనామా నిర్ణయం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

గత (2014) లోక్‌సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఎరగని ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 543 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలకు పరిమితం అయింది. ఇప్పుడు ఐదేళ్ళ అనంతరం జరిగిన ఎన్నికలలో స్వల్ప తేడాతో ఇంచుమించుగా అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. గతం కంటే కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే హస్తం పార్టీకి అధికంగా వచ్చాయి. మరో వంక అటు బిజెపి గతం కంటే 20కి పైగా అధిక స్థానాలు గెలుచుకుని 303 స్థానాలతో వరసగా రెండవసారి సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది.

ఎన్‌డిఎ 350 మార్కును దాటింది. అంతే కాదు, తమిళనాడు, కేరళ మినహా మరో రాష్ట్రంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి రెండంకెల సంఖ్యలో సీట్లు రాలేదు. ఏకంగా 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరవ లేదు. చివరకు, తాతల కాలం నుంచి ‘కుటుంబ కంచుకోట’ అనుకున్న అమేథీ నియోజక వర్గంలో స్వయంగా రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలుంటే కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది.ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం పొందడం ఇప్పట్లో జరిగేపని కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది.

అదలా ఉంటే, ఓటమి గాయం పూర్తిగా మాయక ముందే రాహుల్ గాంధీ రాజీనామా డ్రామాను తెరపైకి తెచ్చారు. అది ఆయన రాజకీయ అజ్ఞానమో, అహంకారమో మరొకటో గానీ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడం పార్టీలో గందరగోళాన్ని సృష్టించింది. నిజానికి, పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసుంటే, అది కొంత హుందాగా, గౌరవంగా ఉండేది. కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని అంటూనే, ఓటమి నెపాన్ని సీనియర్ల మీద నెట్టే గట్టి ప్రయత్నమే చేశారు. అంతే కాకుండా ఇంకెవరు నోరు విప్పకుండా, వేలెత్తి చూపకుండా ముందస్తు వ్యూహంలో భాగంగా రాజీనామా డ్రామా ను తెరపైకి తెచ్చారు.

అంతేకాకుండా, మర్మగర్భంగానే అయినా సీనియర్ నాయకులూ చాలా మంది రాజీనామా చేయాలన్న సంకేతాలను ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ తదితర సీనియర్ నాయకుల మీద చిందులేసి, చిదంబరం, గెహ్లాట్ తమ కుమారులను గెలిపించుకోవడంపై దృష్టి నిలిపి పార్టీని పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే, రాఫెల్ వ్యవహారంలో తాను కాయిన్ చేసిన ‘చౌకీదార్ చోర్’ నినాదాన్ని జనంలోకి తీసుకుపోలేదని సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, మోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తాను సాగించిన పోరాటంలో పార్టీ సీనియర్ నాయకులూ కలిసి రాలేదని గట్టిగానే గళం విప్పారు.

ఒక విధంగా కమల్‌నాథ్,, గెహ్లాట్ లాంటి వారు బిజెపితో కుమ్ముక్కు అయ్యారనే ఆరోపణలు నేరుగా తాను చేయక పోయినా, రాహుల్ బృందంగా పేరొందిన నాయకులు టివి చర్చల్లో కమలనాథ్, గెహ్లాట్ లాంటి వారిని పార్టీ ద్రోహులుగా దూషిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి ఇవిఎంలు కారణమని మరో వాదన తెరపైకి తెచ్చారు. అంతేకాదు, రాన్నున్న కొద్ది నెలల్లో జరిగే వేర్వేరు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో ఇవిఎంలను తీసేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలనే బహిష్కరించాలని అంతర్గత చర్చల్లో రాహుల్ గాంధీ అన్నట్లు వార్త లొచ్చాయి. మొత్తం చూస్తే రాహుల్ గాంధీ, ఎన్నికల ఘోర పరాజయం ఫలితంగా ఇంటా బయట ఎదురయ్యే దాడుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే రాజీనామా డ్రామా ఆడుతున్నారని, కొద్ది కాలం పాటు అధ్యక్ష పదవికి దూరంగా ఉన్నా, 2024 ఎన్నికల నాటికి మళ్ళీ బయటకు రావచ్చన్న వ్యూహం ప్రకారమే కథ నడుపుతున్నరన్న సందేహాలు వినవస్తున్నాయి.

అదలా ఉంటే, మరోవంక రాహుల్ గాంధీ వ్యవహారం అలకపాన్పు ఎక్కినా కొత్తల్లుడిని గుర్తుకు తెస్తోందాని విశ్లేషకులు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ల మీద అలిగి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేగాని, ఓటమికిగల కారణాలను లోతు గా అధ్యయనం చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని నిలిపే ప్రయత్నం ఏమాత్రం చేయ లేదు. ఒక విధంగా చూస్తే అందుకు విరుద్ధంగా పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు, తమ అసమర్ధత, అపరిపక్వ నాయకత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే రాజీనామా నాటకం ఆడారని అనిపిస్తోందనీ అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడం ఇదే మొదటిసారి కాదు, గతంలో అత్యవసర పరిస్థితి అనంతరం ఇందిరా గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.

ఇపుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినా, రాయిబరేలీలో సోనియా గాంధీ విజయం సాధించారు. అప్పట్లో అయితే రాయబరేలి, అమేథీ నుంచి తల్లీకొడుకులు (ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ) ఇద్దరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఏకంగా చీలికే వచ్చింది. కాసు బ్రహ్మానంద రెడ్డి సారథ్యంలో ఏర్పడిన రెడ్డి కాంగ్రెస్’ ఇందిరా కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాలుగా నిలిచింది. మరో వంక కేంద్రంలో ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ఆకృత్యాలను, నేరాలను అడ్డుపెట్టుకుని ఇందిరా గాంధీని ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు జైలుకు కూడా పంపింది. అయినా, ఇందిరా గాంధీ కాడి వదిలేయ లేదు. ఓటమిని సవాలుగా తీసుకుని మొక్కవోని ధైర్యంతో కేవలం 11 నెలల కాలంలోనే తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అలాగే, రాజీవ్ గాంధీ కూడా ఓటమి చవి చూశారు. అయినా, పలాయనం చిత్తగించ లేదు. పోరాడుతూనే హత్యకు గురయ్యారు.

అంతవరకూ ఎందుకు సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. అయినా, పోరాడి అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ, రాహుల్ గాంధీలో ఆ స్థైర్యం, ధైర్యం కనిపించడం లేదు సరికదా పలాయన వాదాన్ని పరుగులు తీయిస్తున్నారు అనిపిస్తోంది. అందుకే, ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా రాజీనామా నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీ మంకు పట్టు వీడడం లేదు. అయితే ఇలా సుదీర్ఘ కాలం పాటు ప్రతిష్టంభన కొనసాగడం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు సహజంగానే ఆందోళన చెందుతున్నారు. ఇంకొందరేమో కౌంటర్ రాజీనామాల డ్రామాను తెరపైకి తెచ్చారు.

పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, ఎఐసిసి కమిటీ లీగల్ హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగాల అధ్యక్షుడు వివేక్ తంఖా తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు, రాహుల్ గాంధీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చేందుకు మిగిలిన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. అయన బాటలో అనేక స్థాయి నాయకులు రాజీనామాలు సమర్పించారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఎవరి మీదనో కోపంతో, ఇంకెవరినో బలి పశువును చేసేందుకు ఒక వ్యూహం ప్రకారమే రాహుల్ గాంధీ ఈ డ్రామా అడుతున్నరేమో అనిపిస్తుంది.

ఇదొక కోణం అయితే, రాహుల్ గాంధీలో మరో కోణం కూడా ఉందని అంటారు, అది కుటుంబ వారసత్వంగా వచ్చిన అహంకారం. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులే కాదు, సామాన్య ప్రజలు, మీడియా కూడా అమాయకుడు ఆయనకు, ఏమీ తెలియదని అనుకుని పొరపడుతుంటారు. రాహుల్ గాంధీ కి విషయ పరిజ్ఞానం తక్కువే, పార్లమెంట్’ ప్రసంగాలలో, పబ్లిక్ మీటింగుల్లో ఇంకా అనేక ఇతర సందర్భాలలో ఆయన తన అమాయకత్వంతో కూడిన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. నిజానికి రాహుల్ గాంధీకి, ఆ మాట కొస్తే, గాంధీ-నెహ్రూ పరివారానికి, తమ నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవలసిన అవసరం ఇంతకు ముందు ఏర్పడ లేదు.

వారసత్వ హక్కుగా అధికారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుభవించడమే గానీ, అధికారం కోసం కష్టపడడం, ఉచ్యమాలు చేయడం గాంధీ, నెహ్రూ కుటుంబీకులకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ఇంతకుముందు రాలేదు. వారసత్వంగా వచ్చిన అహంకారం వలన చేత కానీయండి లేదంటే ఆయన చుట్టూ చేరిన భజన బృందాలు, భట్రాజులు వినిపించే శోత్ర గీతాల కారణంగా అయితే నేమి రాహుల్ గాంధీ తన స్థానాన్ని, స్థాయిని ఎక్కువగా ఉహించుకుంటారు. ఒక ప్రధాని ముని మనవడు, మరో ప్రధాని మనవడు, ఇంకో ప్రధాని తనయుడు అయిన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి తనకు దైవ సంబంధమైన జన్మ హక్కుగా భావిస్తారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇంకా చాలా కారణాలు ఉన్నా, రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రదర్శించిన అహంకారం కూడా ఒక ప్రధాన కారణం అనేది కాదనలేని వాస్తవం.

ప్రధానిని లక్ష్యం గా చేసుకుని సరైన ఆధారాలు లేకుండా చేసిన తీవ్ర ఆరోపణలు, ‘చౌకీదార్ చోర్’ నినాదం కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను దెబ్బ తీసింది. అలాగే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడంలోనూ రాహుల్ గాంధీ అహంకారంతో వల్లనే ప్రతిపక్షాల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. అలాగే, ప్రచారంలో అందరినీ కలుపుకుని పోవడంలో అయితే నేమి, ప్రజల విశ్వాసం చూరగొనడంలో అయితేనేమి ఒకటని కాదు, అనేక విధాలుగా రాహుల్ గాంధీ వ్యవహార, ప్రచార సరళి పార్టీ ఓటమికి గల ప్రధాన కారణాలలో ప్రధమ స్థానంలో ఉంటుందన్నది కాదనలేని వాస్తవం.

జరిగిదేదో జరిగింది, ఇప్పటికైనా రాహుల్ గాంధీలో మార్పు వచ్చిందా అంటే, అబ్బే అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ‘రాజు తప్పు చేయడు’ అన్న రాజరిక వారసత్వ వాసనల నుంచి రాహుల్ గాంధీ బయటపడిన దాఖలాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధీ మారలేదు. అదే అహంకారంతో వ్యవహరిస్తున్నారు అనేందుకు నడుస్తున్న చరిత్రే సా క్ష్యం. ఇదే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును మరింత ప్రశ్నార్ధకం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Rahul Gandhi’s Compromise Drama

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాహుల్ గాంధీ రాజీడ్రామా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: