ట్రిపుల్ మాస్‌లా ‘కాంచన 3’

Kanchana 3రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి, కోవై సరళ, శ్రీమాన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయనున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ బ్రోచర్‌ను అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్ సన్నిహితంగా ఉంటున్నాడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ‘హిట్లర్’ సినిమాకు డ్యాన్స్ మాస్టర్‌గా మారి… ఇప్పుడు లారెన్స్ ఓ బ్రాండ్‌లా తయారయ్యాడు. అతని సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లారెన్స్‌కు లేదు.

సంపాదించిన దాన్ని పది మందికి పంచాలనుకుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి తన శిష్యుడిని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ప్రకటించారు. ఆయన తరపున నేను లారెన్స్‌కు చెక్కును అందిస్తున్నాను”అని అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాతో పాటు నటించిన వేదిక ‘ముని’లో కూడా నాతో పాటు నటించింది. ఆమె లక్కీ హీరోయిన్. ఇప్పుడు ఆమె ‘కాంచన 3’లో అద్భుతంగా నటించింది. నిక్కీ తంబోలి చాలా చక్కగా కామెడీ నటనతో మెప్పించింది. ఈ సినిమాలో శ్రీమాన్, కోవైసరళ, దేవదర్శిని లేకుంటే ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ కలిగేది. ఈ సినిమాలో నాకంటే వాళ్లే అసలు హీరోలు. వాళ్లు కామెడీ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. నిర్మాత బి.మధు తెలుగులో ఈ చిత్రాన్ని చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాలని ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను.

ఇక నేను ఇక్కడ డ్యాన్స్ మాస్టర్‌గా రాణించడానికి ముందు చిరంజీవి నాతో ‘నువ్వు బాగా ఎదుగుతావురా’ అని చెప్పారు. ఆయన నాకు ‘హిట్లర్’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్‌గా ఛాన్స్ ఇవ్వకుంటే నేను నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్‌ను అయ్యేవాడిని కాను. నాగార్జున నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవారే కారు. ఇప్పుడు 150 పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించేవాడిని కాను. నా ఇంట్లో 60 మంది పిల్లలు చదివేవాళ్లు కారు. ఇన్ని జరుగుతున్నాయంటే కారణం నన్ను ఆశీర్వదించిన సూపర్‌స్టార్ రజనీకాంత్, అన్నయ్య చిరంజీవి, నాగార్జునకు థాంక్స్. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమె లేకుంటే నేను బ్రెయిన్ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాడిని. మా అమ్మే నాకు దేవుడు. ఆమెకు గుడి కూడా కట్టించాను. ఇక ‘కాంచన’ విడుదల సమయంలో నేను థియేటర్ బయట కూర్చొని పాప్‌కార్న్ తింటున్నాను. ఓ అమ్మ తన ఇద్దరి పిల్లలతో థియేటర్‌కు వచ్చింది.

టికెట్స్ అయిపోయాయని థియేటర్ వాళ్లు చెప్పారు. పిల్లలు ఏడవడం స్టార్ట్ చేశారు. వెంటనే ఆ అమ్మ తన దగ్గర దాచుకున్న డబ్బులతో బ్లాక్‌లో టికెట్స్ కొని పిల్లలను సినిమాకు తీసుకెళ్లింది. ఆ దృశ్యం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు డబ్బులు ప్రేక్షకుల నుండి వస్తున్నాయి కదా… అలాంటి ప్రేక్షకులకు ఏదైనా చేయాలని ఆలోచించాను. ఆతర్వాత ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించాను. అలాగే నేను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కదా అని భావించి మా అమ్మ ఆశీర్వాదంతో ఇక్కడ కూడా ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించాను. హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్న ఈ ట్రస్ట్‌కు నా వంతుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య ఉన్న వాళ్లు, చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్లు నన్ను సంప్రదిస్తే సహాయం చేస్తాను. ఇక చిరంజీవి అన్నయ్య ఈ ట్రస్ట్‌కు పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు”అని తెలిపారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “సినీ ఇండస్ట్రీలో నాకు చాలా నచ్చిన వ్యక్తుల్లో లారెన్స్ ఒకరు. మాస్ కాదు… డబుల్ మాస్ అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. కానీ ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే ఇది ట్రిపుల్ మాస్‌లా అనిపిస్తోంది. ఈ సమ్మర్‌కు ఈ సినిమా అందరినీ కూల్ చేస్తుందని అనుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి.మధు, వేదిక, నిక్కీ తంబోలి, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Raghava Lawrence Talk about Kanchana 3

The post ట్రిపుల్ మాస్‌లా ‘కాంచన 3’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.