పివి మెమోరియల్‌కు డిజైన్ల పరిశీలన

PV Narasimha Rao memorial in Hyderabad

 

జ్ఞానభూమిలో పివి మెమోరియల్
సిఎం కెసిఆర్ పరిశీలన తర్వాత ఖరారు
కెయులో రిసెర్చ్ సెంటర్, తెలుగు అకాడమీకి పివి పేరుపై పరిశీలన
పివి శతజయంతి ఉత్సవాల కమిటీ భేటీలో నిర్ణయాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి.శతజయంతి ఉత్సావాల సందర్భంగా పివి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నేత, పివి శతజయంతి కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పారు. సోమవారం కెకె. నివాసంలో పివి శత జయంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్యాంక్‌బండ్ వద్ద పివి జ్ఞానభూమిలో నిర్మించనున్న మెమోరియల్‌పై సుధీర్ఘంగా చర్చించారు. ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను పరిశీలించారు. రామేశ్వరంలో అబ్దుల్‌కలాం స్మారకం మాదిరిగా పివి మెమోరియల్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని కెకె ఈ సందర్భంగా తెలిపారు. అయితే దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను పరిశీలించినట్లు ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో పరిశీలించిన డిజైన్లను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కెకె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పొడవునా పివి శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పివితో సన్నిహిత సంబంధాలున్న వారితో సెమినార్లు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వారితో పాటు విదేశాల్లో ఉన్న పివి సన్నిహితులతో సెమినార్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా అమెరికా, మలేషియాలో పివి సన్నిహితులు అధికంగా ఉన్నారని సమావేశంలో చర్చించారు.

అలాగే ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రకటించిన విధంగా వంగర, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చజరిగింది. వీటితో పాటుగా కాకతీయ యూనివర్సిటీలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, తెలుగు అకాడమీకి పివి పేరు పెట్టే అంశం పరిశీలన తదితర విషయాలపైన ఈ సమావేశంలో చర్చజరిగింది. అయితే ప్రస్తుతం పివి మెమోరియల్ డిజైన్లను పరిశీలించి సిఎం కెసిఆర్ అనుమతికోసం పంపారు. అతిత్వరగా పివిజ్ఞాన భూమిలో ఈ స్మారకం నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈసమావేశంలో రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, రమణాచారి, పివి కొడుకు ప్రభాకర్ పాల్గొన్నారు.

PV Narasimha Rao memorial in Hyderabad

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పివి మెమోరియల్‌కు డిజైన్ల పరిశీలన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.