ప్రజా పంపిణీలో ప్రక్షాళన…!

Public Distribution

 

రేషన్ కార్డుదారుల్లో అనర్హుల ఏరివేత
క్షేత్రస్థాయిలో కార్డుల పరిశీలనలో యంత్రాంగం
సంపన్నుల గుర్తింపునకు శ్రీకారం
మరణించిన వారు, వివాహమైన మహిళల తొలగింపు ప్రారంభం
మొత్తంగా 40 శాతం రేషన్ బియ్యం ఆదాకు అవకాశం
మరి కొంతకాలం కొత్త రేషన్ కార్డుల జారీ నిలుపుదల

నల్లగొండ : అణగారిన వర్గాలకే ప్రజా పంపిణీ సరుకులు అందాలన్న ప్రభుత్వం సంకల్పం సకల అడ్డంకులతో నెరవేరడం లేదు. లక్షిత వర్గాలకే పక్కాగా రేషన్ చెందాలన్న పాలకుల లక్షానికి గండిపడుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మొత్తానికి ప్రజాపంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వ యోచనకు స్పీడుగా అడుగులుపడుతున్నాయి. కార్డుదారులే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు చేరవేయడంతో పాటు మెజార్టీ రేషన్ డీలర్‌లు బియ్యాన్ని గోదాముల నుంచే నేరుగా నల్లబజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నమోదైన కేసుల కథాకమామీషు.

దీంతో రేషన్‌బియ్యం నల్లబజారు దందా మాత్రం నిరాటంకంగా సాగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. బియ్యం వాస్తవంగా వాడుతున్నవారికే ఆహార భధ్రతా కార్డులు ఉండాలని సంకల్పించిన ప్రభుత్వం పౌరసరఫరాల విభాగం ఆద్వర్యంలో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. కార్డులు కల్గిన ఉన్నవారిని క్షేత్రస్థాయిలో సం ప్రదింపులు జరుపుతుండడంతో పాటు వారి ఆర్ధిక పరిస్థితి వివరాలు ఆరా తీస్తున్నా రు. సంపూర్ణంగా సమచారం సేకరించేందుకు డీలర్‌లు, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తూ తదుపరి చర్యలు చేపట్టేందుకు ధనికులు, అనర్హుల జాబితాలు రూపొందించేందుకు సిద్దమవుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ–పొస్) ద్వారా రేషన్ సరకులు పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. అదే సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కూడా దేదీప్యమానంగా కొనసాగుతోం ది. వందలాది క్వింటాళ్ళలో బియ్యం పట్టుబడుతుండగా ప్రతి నెలా ఐదారు కేసులు మినహా పెద్దగా అరికట్టే చర్యలు మాత్రం కంటికి కూడా కనబడవు. ఈ-పొస్ విధానం అమలులోకి రాకముందు భారీ స్థాయిలో బియ్యం పక్కదారి పట్టిన ఉదంతాలు ఎన్నో చూడడం జరిగింది. ప్రజా పంపిణీలో సరికొత్త సాంకేతిక తోడుకావడంతో 40శాతం బియ్యం అక్రమాలు అరికట్టగలిగారు.

ఈ-పొస్ విధానానికి మరింత పకడ్బందీ వ్యవస్థను జోడించేందుకు ప్రభుత్వం లోతైన ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వేల 61 రేషన్ దుకాణాలు ఉండగా, 9లక్షల 83వేల 168 రేషన్‌కార్డులున్నాయి. కాగా ప్రతి నెలా 16వేల 524 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో 991 రేషన్‌షాపులకు గాను4 లక్షల 60వేల 419కార్డులుండగా 75వేల 525 క్వింటాళ్ళ బియ్యం సరఫరా అవుతోంది. ఇక సూర్యాపేట జిల్లాలో 609 రేషన్‌షాపులకు గాను 3లక్షల 17వేల 333 కార్డులుండగా 4వేల 858 మెట్రిక్ టన్నుల బియ్యం, అదే విదంగా యాదాధ్రి భువనగిరి జిల్లాలో 461రేషన్‌షాపులు ఉండగా 2లక్షల 5వేల 416కార్డులకు గాను4వేల 114 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది.

పలుకుబడితో కొనసాగుతున్న కార్డుదారులు… ఉమ్మడి జిల్లాలో రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు, మామూళ్ళ వ్యవహారం కారణంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేయడం జరిగింది. ఆహారభద్రత కార్డు కేవ లం సరుకులకే తప్పా ఎందుకూ పనికిరాదని ప్రభుత్వం స్పష్టం చేసినా ఎదో పనికి పనికిరాకుండా పోతుందా అన్న కోణంలో ఉమ్మడి జిల్లాలో చాలా మంది కార్డులు పొందారు.

అటువంటి వారిలో ధనికులతో పాటు అర్హతలేని వారిని సైతం పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ డీలర్‌ల సహకారంతో రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగగా, కార్డుదారుల గుర్తి ంపు ప్రక్రియ చేపడుతున్నారు. గడిచిన రెండు, మూడు మాసాలుగా అసలు కార్డుదారులే ఉండాలన్న సంకల్పంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఉన్నటువంటి కార్డుదారుల్లో సంపన్నులు ఎక్కువగా ఉన్నారని, ప్రాథమికం గా గుర్తించిన జాబితాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉన్నారన్న తెలిసింది.

మరణించిన, వివాహమైన వారిని తొలగింపు షురూ… కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో వేల కార్డులు వృథాగా మిగిలిపోతున్నాయి. గడిచిన నాలుగైదేళ్లు గా మరణించిన వందలాది మంది పేర్లు ఇంకా ఆయా కార్డుల్లో కొనసాగుతున్నా యి. బియ్యం యూనిట్ల సంఖ్య యదాతధంగా కొనసాగుతుండగా బియ్యం కోటా కూడా కొనసాగుతోంది. మరణించిన వారి జాబితాలు రూపొందించి పంపాలని రేషన్ డీలర్‌లకు స్పష్టం చేసిన నేపధ్యంలో జాబితాలు రూపొందుతున్నాయి. వీరితో పాటు కొత్తగా వివాహమైన వారి వివరాలు కూడా సేకరిస్తూ జాబితాలో పొందుపరుస్తున్నారు. వివాహాల జరిగిన నేపథ్యంలో కుటుంబసభ్యులు ప్రాంతాలు, కుటుంబాలు మారుతుండడం అనివార్యమైన సందర్బంలో కార్డుల్లో వారి పేర్లు కొనసాగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అధికారులు తెలియజేస్తున్నారు.

సంపన్నుల గుర్తింపు కోసం నిశిత పరిశీలన… నల్లగొండ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి మూడు జిల్లాల్లోని 9లక్షల 83వేల 168 రేషన్‌కార్డుదారుల్లో సంపన్నులను గుర్తించేందుకు వివిధ మార్గాలను అన్వేషణ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు విక్రయించిన ధాన్యం తద్వారా వచ్చిన ఆదాయం, అదే విధంగా రైతుబంధు పథకంలో ఎక్కువ మొత్తం పెట్టుబడి సాయం వచ్చిన రైతు, వ్యాపారులకు సంబందించి జీఎస్టి చెల్లిస్తున్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. ఈపాటికే సంబందింత సమాచార సేకరణలో నిమగ్నమవ్వగా రెవిన్యూ, వ్యవసాయ శాఖల సహకారం కోరేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇందులో పట్టణాల్లో బహుళ అంతస్థుల నివాసాలు, వివిద వ్యాపారాలు, స్థిరాస్థులు, ప్రైవేటు కంపెనీలు తదితర విషయాల్లో నిశిత పరిశీలన జరుపడం ద్వారా తుదినిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో భూ విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకొని ముందుకు సాగునున్నారు. కాగా అర్హులైన కార్డుదారుల గుర్తింపు ప్రక్రియ, కార్డుల ముద్రణ చేపడుతుండడంతో ఈనెల 4వ తేదీ నుంచి రేషన్‌కార్డుల జారీకి అడ్డుకట్టపడింది. ఎంతో మంది ఆహారభద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం ఆన్‌లైన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. మొత్తానికి ప్రజాపంపిణీలో ప్రక్షాళన పూర్తైతేనే కొత్తకార్డులు జారీ కానున్నాయి.

Public Distribution Goods are for Depressed Classes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రజా పంపిణీలో ప్రక్షాళన…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.